ఆర్టీసీ యూనియన్ల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గత  మూడు వారాలుగా సమ్మె చేస్తున్న ఆ ర్టీసీ యూనియన్లు మరొక నైతిక విజయం సాధించాయి. రేపు వారు తలపెట్టిన  సకలజనుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సరూర్ నగర్ స్టేడియంలో ఈ సభ నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి నిచ్చింది. ఇలా ఉంటే…
ఈ రోజు సమ్మె మీద జరుగుతున్న విచారణ లో  రాష్ట్ర ప్రభుత్వం  తీరు మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది
ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇచ్చారని అధికారుల మీద  హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతేకాదు, సమ్మె విరమించాలని తాము కార్మిక సంఘాలను ఆదేశించలేమని చాలా స్పష్టంగా చెప్పింది.

ఆర్టీసికి ఎంత బకాయి ఉన్నారో వివరాలు కోరుతూ నిన్న కోర్టు విచారణనే నేటికి వాయిదా వేసింది.

ఈ వివరాలలో  ప్రభుత్వం ఆర్టీసికి రు. 4253 కోట్లు ఇచ్చిందని చెప్పడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము బకాయీల వివరాలు చెప్పమంటే ఇచ్చిన వివరాలు చెబుతున్నారని,నిధులిస్తే బకాయీలను చెల్లించరా అనికోర్టు ప్రశ్నించింది.

ఆర్టీసీ చెప్పినట్లు ప్రభుత్వం ఎలాంటి  బకాయి లేదన్న  అడ్వకేట్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

ఆర్టీసియూనిన్లు కోరుతున్న రు. 47 కోట్లు విడుదలచేసేందుకు ప్రభుత్వం దగ్గిర నిధులు లేవనడం పట్ల కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 ఎన్నికల్లో గెలిచిన తర్వా హుజూర్ నగర్  నియోజకవర్గానికి  రు. 100 కోట్ల వరాలు ప్రకటించిన వాళ్లకు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఆర్టీసీకి రు.47 కోట్లు ఇవ్వలేరా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది.

ఒక వైపు బస్సులు బాగా నడుపుతున్నామని చెబుతున్నారు,మరొక వైపు స్కూళ్లకు శెలవులు ప్రకటించారు. రు. 47కోట్లు కేటాయిస్తే కార్మికులు విధుల్లో చేరే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశలో ఎందుకు అడుగు ముందుకు వేయడం లేదని కోర్టు ప్రశ్నించింది.

రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇంత వరకు ఆర్టీసీ ఆస్తులు అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని    హై కోర్టు అడిగింది. అయితే  ఈ విషయం కేంద్రం పరిధిలో ఉందని ఏ జి చెప్పారు.
ఈ వాదనలు వేడిగా జరుగుతున్నపుడు  రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం తరుఫు లాయర్  మాత్రం అంగీకరించారు.
అయితే, ఆయన విభజన చట్టం ప్రస్తావించి తెలంగాణా రాష్ట్రం బకాయిల్లో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని  ప్రభుత్వం పేర్కొనింది.
మొత్తంగా  వివరాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ   బ్యూరోక్రట్స్ వాస్తవాలను మరుగున పెడుతున్నారని  తెలివిగా మాట్లాడి నిజాలను దాస్తున్నారని  హై కోర్టు వ్యాఖ్యానించింది.
బ్యాంకు గ్యారంటీ 850 కోట్లు కట్టామన్న ప్రభుత్వం వాదనతో కూడా హైకోర్టు అంగీకరించలేదు.గ్యారంటీ పడ్డారు  కానీ ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు కట్టలేదని హై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
వాస్తవాలను అధికారులు న్యాయస్థానం ముందు  నిజాయితీగా ఒప్పుకోవాలి హై కోర్టు సూచించింది. కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.