తెలుగు పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమం లో చదువులు అమలు జరుగుతూ ఉన్న తీరుపై సమగ్ర సమీక్ష లేకుండానే కేజీ నుండి పీజీ దాకా ప్రైవేటు బడులలోనూ , ఎనిమిదవ తరగతి నుండి ప్రభుత్వ బదులలోనూ దాన్ని అమలు జరుపుతున్న తీరు అభ్యంతరకరమైనది.
ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఇంగ్లీషు మాధ్యమంలో చదువులు అమలు చేస్తున్నాం అనటం రాజకీయ నాయకత్వపు అవకాశవాదమే అవుతుంది. ప్రజలు కోరుకుంటున్నారని మాదకద్రవ్యాలను, బూతు చిత్రాలను అనుమతించకూడదు కదా!
ఎన్నికల కమిషన్ దాని యంత్రాంగము నోట్లతో ఓట్లను కొనుగోలు చేయటాన్ని పట్టించుకోలేదు కనుక , ఎన్నికలలో ఒక సామాజిక ఆత్మవంచనగా చట్టవిరుద్ధ నోట్ల పంపిణీ అత్యంత సహజమైన విషయంగా మారిపోయినంతమాత్రాన, ప్రజలు కోరుకుంటున్నారు కనుక మేము కోట్లకు కోట్లు డబ్బులు పంచాము. పంచుతాము.అందులో తప్పేమీ లేదని బోకరించినట్లే ఉంటుంది.
ఏ రంగంలోనైనా నిజమైన ప్రజానుకూల మార్పు తీసుకురావాలంటే గత విధానాల మంచి చెడులను నిజాయితీగా లోతుగా సమీక్షించుకోవటం మంచిదే. అవసరం కూడా. ఈ తరహా సమీక్షలు రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి , కక్ష సాధించటానికి కాకుండా ప్రజా ప్రయోజన కేంద్రంగా ఉండాలి.
ఇంగ్లీషు మాధ్యమంలో తెలుగు పిల్లలకు చదువులు చెప్పటం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. 40 సంవత్సరలా క్రితం ఆర్థికంగా సంపన్నులైన వారు, పై స్ధాయి రాజకీయ నాయకులు, ఉన్నతాధికార వర్గాలు (సాధారణంగా వీరంతా సాంఘికంగా అగ్రకులస్తులయి వుంటారు) తమ సంతానానికి ప్రత్యేక పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాట్లు చేసుకుని, ఇంగ్లీషు మాధ్యమంలో చదువులు, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహింపచేసి అమెరికా పరుగులకు అవి సులువు దారులన్నట్లు చూపారు.
హైదరాబాదు లాంటి మహా నగరం నుండి ఆరంభమైన ఇంగ్లీషు మాధ్యమం పబ్లిక్ స్కూళ్ళను అనుసరిస్తూ విజయవాడ గుంటూరు విశాఖపట్నం వరంగల్లు కర్నూలు లాంటి పట్టణాలలో కూడా పబ్లిక్ స్కూళ్ళ పేరుతో ప్రైవేటు విద్యా వ్యాపార సంస్ధలు ప్రారంభమైనాయి. మహా నగరాలలోని పై శ్రేణి వారిని అనుకరిస్తూ రాష్ట్రంలోని ధనిక, విద్యాధిక వర్గాలు తమ సంతానాన్ని ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడానికి పోటీలు పడ్డారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించటంలో ముందు నిలబడటాన్ని నమూనాగా తీసుకొని ఉన్నత మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రైవేట్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలకూ, ఎంసెట్ ప్రవేశ పరీక్షలు మొదలైన తర్వాత ర్యాంకుల కోసం ప్రత్యేక కోచింగ్ లకూ పోటీలు పడ్డారు. అవన్నీ దాదాపు ఇంగ్లీషు మాధ్యమంలోనే సాగాయి.
అలా అవి 1980వ దశకం చివరకు అన్ని జిల్లాలలో మారుమూల గ్రామాల వరకు చేరాయి. . సరళీకృత ఆర్థిక విధానాలు పేరుతో సామ్రాజ్యవాద ప్రపంచీకరణను అమలు పరచడానికి విద్యా ప్రైవేటీకరణ ఒక షరతుగా మారటంతో పరిస్థితి మరింత దిగజారింది. తెలుగులో చదువులు పనికిమాలినవనే భావనలను విద్యా వ్యాపారులు వేలం వెర్రి స్థాయిలో వ్యాప్తి చేయగలిగారు.
ఒక విధానం గానే ప్రభుత్వ బడుల మూసివేత కొనసాగి .. కొనసాగి, వేల లక్షల రూపాయల ఫీజులు పోసి, పేద మధ్య తరగతి వర్గాలు కూడా తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మాధ్యమం బడులలో చదివించు కోవాల్సిన పరిస్థితులు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ బడులు దిక్కు మొక్కు లేని వారికే రిజర్వ్ అయినాయా అన్నట్లు పరిస్ధితి తయారయింది.
