మొక్కలు నాటాలని వ్యవసాయం ధ్వంసం… తెలంగాణలో

ఈ ఫోటోలో ఉన్నవాళ్లెవరికీ చదవురాదు. సొంత పేర్లని కూడా వాళ్లు స్పష్టంగా పలకలేనంత వెనకబడిన వాళ్లు. వీళ్లంతా కోలాం తెగకు చెందిన వాళ్లు. దాదాపు 30కుటుంబాలని లాక్కొచ్చి కాగజ్ నగర్ సమీపంలోకి వాంకిడి గ్రామంలోని ఒక పాత ట్రైబల్ వెల్ ఫేర్ హాస్టలో అధికారులు  పడేసి  వెళ్లిపోయారు. మళ్లీ అటువైపు చూడటం లేదు. కులసంఘాలు కూడా వాళ్లవైపు రావడానికి బయపడుతున్నాయి.
హాస్టల్ కు ఇచ్చే సరుకుల్లోనంచి  వీళ్లకి కొంత ఇస్తున్నారు. పంటపొలాల్లో పనిచేయాల్సిన వానాకాలంలో  రెన్నెళ్లుగా ఇలా వీళ్లు సర్వం కోల్పోయి అనాథల్లాగా బతుకుతున్నారు. ఇలా ఎంతకాలమండాలో తెలియదు. వందల సంఖ్యలో ఫారెస్టు అధికారులు, పోలీసులు వీళ్ల జనావాసాల మీద పడి గుడిసెలు కూల్చేసి వాళ్లందరిని బలవంతంగా ట్రాక్టర్లకు ఎక్కించి ఇక్కడ పడేశారు.

దాదాపు 30 సంవత్సరాలుగా వీళ్లు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కున్నారు. అక్కడ హరితహారం అంటూ వేప చెట్టు, రావి చెట్లు నాటాలని వీళ్లని నిరాశ్రయులను చేశారు.
నిజానికి ఎన్నికల ముందు  తరతరాలుగా సాగుచేసుకుంటున్న ఈ పోడుభూములకు పట్టాలిస్తాని ముఖ్యమంత్రి కెసిఆర్ వూరూర ప్రకటించారు.
ఆయన అఖండ విజయం సాధించారు. ఈ సారి టిఆర్ ఎస్ ప్రభుత్వం పట్టాలిస్తుందనుకున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఈ పేద గిరిజనలు తమ హక్కు కోసం ఎదురుచూస్తున్నారు.
అలా ఎదురుచూస్తున్నపుడు రాత్రిరాాత్రి కి వందలాది మంది ఫారెస్టు వాళ్లు, పోలీసులతో వచ్చి వీళ్లని తరిమేశారు.
ఇది కూడా చదవండి
వార్తల కెక్కని వాస్తవం, కుటుంబాలను కూల్చేసిన మొక్కలు
వీళ్లకి పట్టాలిస్తామని గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. దానికి సర్వేలు కూడా చేశారు. వీళ్లంతా రెండెకరాలు మూడెకరాలు దున్ను కుంటూ ఎవరి మీద అధార పడకుండా స్వతంత్రంగా బతుకుతున్నారు.
అలాంటపడు ‘హరితహారం’ కోసం వీళ్ల కడుపుగొట్టి ఇంత విధ్వంసం సృష్టించడం అవసరమా?
తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో వీళ్లకి అర్థం కావడంలేదు. వీళ్లకి తెలిసిన వాళంతా పారెస్టోళ్లు. వాళ్లే ఇపుడు పగబట్టారు.
అంతేకాదు, వీళ్లు వ్యవసాయం చేసుకుంటున్నపుడు ప్రతిసంవత్సరం ప్రతిరైతు కొంత డబ్బువసూలు చేసి ఫారెస్టోళ్లకు నజారానా కూడా ఇస్తూ వచ్చారు. ఇపుడు సడన్ గా వీళ్లంతా ఫారెస్టు దురాక్రమణదారులయ్యారు. వాళ్ల ఆగ్రహానికి గురయ్యారు.  నీడ,ఉపాధి రెండూ కోల్పోయారు.
వీళ్లెలా బతుకుతున్నారని వాకబు చేసేందుకు ఏ పార్టీ వాళ్లు రాలేదు. అధికారులేమో వీళ్లందరికి ఒకటే వార్నింగ్ ఇచ్చారు. దీనిని పెద్ద ఇష్యు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు.
చెట్లు నాటాల్సిందే. కాని చెట్ల కోసం  ఇలా సజావుగా సాగుతున్న జీవితాలను నాశనం చేయవచ్చా? ఈవూర్లో మొత్తంగా 200 ఎకరాలను ఇలా లాగేసుకున్నారు.
ఇదే పరిస్థితి పారెస్టాఫీసర్ అనిత మీద ‘దాడి’ చెేసి వార్తలకెక్కిన సర్సాలలో కూడా కనిపించింది.
ఇలా చాలా ఎప్పటి నుంచి అనుభవ హక్కులున్న  గిరిజనులను, దళితులను తరిమేసిచెట్లు నాటాలనుకుంటున్నారు.  కాగజ్ నగర్ నియోజవర్గంలో కనీసం ఒక వేయి మంది ‘హరితహారం’ కోసం నిరాశ్రయులయ్యారు.
ప్రతిచోటా ఒకటే దృశ్యం.  సైనిక చర్య లాగా పోలీసుల రంగంలోకి దిగి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నవారిని తరిమేసి మొక్కలు నాటారు.
ఇక డబ్బా అనే వూరిలో ఫారెస్టు అధికారులు ఇంకా దారుణంగా ప్రవర్తించారు. పొలాలను లాక్కున్నారు. పొలం చుట్టు కంచే వేసుకున్నారు. వూళ్లో వాళ్ల పశువులను అడవుల్లోకి తోలుకుని పోయేందుకు రాస్తా కూడా వదల్లేదు.
భూముల దరిదాపుల్లోకి వీళ్లని  రానీయడం లేదు. వర్షాలు బాగా కురియడంతో ప్రతిపొలంలో ప్రత్తి ఏపుగా పెరుగుతూ ఉంది. దాన్నంతా ఈ పేద రైతులు వదలుకోవలసివచ్చింది.
కాళేశ్వరంప్రాజక్టు కింద మునిగిపోయిన అటవీ భూములకు కాంపెన్సేటరీ భూములుగా వీటిని లాక్కున్నారని ఇక్కడ వాళ్లు చెబుతున్నారు.
దశాబ్దాలుగా సాగుచేస్తుకుంటున్న భూములను లాక్కోవడమేనా? దీని కొక పద్ధతి పాడూ లేదా? చెట్లు నాటేందుకు ప్రభుత్వం భూముల్లేవా? అని ఈ అమాయకులు ప్రశ్నిస్తున్నారు. బయటకు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.

ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించే హక్కులేదా అని  మరొక వైపు కెటిఆర్ నిన్న కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

మరి తెలంగాణాలో జరుగుతున్నదేమిటి? మాభూములు ఎలా లాక్కుంటారు, గిరిజనులకు దశాబ్దాలుగా సాగుచేసుంటున్న భూముల మీద హక్కులుండవా? మరి పట్టాలున్న వారి సంగేతమిటి? మీరే ఇచ్చిన అటవీహక్కుల పత్రాల మాటమేమిటి? పాస్ బుక్కులను అటవీ హక్కు పత్రాలను వెంట్రుకలా తీసి పడేశారు. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అనే శారు.  ఇదే న్యాయం? 

ఇదిగో మా హక్కు అని అటవీ హక్కు పత్రం చూపిస్తే  ఒక అటవీ శాఖ అధికారి దానిని చింపేసిందని ఒక మహిళ వాపోయింది.

‘ఇదిగో, నక్సలైట్లు లేక మాకీ పరిస్థితి దాపురించింది. వాళ్లున్న రోజుల్లో వీళ్లెవరూ ఈ దరిదాపుల్లోకి వచ్చే వాళ్ల కాదు. వాళ్లు లేకనే మాకీ కష్టాలన్ని,’ అని డబ్బా గ్రామంలో సర్పంచుతో సహా బాధితులంతా ముక్త కంఠంతో చెప్పారు.
ఇదే పరిస్థితి తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే, రూలింగ్ పార్టీకి చెందిన ఏఒక్క శాసన సభ్యుడు దీనిని ప్రశ్నించే స్థితిలో లేరు. ప్రశ్నిస్తే ఏమవుతుందో నని భయపడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజక్టుకు కాంపెన్సేటరీ ఫారెస్టు కింద మెుక్కలు నాటాలంటే వ్యవసాయ భూములను ఎలా ఎంపిక చేస్తారని  డబ్బా గ్రామ సర్పంచు అబ్దుల్ రషీద్ అడుగుతున్నాడు.
భూముల్లోని పేద గిరిజనులను, దళితులను తరిమేయాలనుకున్నపుడు ప్రజాప్రతినిధులతో సంప్రదించనే లేదు.
ఈపేదలతో ఒక సమావేశం ఏర్పాటుచేసి, వారికి నచ్చ చెప్పి, వాళ్ల బతుకులకి భరొసా ఇచ్చి స్నేహపూర్వకంగా వారిని ఖాళీ చేయించాలని ఇక్కడ చాలా మంది చెబుతున్నారు.
వీళ్లందని వూరకుక్కల్ని ఎలా పట్టుకుని పోతారో అలా ఎత్తి ట్రాక్టర్లలో జీపులలో వేసుకు తీసుకువెళ్లారు. వాళ్లు మనషులనే గౌరవం చూపనేలేదు. హ్యూమన్ డిగ్నిటీ ఎక్కడా కనబర్చలేదు.
పరాయిదేశస్తులు రహస్యంగా దేశంలోకి చొరబడి తే ఎలా ఎలా తరిమేస్తారో అలా తరిమేశారు. మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాలో వేయి మంది చస్తే ఏముందనుకుంటే తప్ప ఈ గిరిజనుల మీద అంతటి అమానుషంగా ప్రవర్తించడం సాధ్యం కాదు.
బాపుగూడ అనే గ్రామంలో అరవై సంవత్సరాలుగాసాగు చేసుకుంటున్న భూములను యుద్ధానికి వచ్చినట్లు పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడి చేసి లాగేసుకుని మొక్కలు నాటారు.
