లక్ష్మీనివాసం సినిమాలో పద్మనాభం పాడే పాట “సోడా సోడా, ఆంధ్రా సోడా! గోలీ సోడా, జింజర్ సోడా!’’ అప్పట్లో సూపర్ హిట్టు. కొసరాజు (రాఘవయ్య చౌదరి) మాటల్లో ఉన్న ఉత్సాహం ఏ మాత్రం స్థాయి తగ్గకుండా పిఠాపురం మాంచి ఊపుతో పాడతాడు.
ఆ సినిమా 1960 దశాబ్దంలో విడుదలయింది. బహుశ 67 కావచ్చు. నేను నంద్యాల నేషనల్ థియేటర్ లో ఈ సినిమా చూసినాను. మెయిన్ రోడ్డు మీద నాగులకుంటకు ముందు కొంచెం లోపలికి నడుచుకుని పోతే నేషనల్ థియేటరుండేది.
నాగులకుంట ఎప్పుడూ పచ్చి నాచు వాసన వేస్తుంటుంది. అది దాటితే రామనాథ్ థియేటరూ, ఇంకా ముందుకు పోతే రాజ్ సినిమా హాలూ వచ్చేవి. ఇప్పుడు అవేవీ ఉన్నట్టు లేదు.
పద్మనాభం ఈ పాటకు అద్భుతంగా నటించాడు. ఆ రోజుల్లో దుబ్బ పద్మనాభం ఏం చేసినా నవ్వొచ్చేది. రేలంగి కామెడీ నుంచి క్రమంగా దూరమై క్యారెక్టర్ పాత్రల్లో స్థిరపడుతున్న రోజులవి. పద్మనాభం, అంజిబాబు హాస్యం జనాలకు బాగా నచ్చుతుండేది. వీళ్లకు మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర్రావు ఇచ్చే గొంతుకలో కూడా అంతర్లీనంగా హాస్యం తొణికిసలాడేది.
సోడాబుడ్డీ (దిగువ ఫోటో) ల బండీ తోసుకుంటూ వీధి వీధీ తిరుగుతూ పాట అయిపోయేలోగానే బండి నిండా ఉన్న సోడాలన్నీ అమ్మి పడేసి ఖాళీ సీసాల పెట్టెను దుకాణం యజమానికి ఇచ్చేసి మరో నిండు సీసాల పెట్టెను బండిలో వేసుకుని ఇంకో విడత అమ్మకానికి బయల్దేరుతాడు పద్మనాభం.
ఈ పాట ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ పాట పద్మనాభంది కావడం ఇందుకు మొదటి కారణం కావచ్చు. ఉత్త గ్యాసూ, శుద్ధ గ్యాసూ వంటి సులభంగా అర్థమయ్యే పదాలుండటం ఇంకో కారణం కావచ్చు. అప్పట్లో ఎక్కువగా వినిపించే ఘంటసాల గారి మామూలు పాటల లాగా కాకుండా పిఠాపురం ఇదేదో తమాషాగా పాడటం మరో కారణమోమో.
కొంచెం పెద్దయ్యాక ఈ పాట వింటున్నప్పుడు చిన్న చిన్న పదాలతో కొసరాజు ఎంత గొప్పగా రాశాడు కదా అనుకునేవాడిని. మన ఆంధ్రా ఎండల గురించి, నాయకుల గ్యాస్ మాటలపైనా, పోసుకోలు పాలిటిక్సుపైనా సోడాఘాటు సెటైర్లతో కూడిన ఈ పాటను ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు.