ప్రభుత్వాలు కూడా ఒక నాడు pg స్థాయి దాకా తెలుగు మాధ్యమంలో బోధన జరిపిన స్థితి నుండి జారిపడి, నేడు తెలుగునాట తెలుగు మాధ్యమంలో చదువులు అడుగంటి పోయిన దుస్థితికి చేరుకున్నాయి. దీనితో ‘ తెలుగులో చదువులు కూడు పెట్టలేనివి ‘ గా మారిపోయాయి.
ఆంధ్ర రాష్ట్ర కొత్త ప్రభుత్వం కూడా గత కాలపు తలకిందుల బోధనా మాధ్యమాన్ని 8వ తరగతి నుండి తప్పనిసరి చేసింది. బోధనా మాధ్యమం ఏదైతే పిల్లలకు అత్యంత యోగ్యమైనదో నిర్ణయించుకోవడంలో అంతర్జాతీయ అనుభవాలను ప్రభుత్వాలు స్వీకరించి ఉండాల్సింది., తెలుగునాట అందుబాటులో ఉన్న భాషా శాస్త్రజ్ఞులును మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులను సంప్రదించి ఉండాల్సింది.
కనీసం ఇప్పుడైనా వివిధ రంగాల నిష్ణాతులతో కూడిన ఒక విచారణ సంఘాన్ని నియమించి గడిచిన 40 ఏళ్ల ఇంగ్లీషు మాధ్యమంలో చదువుల తీరుతెన్నులను, మెరుగు తరుగులను మదింపు చేయించి ఉండాల్సింది. గడిచిన 40 ఏళ్లలో కోటి మంది పైగా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న వారిలో సొంతంగా ఇంగ్లీషులో వ్యాసాలు , కవితలు, కథలు, నవలలు రాయగలిగారో గణాంకాలు సేకరించి బేరీజు వేసుకున్నా మరొక కోణంలో వాస్తవాలను తెలుసుకోవడమే అవుతుంది.
ఒక వ్యక్తి మరణిస్తే, ఒక భవనం కూలిపోతే అందుకు గల వాస్తవిక కారణాలను ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిశితమైన పరీక్షలు జరిపి పరిశోధించి తెలుసుకోవడం జరుగుతున్నట్లే విద్యారంగంలో అమలు జరుగుతున్న పరాయి మాధ్యమంలో చదువుల విధానాన్ని పలు విధాలుగా పరీక్షించి చూడాల్సివుంది . అప్పుడు మాత్రమే మన పిల్లలు ఇంగ్లీషు భాషలో ఏ పాటి పరిజ్ఞానము పొందుతున్నారో ఒక స్పష్టమైన నిర్ధారణకు రాగలుగుతాము.
నేటి మన విద్యా విధానం ద్వారా తెలుగు భాషలో తెలుగు ప్రజలతో వ్యవహరించాల్సిన పని లేని విద్యాధికులను మాత్రమే అభివృద్ధి చేయదలచుకున్నామా? అందరూ తెలుగు భాషతో పని లేని ఇతరేతర ప్రదేశాలలో , రంగాలలో తమ జీవితాలని సాగించగలుగుతారా? నిజానికి గ్రామాల నుండి వలస పోయే వారిలో నూటికి 85 మంది తెలుగు రాష్ట్రాలలోనే సర్దుకుంటున్నారు. 13 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. భారత దేశం విడిచి పెట్టి విదేశాలకు వలసలు పోయేవారు నూటికి ఇద్ధరు మాత్రమే. పై లెక్కలు మొత్తం జనాభాలో భాగం కాదు. కేవలం వలసలు పోయే వారిలోవి మాత్రమే! విదేశాలకు వలస పోయే వారిలో అమెరికా, కెనడా లాంటి ఇంగ్లీషు సమాజాలకు వలస వెళ్లే వారి కంటే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారే ఎక్కువ.
నిజమే! మన దేశపు ప్రపంచీకరణ ద్వారాలు కార్పొరేట్ పెట్టుబడులు స్వేచ్ఛగా ప్రవేశించటానికి తెరుచుకున్నంత సులువుగా, శారీరక బౌద్ధిక శ్రమజీవులకు వలస పోయేటందుకు సులువుగా తెరుచుకోవు. ఎవరి వీసాలు పాస్పోర్టులుతో పని లేకుండా ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణించి, పని చేసుకోగలిగిన స్వేచ్ఛ శ్రమజీవులకు ఎవరూ కల్పించలేదు. పెట్టుబడిికి వున్న స్వేచ్చ శ్రమకు కూడా ఇచ్చి ఉంటే మనదేశంలో సగం పైన జనాభా ప్రపంచ దేశాలకు తరలిపోయి ఉండేది. అసలే వారిదిక్కడ దిక్కుమొక్కులేని పరిస్థితి కదా!