అంతేకాదు, పొలాలగుండా చివరకు వారి పశువులను కూడా పోనియకుండా నిషేధించి అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారని  అక్కడి గిరిజనులు విమర్శించారు.
23.7.2019న  తమ దీనావస్థనే కాదు, పస్తులుంటున్న పశువులదీనావస్థను కూడా ఒక వినతి పత్రం ద్వారా ఎమ్మార్వో దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయోజనం లేదు.
ఒక గ్రామంలో ఓటు హక్కున్నవారిని, సహజ సాగు హక్కులున్న గిరిజనులను లోకల్ ఎమ్మెల్యేకు తెలియచేయకుండా  ఎలా తరిమేస్తారని ఒక శాసన సభ్యుడు  రహస్యంగా  ఈ  ప్రతినిధిని ప్రశ్నిస్తూ ఆవేదన చెందారు.
అటవీ శాఖ మంత్రి ఎ ఇంద్ర కరణ్ రెడ్డి మీద బాగా  విమర్శలున్నాయి.దీనికంతటికీ ఆయనే కారణమంటున్నారు చాలా మంది బాధితులు.
నిజానికి ఈ కాంపెన్సేటరీ ఎఫారేస్టేషన్ కు ఆయన నియోజకవర్గం నిర్మల్ ను ఎంపిక చేశారని, అయితే, అక్కడ భూములు లేవని ఆయన ఇతర నియోజకవర్గాలను ఎంపిక చేయడంతో సమస్య మొదలయిందని కొందరు చెబుతున్నారు.
 గిరిజనుల భూములు లాక్కుని మొక్కలు నాటాలని తన శాఖ అధికారులను ఇంద్రకరణ్ రెడ్డి పురమాయించారని సర్వత్రా వినబడుతుంది. మంత్రి ఆజ్ఞాపిస్తే ఇంకేముంది? వాళ్లు మొక్కలు నాటడానికి ఇంతమందిని బలి ఇచ్చారు.
మంత్రి అంటే ముందు శాసన సభ్యుడేగా. వందలాది మంది గిరిజనుల ఉపాధి ధ్వంసం చేసి బజారుకీడుస్తున్నపుడు తన తోటి , తన పార్టీ శాసన సభ్యులను సంప్రదించాల్సిన అవసరం లేదా? ఆయన ఈ పని చేయలేదని ఒక శాసన సభ్యుుడు చెప్పారు.
ఇందులో భూదందా నడుస్తూ ఉందని ఒక సీనియర్ జర్నలిస్టు రహస్యంగా ఈప్రతినిధికి చెప్పారు.
తెలంగాణ భూ ప్రక్షాళన సాగుతూ ఉంది. కొత్త పహానీలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు.కొత్త పహానీ ఇచ్చేముందు భూమికి ఇపుడు హక్కుదారుడెవరు? అను భవదారుడెవరు? అని చూడాలి. ఇపుడు ఈ భూములను ఖాలీ చేయిస్తే, పహానీ ఇచ్చేపుడు హక్కుదారుడుండడు, అనుభవిస్తున్నవాడూ ఉండడు.
అపుడు ఈ భూమి ఫారెస్టు వాళ్ల చేతిలో ఉంటుంది. గిరిజనుల పేర  కొత్త పహానీ ఇవ్వాల్సిన పని ఉండదు. అంతేకాదు, తమకు ఇష్టమయిన వారికి ఈ భూములు రాయించవచ్చు లేదా ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారి పేర రాయవచ్చు అని ఆయన చెప్పారు.
ఇలాంటి వార్తలు రాయవద్దని తమ మీద ఆంక్షలున్నాయని స్థానిక జర్నలిస్టులఅంగీకరిస్తున్నారు.
అందుకే ఫారెస్టు అధికారి మీద జరగిన దాడి వార్త అయింది తప్ప వేలాది మంది  గిరిజనులును వాళ్లు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములనుంచి తరిమేసి నిరాశ్రయులను చేస్తే  అది వార్తే కాలేదు.తెలంగాణ గ్రామాల్లో ఏంజరుగుతోందో వూహించండి.