ప్రభుత్వం నిండా సలహాదార్లేనా, ఇంతకీ వాళ్లేమి చేస్తారో?

ప్రభుత్వాలలో సలహాదారుల సంఖ్య పెరిగి పోతున్నది. వీళ్లందరికి  ప్రభుత్వం క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవిస్తూ ఉంది. వీళ్లేం సలహాలు ఇస్తారో తెలియదు,ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో వీళ్లకి జీతభత్యాలిస్తారు. నిజానికి బాగా శిక్షణ పొందిన ఐఎఎస్ అధికారులంతా ఉండేది ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకే. ఎపుడైనా ప్రత్యేక నిపుణులను సలహా దారులుగా నియమిస్తుంటారు.ఇది చాల అరుదు. అయితే  బంధువులను, స్నేహితులను (nepotism) ప్రభుత్వంలో సలహాదారులగా నియమిస్తున్నారీ  మధ్య. ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని అటుంచితే, వారి వల్ల రాష్ట్రానికి వనగూడే ప్రయోజనాలేంటో అర్థం కాదు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ అర్థిక విశ్లేషకు టి లక్ష్మీనారాయణ ఈ వ్యవస్థ మీద  చేస్తున్న వ్యాఖ్యలివి: 
1. ఒక ప్రభుత్వ సలహాదారుకు నెలసరి వేతనం రు.2,00,000/-, ఇంటి అద్దె రు.50,000/- మొబైల్ ఫోన్ అలవెన్స్ రు.2,000/-, వాహన సదుపాయం(250 లీటర్ల పెట్రోల్/డీజిల్ తో సహా) లేదా రు.60,000/- వెహికల్ అలవెన్స్, ఉచిత ప్రయాణ సౌకర్యం(రైలులో అయితే ద్వితీయ శ్రేణి ఎ.సి., విమానంలో దేశీయంగా ‘ఎకానమీ’, విదేశీ ప్రయాణమైతే ‘బిజినెస్ క్లాస్’లో ప్రయాణించడానికి అనుమతి, ఉచిత వైద్యం, పర్సనల్ స్టాప్ అలవెన్సెస్ పద్దు క్రింద రు.70,000/-(ఒక ప్రయివేట్ సెక్రటరీ, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్, ఒక డ్రైవర్) వెరసి మొత్తం రు.3,82,000/-. మెడికల్ రీయంబర్స్ మెంట్, ట్రావెల్ అలవెన్సెస్ అదనం.
గమనిక: ఆదాయపు పన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందను కొంటున్నాను.
2. రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 23 సం.లుగా సర్వీసు చేస్తూ నేడు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక ప్రొఫెసర్ స్థాయిలో పని చేస్తున్న ఒక డాక్టరుకు చెల్లిస్తున్న నెలసరి వేతనం రు.1,58,000/-. ఇందులో నుంచి ఆదాయపు పన్ను పద్ధు క్రింద టి.డి.ఎస్. మరియు వృత్తి పన్ను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ స్థాయిలో పని చేస్తున్న ప్రొఫెసర్స్ 30% ఆదాయపు పన్ను చెల్లించాల్సిన ‘బ్రాకెట్’లో ఉంటారు. అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న వృత్తి నైపుణ్యమున్న ఒక డాక్టర్ కు నెలసరి వేతనం చేతికొచ్చేది రు.1,20,000/- లకు మించిలేదు.
గమనిక: ప్రభుత్వ సలహాదారుకు సంబంధించి నా వద్ద ఉన్న ప్రభుత్వ ఉత్తర్వు, ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న ఒక అసోసియేట్ ప్రొఫెసర్ “పే స్లిప్” ఆధారంగా ఈ పోస్టు పెడుతున్నా.
3. మన ప్రభుత్వాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో! పరిశీలించడానికి ఇదొక చక్కటి ఉదాహరణ మాత్రమే.