ఊరూర ఒక పాపులర్ జంక్షన్ ఉంటుంది. సినిమాహాళ్లు, దుకాణాలు, షోరూమ్ లు, పళ్లబండ్లు, కిరాణాషాపులు ఇలాంటి జంక్షన్ లన్నీ దశాబ్దాలుగా జనంతో కిటకిటలాడతూ ఉంటాయి.
ఈ షాపులమధ్య, షోరూములమధ్య, సినిమా హాళ్ల మధ్య ఎక్కడో నక్కి కూర్చున్నట్టు ఒక టీ కొట్టో, లేదా టీ బండో ఉంటుంది. నిజానికి దీనికున్నంత జానపద గాధ అక్కడున్న ఏ పెద్ద షాపుకు ఉండదు.
ఇక్కడే నిరుద్యోగులు, చిరుద్యోగులు, రిటైరయినావాళ్లు, ఉద్యోగాలు చేస్తూ రెండు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలనుకునేవాళ్లు, ఒకసిగరెట్ కాలుద్దామనుకునే, దారిన పోతూ ఆగే వాళ్లు, వానొచ్చినపుడు చూరు కిందదూరేవాళ్లు,వూరికే అలా రోడ్డుకుమీదకు వచ్చే వాళ్లు తప్పనిసరిగా కచ్చితంగా సందర్శించే ముచ్చటైన చిన్నజాగా ఇదే.
పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇక్కడ సందడే సందడి.
ఇక్కడ టీ కాచే కుర్రాడు యమపాపులరై ఉంటాడు. వచ్చేవాళ్లందరిని అతగాడు చాలా గౌరవంగా పలకరిస్తాడు. పాతపార్టీలయితే, దూరాన్నుంచే అన్నా రాయే పిలుస్తాడు. పాతకాపులయితే, షాపు దగ్గిరకు వచ్చారోలేదో, ‘సాయ్ కుమార్ కొంచెం స్ట్రాంగ్ రెండు టీ’ అనేస్తుంటారు.
ఇలా వూరూర ఉండే సిగ్నేచర్ టీ కొట్టుల విషయానికొచ్చినపుడు విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో ఉండే సాయికుమార్ టీ కొట్టుగురించి చెప్పుకుని తీరాల్సిందే అంటున్నారు ఉత్తరాంధ్ర కు చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు జయంతి చంద్రశేఖర్ రావు.
ఆయన ఇలాంటి పక్కా లోకల్ కబుర్లను ఎక్కడెక్కడ నుంచో పట్టుకొచ్చి చెబుతుంటారు. చరిత్రను చక్కని కథగా చెప్పడంలో చాలా దిట్ట.
ఆయన జగదాంబ జంక్షన్ టికొట్టు గురించి ఏంచెబుతున్నారో చూడండి. వైజాగ్ వెళ్తే మీరక్కడికి వెళ్లి టీ తాగకుండా ఉండలేరు. బెట్
(విశాఖలో) రద్దీగా ఉండే జగదాంబ కూడలి అది. సాయంత్రమైనా, మధ్యాహ్నం బ్రేక్ టైం అయినా అక్కడ అన్ని వర్గాల వారూ గుమికూడి ఇలా అర్డర్లు ఇస్తుంటారు.
జగదాంబా థియేటర్ నిర్మాణం కాకముందు ఈ కూడలిని ఎల్లమ్మతోట అని పిలిచేవారు, అక్కడే ఎల్లమ్మతల్లి గుడి ఉండంవల్ల. అదుగో ఆ గుడి చేరువలోనే ఓ యువకుడు 100 రకాల టీ పానీయాన్ని తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు.
ఆ కూడలి అనేక వాణిజ్య సంస్ధలు, వస్త్ర దుకాణాలు, కార్యాలయాలకు నిలయం కావడంతో నిత్యం అక్కడ జనాల హడావిడి ఎక్కువగా ఉంటుంది.
దీంతో తేనీరు సేవనం కోసం అడుగులేసే ‘టీచరులు” ఈ యువకుని దుకాణం వద్ద కు చేరుతుంటారు. సాయికుమార్ అందించే వినూత్న చాయ్ తాగి శభాష్ అంటారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన యాళ్ల సాయి కుమార్ చిన్ననాటి నుంచే తన సొంత ఉపాధిని తానే వెదుక్కునే తత్వాన్ని అలవరచుకున్నాడు.
తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తున్నా సాయికుమార్ మాత్రం తన దారిని తానే వెదుక్కున్నాడు.
తొలుత నాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ చేరుకొని కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో టిఫిన్ పార్లర్లు, చాయ్ దుకాణాల్లో పనిచేశాడు.
సాయి 13వ ఏటనే తొలిసారి తాను చేసిన చాయ్‌ని విక్రయించాడు. అదుగో ఆనాడే ఏదైనా విభిన్నంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వివిధ దుకాణాల్లో చాయ్ చేయడంపై పరిజ్ఞ్ఞానాన్ని సాధించాడు. దానికి సొంత ఆలోచనను జోడించి ఆరోగ్యాన్ని అందించే, మధుమేహం, బ్లడ్‌ప్రషర్ మొదలుకొని దగ్గు జలుబు…వెయిట్‌లాస్, స్లిమ్‌నెస్ లకు దోహదంచేసే తేనీరు పానీయం తయారు చేయడం తెలుసుకొని విశాఖలో వ్యాపారం ప్రారంభించేడు సాయికుమార్.
సాయికుమార్ ప్రస్తుతం 100 రకాల టీలను అందిస్తున్నాడు… వీటిలో మందరా టీ బ్లడ్ప్రెషర్కి, దాల్చిన చెక్క టీ మధుమేహానికీ, బ్లాక్ టీ బరువు తగ్గడానికి, పుదీనా, పెప్పర్ టీ దగ్గు తగ్గేందుకు ఉపకరిస్తుందని సాయికుమార్ చెబుతాడు.
అజీర్ణానికీ, తల నొప్పికీ ఇలా అనేకానేక అస్వస్థతల నుంచి కాసింత ఉపసెమనం పొందేందుకు తాను చేసిన టీ ప్రయోజనకారిగా ఉంటోందని విశ్వాసంతో సమాధానం ఇస్తాడు. దీంతో పాటు తన చాయ్ దుకాణంలో స్వచ్ఛత పాటించడానికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తానంటాడు.
అందుకే చాయ్ గ్లాసులను వేడి నీట్లో కడిగి మరీ వినియోగిస్తాడు.
అదుగో అందుకనే సాయి టీకొట్టు నిత్యం రద్దీగా ఉంటుంది. ఉపాధి ఆశలతో వలస వచ్చే ఎవరికైనా స్నేహాస్తాన్ని అందించి తనలో చేర్చుకుంటుంది విశాఖ.
అదుగో గుప్పిడు గులాబీ రెక్కలు, పుదీనా ఆకులు, మల్లె మొగ్గలను వేడి నీటిలో ఒడుపుగా వేస్తూ వినూత్న చాయ్ ఆవిర్ల మసక మసక వెలుగుల మధ్య గెడ్డాం సాయి దర్శన మిస్తాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇదేనేమో అన్న ఓ దరహాసం ఆ యువకుని మోముపై ఆత్మవిశ్వాసంగా.
(ఫోటో The Hindu సౌజన్యం)