నాకు గుర్తున్నంత మేరకు ఈ పాట వచ్చేసరికి అంటే ఆరవయ్యో దశాబ్దం ద్వితీయార్ధం నాటికి మా నంద్యాలలో సోడాల స్వర్ణయుగం నడుస్తుండింది. అప్పట్లో ఈశ్వర్ సోడా సుప్రసిద్దం. మహానందీశ్వర గుడి నుంచి ముందుకు పోతే కాళికమ్మ గుడి దాటినాక, ఒక వైపు పూలబజారు, ఇంకోవైపు మునిసిపల్ ఆఫీసుకు పోయే చౌకు దగ్గర ఈశ్వర్ సోడా షాపు ఉండేది. పెద్ద బుర్రమీసాలున్న యువశాల్తీ ఫ్రేము కట్టిన ఫోటోను షాపులో ప్రముఖంగా కనిపించేలా బార్ లైటు వెలుగుల్లో ప్రదర్శించే వారు. ఆయనే నంట ఈశ్వర్ అంటే. దుకాణం ప్రొప్రయిటరు. ఆయన ఈశ్వర్ రెడ్డా లేక ఈశ్వర్ రావా అనే వివరాలు నాకు అప్పుడే కాదు ఇప్పటికీ తెలియవు. షాపు లోపల నీళ్లు పోసిన చెక్కతొట్టిలో సోడా సీసాలు పెట్టుకుని చల్లని సోడాలు సిద్ధంగా ఉంచుకునే వాళ్లు. ఈ చెక్కతొట్టిల పైన తడిసిన సంచి పట్ట కప్పి ఉంచేవాళ్లు. షాపు ముందర ఒకవైపు పొడుగాటి బెంచీ, ఇంకోవైపు ఆరేడు గాడ్రెజ్ మడత కుర్చీలు ఉండేవి. ఇవి సోడా తాగేవాళ్లు కూర్చోడానికన్న మాట. సోడా కొట్టే మనిషి ఉండే చోట ఓ చెక్క చప్డా (పెద్దగా వెడల్పు లేని చిన్న అరుగు అనుకోండి) ఉండేది. ఆ చప్డా వెనుక నుంచుని సోడాలు కొట్టి కొట్టి అందించే వాడు.
సోడా సీసా చాలా దళసరిగా గొంతు దగ్గర మెలి తిప్పినట్టు ఉంటుంది. సోడా నీళ్లు బైటకు రాకుండా సీసా గొంతులో ఓ నీలం రంగు గోలీగుండు అడ్డంగా ఉంటుంది. సోడా కొట్టే మనిషి దగ్గర చెక్కతో చేసిన ఓపెనర్ ఉంటుంది. ఈ ఓపెనర్ మధ్యలో చిటికెన వేలి సైజులో ఉన్న దిమ్మతో మూతి దగ్గర గట్టిగా నొక్కితే సీసా కెవ్వుమని అరుస్తుంది. అప్పుడు గోలీ పక్కకు తప్పుకుని సోడా నీళ్లకు దారిస్తుంది. ఈ కెవ్వు కేక ఎంత గట్టిగా వస్తే సోడా అంత స్ట్రాంగన్నమాట. ఇది సోడా సూత్రం.
ఓపెనర్ తో సోడా కొట్టడం అందరి వల్లా అయ్యేపని కాదు. దానికి కొంత అనుభవం అలవాటు ఉండాలని అప్పట్లో నాకనిపించేది. ఒక్కోసారి ఆ యొక్క సోడా షాపువాడు ఓపెనర్ వెంటనే చేతికి దొరక్కపోతేనో లేక ఎచ్చులు చూపించడానికో మధ్యవేలిని సోడా మూతిలోకి పెట్టి ఇంకో చేత్తో ఠప్పుమని కొట్టి సోడాని కెవ్వు మనిపించేవాడు. కానీ అది మంచి పద్ధతి కాదనీ, సోడా పేలితే మొహం పగులుతుందని కొంతమంది పెద్దవాళ్లు నాకు చెప్పేవాళ్లు.
సోడా కొట్టి ఇస్తే పెద్ద వాళ్లయితే సీసా తోనే డైరెక్టుగా తాగేవాళ్లు. మా లాంటి ఆరేడేళ్ల పిల్లలకైతే సోడా కొట్టే అతనే గాజు గ్లాసులోకి పోసి ఇచ్చేవాడు. స్టీలు/సత్తు గ్లాసుల్లో కాకుండా గాజు గ్లాసులో ఏం తాగినా గొప్పగానే ఉండేది.
