భారత్ ప్రేమలో పడ్డ ట్రంప్! ఇంతకీ మోదీ వేసిన వశీకరణ మంత్రమేమిటి?

అమెరికా హ్యూస్టన్ లో మోదీ వశీకరణ విద్య  పడిపోయి, ఇక ‘ఐ లవ్ యు’ అని చెప్పకుండా ఉండలేకపోయాడు దేశాధ్యక్షుడు ట్రంప్. నిన్నంతా అమెరికాలోనాటకీయ పరిణామాలే.
ఒక భారత ప్రధాని కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అమెరికా అధ్యక్షుడు తరలి రావడం, అంతకు ముందు భారత ప్రధానికి ఘనంగా స్వాగతం చెప్పడం, పాకిస్తాన్ ప్రధాని ఎదురుగానే భారత ప్రధానిని పొగడటం…అమెరికా లో భారత్ హవా జోరుగా సాగింది.
ట్రంప్ లో చాలా మార్పు వచ్చినట్లు కనబడుతుంది. అధికారంలోకి వచ్చినపుడు ఆయన కోపంతో  విరుచుకుపడిన దేశాలలో భారత ఒకటి.
అమెరికాలో చౌకగా ఉద్యోగాలన్నీ కొట్టేసుకుపోతున్నారని  భారతీయ యువకుల మీద చిర్రుబుర్రలాడిన ట్రంప్,భారతీయ యువకులు అమెరికాలో ప్రవేశించకుండా హెచ్ వన్ బి వీసాలా మీద ఆంక్షల విధించిన ట్రంప్.. ఈయనేనా అనేలా ఆయన నిన్న భారత ప్రేమలో పడ్డారు.

ఇంకా స్పష్టంగా చెబితే భారత ప్రధాని మోదీ లవ్ లో పడ్డారు. దాదాపు రొమాంటిక్ డ్యుయెట్ పాడినంత పనిచేశారు. చేతిలో చెయ్యేసి నడిచారు. నడుము చుట్టు చేయ్యేసి కదిలారు. కలిపి చేతులూపారు. కౌగిలించుకున్నారు. మోదీకోసం చప్పట్లు కొట్టారు. ఇదంతా హ్యూస్టన్ ఎన్ ఆర్ జి స్టేడియంకు ‘హౌడీ మోడీ’ కోసం వచ్చిన 50 వేల మంది ప్రవాస భారతీయులు ముందు సాగిన ట్రంప్ ప్రణయ కలాపం.
ట్రంప్ బలహీనతేంటో భారత ప్రధాని మోదీ పసిగట్టారు. ఆయన తొలినుంచి కూడా ట్రంప్ విషయంలో చాలా నిగ్రహం పాటిస్తున్నారు. బహుశా ఇంత గొప్పగా అమెరికా కుప్పిగంతులను సహించడం మోదీ లాంటి తీవ్ర ఆత్మాభిమానం వున్న నాయకుడికి చాలా కష్టం.
ప్రపంచం లో ఆగ్రరాజ్యమని విర్రవీగుతూ 2017లో అధ్యక్ష పదవిచేపట్టినప్పటినుంచి ట్రంప్ చేసిన ప్రతిపని, ఆదేశంలో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం, రెండో దఫా ఎలాగెలుపొందడం కోసమే.
సాధారణంగా అమెరికా విదేశీ విధానాలను ఆదేశ అంతర్జాతీయ రాజకీయాలు (జియో పాలిటిక్స్ అంటుంటారు) శాసిస్తుంటాయి. కాని ట్రంప్ విషయంలో మాత్రం రెండో సారి సులభంగా అధ్యక్షుడకావడం ఎలా అనే విషయం జాతీయ అంతర్జాతీయ అమెరికా రాజకీయాలను శాసించింది. దీనికోసం అమెరికన్ యువకులకోసం ఉద్యోగాల ఎరవేశారు. అమెరికన్లకే మొదట ఉద్యగాలునే నినాదంతో దూకుడు పెంచారు. అమెరికా దేశభక్తి నూరిపోసే ప్రయత్నం చేశారు.

