నదుల అనుసంధానం పథకంపై దోబూచులాడుతున్నారా!

(టి లక్ష్మినారాయణ)

1. గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు తరలించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేసినట్లు సాక్షి దినపత్రికలో చదివాను. గతంలో ప్రధాన మంత్రి మోడీకి కూడా ఇదే విజ్ఞప్తి చేశారని ప్రసార మాధ్యమాలలో వార్తలొచ్చాయి. గతంలో మోడీని, నిన్న అమిత్ షాను కలిసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం గోదావరి వరద జలాల తరలింపు పథకంపై విస్పష్టమైన ప్రకటన చేయక పోవడం పర్యవసానంగా అస్పష్టత, గందరగోళం నెలకొన్నది.

2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు దఫాలు సమావేశమై గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్ శ్రీశైలం జలాశయాలకు తరలించే పథకంపై సమాలోచనలు చేసినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఆ పథకంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. భిన్నాభిప్రాయాలు వెల్లడై ఆ ప్రతిపాదిత పథకం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం ప్రయోజనకరం కాకపోగా తీవ్ర హానికరమైన ప్రతిపాదనగా భావించడం జరిగింది.

3. ఈ పూర్వరంగంలో అక్టోబరు 19వ తేదీ సాక్షి దినపత్రికలో “గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం పథకానికి డిసెంబరు 26న రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు” అన్న వార్తను ప్రముఖంగా ప్రచురించారు. ఈ పథకం ద్వారా పోలవరం జలాశయం నుండి పోలవరం కుడి కాలువకు సమాంతరంగా మరొక కాలువను నిర్మించి గోదావరి వరద జలాలను పులిచింతల జలాశయానికి దిగువ భాగంలో కృష్ణా నదిని దాటించి నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు జిల్లాలో నిర్మించబడే బొల్లాపల్లి రిజర్వాయరులోకి, అటుపై వెలుగొండ ఆయకట్టు మీదుగా కర్నూలు జిల్లాలో నిర్మించబడిన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు తరలిస్తారన్న అధికారిక సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. నా వరకు నేను అదొక మంచి పరిణామంగా భావించి, సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టా.

4. మళ్ళీ, గందరగోళానికి తెరలేపుతూ అదే సాక్షి దినపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు, అమిత్ షా గారికి గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు తరలించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు నేడు వార్తను ప్రచురించారు. అంటే, రెండు రాష్ట్ర ముఖ్తమంత్రులు చర్చించిన పథకాన్నే కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోరినట్లు భావించాలి. గోదావరి వరద జలాల తరలింపు పథకంపై ఈ దోబూచులాట ఎందుకు?

5. నదుల అనుసంధానం పథకంలో అంతర్భాగంగా మహానది – గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి నదుల అనుసంధానం పథకంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దాన్ని ఒడిస్సా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాల తరలింపు పథకంపై విస్పష్టమైన విధానాన్ని ప్రజల ముందుంచాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి పథకానికి అనుకూలమా? గోదావరి – కృష్ణా(నాగార్జునసాగర్ – శ్రీశైలం) పథకానికి అనుకూలమా? గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధానం పథకానికి అనుకూలమా?

(టి.లక్ష్మీనారాయణ,సాగు నీటి రంగ విశ్లేషకులు, హైదరాబాద్)