ఆర్టీసియూనియన్ల మీద ప్రభుత్వాభిమానుల కొత్త క్యాంపెయిన్ షురూ?

రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే మూడు నుంచి నాలుగు వేల రూట్లలో ప్రైవేటువాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మొదలయింది. దీనిని టిఆర్ ఎస్ అభిమానులు బాగా ప్రచారం చేస్తున్నారు
ఆర్టీసీ కార్మికసంఘాలు తరచూ సమ్మెలకు దిగడంవల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నదనేది  ఈ క్యాంపెయిన్ సారాంశం.
రెండుమూడ్రోజుల్లోనే రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి, దీని మీద ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు తుది నిర్ణయం తీసుకుంటారని  వారు ప్రచారం చేస్తున్నారు.
ఆర్టీసీ సమస్యను కార్మికసంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నదని ఈలోపు ప్రజలకు  ప్రజలకు అసౌకర్యం కలుగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదట.
భారీ స్పందన
 బస్సులు నడుపడానికి ప్రైవేటువాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు రావడం గమనార్హం  ఈ క్యాంపెయిన్ లో ప్రచారం చేస్తున్నారు.
దీన్నిబట్టి రాష్ట్రంలోని ప్రైవేటువాహన యజమానుల నుంచే కాకుండా, ఇతర రాష్ర్టాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు వాళ్లు చెబుతున్నారు.
యూనియన్లు లేని ఆర్టీసి
విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్‌ ఉన్నప్పుడు, ఇలా అదను చూసుకుని కార్మికసంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయని. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నాయని  సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నదనే వాదనను జనంలోకి తీసుకుపోతున్నారు.
‘దాదాపు 40 ఏండ్లనుంచి ఇదేతంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధరూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటువారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం,’ అని ఈ క్యాంపెయిన్ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగాల ప్రకారమే క్యాంపెయిన్
ఈ మధ్య ముఖ్యమంత్రి పలు సందర్భాలలో ఆర్టీసి గురించి వ్యవ్తం చేసిన అభిప్రాయాల ప్రకారం పొల్లుపోకుండా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
‘పార్లమెంటు చేసిన మోటర్‌ వాహనాల (సవరణ) చట్టం- 2019 సెక్షన్‌ 67 ప్రకారం.. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు, పోటీతత్వం పెంచేందుకు ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈ చట్టం 2019 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రసాదించిన అధికారాలు, అవకాశాలను వినియోగించుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3-4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటువాహనాలకు పర్మిట్లు ఇవ్వడంవల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా వాహనాలను ప్రజల రవాణాకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంచుతారు. తద్వారా ప్రజలకు ఇప్పటికంటే ఎక్కువ రవాణాసౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల రోడ్డు రవాణాలో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలనే పార్లమెంటు చట్టం ఉద్దేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసినట్టు అవుతుంది,’ అని ఈ క్యాంపెయిన్ లోొ చెబుతున్నారు.
కొసమెరుపు, ఇదంతా కూడా అర్టీసిని ప్రయివేటు పరం  చేయకుండా చేస్తారట. ఆర్టీసిని ప్రయివేటు పరం చేయడం అనేది జరగనే జరగదని  ఈ క్యాంపెయిన్ లో నొక్కి చెబుతున్నారు.