ఈశ్వర్ సోడా దుకాణంలో సాదా సోడా కాకుండా నిమ్మకాయ సోడా, జింజర్ సోడా, నిమ్ లెట్ లేదా కలర్ సోడా దొరికేవి. సాదా సోడా అయితే అదో రకం కొంచం ఉప్పటి రుచితో, ముక్కులో కెక్కుతానని బెదిరిస్తున్నట్టనిపించే (ఒక్కోసారి ఎక్కేస్తుంది కూడా) ఘాటుతో, గొంతులోకి దిగగానే చల్లగా, కడుపులోకి పోయాక అదో రకం హాయిగా అనిపిస్తుండేది. ఇదంతా నేను పద్మనాభం పాట నాటి అనుభవాన్ని గుర్తు చేసుకుని రాస్తున్నానని గమనించ ప్రార్థన. మళ్లీ నంద్యాలకు పోయి సోడా తాగినా ఇప్పుడంత గొప్పగా ఉంటుందో లేదో నాకే నమ్మకం లేదు. గ్లాసులో కొంచెం ఉప్పు, జిలకర, వాము పొడి, ఒక నిమ్మకాయ ఒప్పును పూర్తిగా పిండితే వచ్చే రసం వేసి, దాంట్లోకి ఫ్రెష్ గా కొట్టిన సోడాను కొద్ది కొద్దిగా వేస్తూ చెంచాతో కలుపుతుంటే అది బుసబుసమని పొంగుతుంటుంది. ఇది నిమ్మకాయ సోడా. సోడా సగం కూడా వొంపక ముందే పొంగులోని బుడగలు గ్లాసంతా నిండిపోయి పక్కకు వొలికి పోతుంటాయి కాబట్టి సోడా కలపడం ఆపెయ్యాలి. ఓ అరనిమిషానికి నిమ్మకాయకు కోపం తగ్గుతుంది కాబట్టి అప్పుడు మళ్లీ అదను చూసుకుని మిగతా సోడాను వొంపితే సోడానీళ్లతో నిండిపోయినా బుడగలు గ్లాసు నెత్తిన డోములాగా వస్తాయే తప్ప సోడా వొలికిపోదన్న మాట. ఇప్పుడు తాగితే సాదా సోడా కంటే ఘాటుగా, నిమ్మ, జిలకర కలగలసిన రుచితో నిమ్మకాయ సోడా అద్భుతంగా ఉంటుంది. మాంచి మృష్టాన్నభోజనం చేశాక నిమ్మకాయ సోడా తాగితే పది పదిహైదు నిమిషాల్లోపల నాలుగైదు త్రేన్పులు తోసుకొచ్చి భుక్తాయాసం తగ్గిపోతుందనీ, జీర్ణక్రియ కూడా సులభమవుతుందని ఇప్పటికీ చాలా మంది మిత్రులు గట్టిగా నమ్ముతారు.
నంద్యాలలో జింజర్ సోడా తాగినట్టు నాకు గుర్తు లేదు. అయితే మా అత్తగారి ఊరు పెనుకొండలో మాత్రం ఇప్పటికీ అప్పుడప్పుడూ జింజర్ సోడా తాగుతుంటాను. ఇది కూడా జీర్ణానికి మంచిదనే చెబుతుంటారు. కోటవాకిలికి దగ్గర ఒకప్పటి స్టేట్ బ్యాంకు బ్రాంచికి చేరువలో వసంత అంగడిలో అమ్మే జింజర్ సోడా కడుపులో రాళ్లున్నాకరిగించి పడేసేంత ఘాటుగా ఉండేది. పులుపు, చేదు, వగరు అనే మూడు రుచుల్ని రోట్లు వేసి దంచినట్టుండేది ఆ రుచి. సొడా కొట్టి ఇచ్చాక డైరెక్టుగా సీసాతోనే తాగడం బహుశ గరళకంఠుడైన శివుడికి కూడా సాహసంతో కూడిన పనే అనిపిస్తుంది. గ్లాసులో తాగేప్పుడు కూడా మహా మహా అనుభజ్ఞులైనా సరే మొదటి గుటక మింగాక కళ్లలో ముక్కులో చెలరేగే ప్రతిస్పందనల్ని సముదాయించుకోడానికై ఓ నిముషం నిదానించక తప్పుదు.
ఇకపోతే కలర్ సోడా ముఖ్యంగా చిన్నపిల్లల కోసమన్నమాట. ఇది కొంచం తియ్యగా ఉంటుంది కాబట్టి తీపు సోడా అని కూడా అంటారు. కలర్ సోడాకు కొంచం నిమ్మకాయ రసం కలిపితే తియ్యగా, పుల్లగా, కొంచం ఘాటుగా బానే ఉంటుంది.