ఇంగ్లీషు మాధ్యమం చదువుల ద్వారా ఇక్కడి నరకం నుండి తమ సంతానమైనా బయటపడ గలదని సాధారణ ప్రజలు భావిస్తూన్నారని రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఎదుగూ బొదుగూ లేక గిడసబారి పోయిన నేటి సామాజిక వ్యవస్థ పై ప్రజల మౌన విమర్శగా దీనిని అర్థం చేసుకోవాలి. తెలుగు మాధ్యమంలో చదువులు తమ బిడ్డలకు బతుకు నివ్వలేదు అనే అభిప్రాయం ప్రజల హృదయాలలో ఉందంటేనే అర్థం – తమ కనీస ఆకాంక్షలను తీర్చగల పరిపాలన ఇక్కడ సాగటం లేదు అని! దీన్ని వారి అంతరాంతరాలలో గూడుకట్టుకొని ఉన్న చేదు అనుభవ సారంగా మనం అర్థం చేసుకోవాలి.
తమ పిల్లలకు ఇంగ్లీషు బాగా వస్తే ఎక్కడో ఒకచోటకి పోయి హాయిగా బ్రతుకగలుగుతారు, తెలుగులో చదువులు కూడు పెట్టలేవు అనే నిశ్చితాభిప్రాయానికి ప్రజానీకం చేరుకున్నారు అని పరిపాలకులు తెలుసుకోవాలి.
ఇక్కడ సరైన బతుకు తెరువు లేని పరిస్థితులకు కారణం మన స్థానిక వ్యవసాయ పారిశ్రామిక సంక్షోభం అనీ, నిరుద్యోగ సమస్యకు అదే మూల కారణమనీ ప్రజలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రతివారు ఈ దురవస్థ నుంచి తమ సంతానమైనా బయట పడాలి అనే ఆకాంక్షతో తాము పెనం మీద నుండి పొయ్యిలోకి పడుతున్నామని తెలియకుండా రకరకాల ప్రచారపు వలల్లో చిక్కుకొని ఇంగ్లీషు మాధ్యమం చదువులను కోరుకుంటున్నారు . ఇంగ్లీషు మాధ్యమం చదువులు తమ జీవన సమస్యలకు నిష్కృతి గా ప్రజలు భావిస్తున్నారు. ఎవరైనా తమ పిల్లలకు మంచి ఇంగ్లీషు రావాలని కోరుకోవడంలో తప్పేముంది? ఎంత మాత్రం లేదు. కానీ ఇంగ్లీషు భాష మన సాంస్కృతిక జీవనానికి చాలా దూరంలో గల సమాజం నుండి జీవం పోసుకున్న పరాయి భాష అనీ, సాధారణంగా ఏ పరాయి భాషయినా దాని ద్వారా దానిని సులువుగా నేర్వలేమనీ సాధారణ ప్రజలకు తెలియదు. ఏ పరాయి భాష నైనా మాతృభాష ద్వారానే సులువుగా , బాగా నేర్వ గలుగుతామని ప్రజలకు ఎవరు చెప్పాలి?
పరిపాలకులు, వారి విద్యా శాఖ, మీడియా, అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, రచయితలు చెప్పాలి!! తెలుగు ద్వారా ఇంగ్లీషుని బాగా నేర్పే శాస్త్రీయ బోధనా విధానాలను అభివృద్ధి పరచుకోవాలి అనే ఆలోచనే లేకుండా 40 ఏళ్ళ కాలం మరీ ముఖ్యంగా ప్రపంచీకరణం అమలులోకి వచ్చిన మూడు దశాబ్దాల కాలం ఇంగ్లీషు మాధ్యమం చదువులతో గడిచిపోయింది. ప్రాథమిక మాధ్యమిక విద్యా కాలాన్ని ఒక తరంగా భావిస్తే మూడు తరాల మన బిడ్డలు తలకిందుల విద్యా విధానానికి ‘ఎడిక్ట్’ అయిపోయారు.
జీవితానికి సంబంధించిన సమస్త రంగాల ప్రాథమిక భావనలన్నీ ఎవరికైనా మాతృభాషలోనే ఏర్పడతాయి. మౌలిక పరిజ్ఞానం కూడా మాతృభాష ద్వారా పెంపొందించుకోవటం అత్యంత సులువైన విషయం. ఎందుకంటే వారు పెరిగే కుటుంబం, జీవించే సమాజం, కార్యకలాపాల ద్వారా నెరిపే అత్యధిక మానవ సంబంధాలు, రాజకీయ నిర్వహణలు, సాంస్కృతిక భావనలు … ఇవన్నీ మాతృభాషలోనే సాగుతూండడం వాస్తవం కాదా?
దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే తెలుగునాట ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకుంటున్న అత్యధికులకు అటు ఇంగ్లీషు సరిగా రాక ఇటు తెలుగు సరిగా రాక మౌలిక మానవీయ సాంస్కృతిక విలువలను గ్రహించటానికి సరిపడే భాషా పరిజ్ఞానం అలవడక అనేక సామాజిక ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు. (అసంపూర్ణం)
*దివికుమార్ , జనసాహితి, 9440167891
(ఈ అభిప్రాయాన్ని గూగల్ గ్రూప్ నుంచి తీసుకోవడం జరిగింది. స్థలాభావం వల్ల పూర్తి గా ప్రచురించలేకపోయాం.)