ఇపుడు మళ్లీ 2020 ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటం అన్ని దేశాలతో తగవు ఎల్లకాలం పనికిరాదనే జ్ఞానోదయానికి వచ్చారు.  2020 ఎన్నికల్లో రెండో సారి అధ్యక్షుడు కావాలంటే,  భారత్ సహకారం చాలా ముఖ్య మని, అందునా మోదీ సాయం లేకుండా గెలవడం కష్టమని ట్రంప్ గ్రహించాడు.
ఎందుకంటే, ప్రవాసభారతీయుల్లో గతంలో ఎపుడూ ఏ ప్రధాని కి లేనంతా గుడ్ విల్ మోదీకి వుంది. ప్రవాస భారతీయులు వోట్లు ట్రంపు భవిష్యత్తుని శాసించనున్నాయి. దీనికి కారణం, ప్రవాస భారతీయులు నూటికి నూరు శాతం కాకపోయినా, చాలా మటుకు గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలిపారు.వీళ్లని మోదీ ద్వారా తన వైపు తిప్పుకోవాలి.
అమెరికాలో 44 లక్షల మంది భారతీయ సంతతి అమెరికన్లు ఉన్నారు. ఇంత మంది వోట్లు 2016 ఎన్నికల్లో హిల్లరీకి పడ్డాయని, ఇపుడదే జరిగితే ప్రమాదమని ట్రంప్ గుర్తించాడు.అందుకే ఇపుడు హ్యూస్టన్ హౌడీ మోడీ ప్రోగ్రాం వుంది, వస్తారేమో రండి అని మోదీ అనగా అమెరికా వన్ విమానమెక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మోదీని ‘Great man, great leader, full of great wisdom’ అని ఆకాశానికెత్తాడు. అంతేకాదు, కాశ్మీర్  మీద ఇండియా పాకిస్తాన్ ల మధ్య దౌత్యం తెగ వువ్వీళ్లూరిన వ్యక్తి,ఇపుడు ఇండియా ఒప్పుకుంటే పెద్ద మనిషిగా వస్తానని నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు.
అమెరికాతో భారత్ వాణిజ్యం సరప్లస్ లో ఉండటం, అమెరికా ఉద్యోగాలను భారతీయలు లాగేసుకుంటూ ఉండటంతో ట్రంపు మొదట్లో చిర్రుబుర్రలాడాడు. ఆంక్షలు విధించాడు. కొత్త గా భారతీయ యువకులు అమెరికా వెళ్లడం కష్టం చేశాడు.
ప్రధాని మోదీ మాత్రం చాలా  సహనంతో ఒక్క మాట కూడా పైకి అనకుండా వేచి చూశారు. బహుశా హ్యూస్టన్ లాంటి అవకాశం కోసమేనేమో.
భారత్ రష్యానుంచి భారీగా యుద్ధ విమానాలు కొంటోంది. ఆయుధాలు కొంటావుంది. అదే విధంగా కాశ్మీర్ సమస్య వచ్చింది. ఈ రెండింటి మీద ట్రంపును నోరు మూయించేందుకు ప్రధానిమోదీ హ్యూస్టన్ సభను గొప్పగా వాడుకున్నారు. భారతీయుల బలమేమిటో చూపించాడు.
అదే సమయంలో అమెరికన్ ఆయిల్ ను కొంత కొని, అమెరికా-ఇండియా వాణిజ్య లోటును ఏడు శాతానికి తగ్గించి ట్రంప్ నోటిని కంట్రోల్ చేశాడు. వెనిజులా, ఇరాన్, క్యూబా ల మాదిరి భారత్ మీద ట్రంపు తైతెక్క లాడకుండా చేయడంలో ప్రధాని నరేంద్ర సఫలమయ్యారు.
మోదీతో సఖ్యంగా ఉంటే ప్రవాస భారతీయుల వోట్లే కాదు, ఎన్ ఆర్ ఐ బిజినెప్ పీపుల్ ఎన్నికల నిధులు కూడా సమకూరుస్తారనే ఆశ ట్రంప్ లో కలిగేలా మోదీ చేశారు. 2014లో తన నినాదం ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్ ’ నినాదాన్ని ‘అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ ’ అనే నినాదం సభలో పిక్కటిల్లేలా చేశారు మోదీ. ట్రంప్ ని ‘Great American President’ అని   CEO to Commander-in-Chief ఎదిగిన వ్యక్తి అని మోదీ కూడా ప్రశంసించారు.
భారత్ కు హాని చేస్తున్న ట్రంప్ విధానాల మీద ఇండియన్ డయస్పోరా ను ప్రయోగించడం భారత విదేశాంగ విధానానికి మోదీ అందించిన నూతనాస్త్రం. గతంలో ఎవరూ చేయలేదని, నిజానికి ఇలాంటి ప్రయోగాన్ని వాళ్లు అంగీకరించే వారు కాదని ప్రముఖ విదేశీవ్యవ హారాల నిపుణుడు శ్రీరామ్ చౌలియా టైమ్స్ అఫ్ ఇండియా లో రాశారు.
అయితే, ఇపుడు ఈ అస్త్రాన్ని గత విధానాలను వదిలేసి, అమెరికన్లను అమెరికా ఫస్ట్ అనేనినాదంతో మాయ చేయాలని చూస్తున్న అగ్రరాజ్యం మీద ప్రయోగించడం తప్పని సరి అయింది. ఎందుకంటే, ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాలను చూపించి, తన ఎన్నికల ప్రయోజనాలను పనికొచ్చేలా ఉన్నపుడే ఎవరిమీదనైనా ప్రేమ ఒలకబోస్తాడు.
మోదీ దీనిని గ్రహించి ట్రంప్ మళ్లీ నువ్ గెలిచేందుకు భారతీయులు అవసరమనే భయభక్తులు ట్రంపులో ప్రధాని మోదీ కలిగించారు. ఒక విధంగా ట్రంప్ తొలి ఎన్నికల సమావేశాన్ని మోదీ ప్రారంభించినట్లయింది.ట్రంప్ రెండో ఎన్నికలను మోదీ అమోదించినట్లయింది.
మరొక దేశాధ్యక్షుడి ఎన్నికలకుప్రచారం చేయడం భారత విధానం కాదని , మోదీ తప్పు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది.
ట్రంప్ ప్రేమ శాశ్వతం అని, ఆయన ఇక భారత్ జోలికి రాడని అనుకోలేం. ఆయన లాంటి పచ్చి అవకాశవాది అమెరికాకు ఎపుడూ అధ్యక్షుడు కాలేదు. అయితే, కాశ్మీర్ మీద దౌత్యం దూకుడు తగ్గించేందుకు, రష్యాతో చేస్తున్న మిలిటరీ కొనుగోళ్లకు అమెరికా నుంచి పెద్దగా వ్యతిరేకతా రాకుండా ఉండేందుకు ఇది సహకరించింది.