ఈ ఫోటోలో ఉన్నవాళ్లెవరికీ చదవురాదు. సొంత పేర్లని కూడా వాళ్లు స్పష్టంగా పలకలేనంత వెనకబడిన వాళ్లు. వీళ్లంతా కోలాం తెగకు చెందిన వాళ్లు. దాదాపు 30కుటుంబాలని లాక్కొచ్చి కాగజ్ నగర్ సమీపంలోకి వాంకిడి గ్రామంలోని ఒక పాత ట్రైబల్ వెల్ ఫేర్ హాస్టలో అధికారులు పడేసి వెళ్లిపోయారు. మళ్లీ అటువైపు చూడటం లేదు. కులసంఘాలు కూడా వాళ్లవైపు రావడానికి బయపడుతున్నాయి.
హాస్టల్ కు ఇచ్చే సరుకుల్లోనంచి వీళ్లకి కొంత ఇస్తున్నారు. పంటపొలాల్లో పనిచేయాల్సిన వానాకాలంలో రెన్నెళ్లుగా ఇలా వీళ్లు సర్వం కోల్పోయి అనాథల్లాగా బతుకుతున్నారు. ఇలా ఎంతకాలమండాలో తెలియదు. వందల సంఖ్యలో ఫారెస్టు అధికారులు, పోలీసులు వీళ్ల జనావాసాల మీద పడి గుడిసెలు కూల్చేసి వాళ్లందరిని బలవంతంగా ట్రాక్టర్లకు ఎక్కించి ఇక్కడ పడేశారు.
దాదాపు 30 సంవత్సరాలుగా వీళ్లు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కున్నారు. అక్కడ హరితహారం అంటూ వేప చెట్టు, రావి చెట్లు నాటాలని వీళ్లని నిరాశ్రయులను చేశారు.
నిజానికి ఎన్నికల ముందు తరతరాలుగా సాగుచేసుకుంటున్న ఈ పోడుభూములకు పట్టాలిస్తాని ముఖ్యమంత్రి కెసిఆర్ వూరూర ప్రకటించారు.
ఆయన అఖండ విజయం సాధించారు. ఈ సారి టిఆర్ ఎస్ ప్రభుత్వం పట్టాలిస్తుందనుకున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఈ పేద గిరిజనలు తమ హక్కు కోసం ఎదురుచూస్తున్నారు.
అలా ఎదురుచూస్తున్నపుడు రాత్రిరాాత్రి కి వందలాది మంది ఫారెస్టు వాళ్లు, పోలీసులతో వచ్చి వీళ్లని తరిమేశారు.
ఇది కూడా చదవండి
వార్తల కెక్కని వాస్తవం, కుటుంబాలను కూల్చేసిన మొక్కలు
వీళ్లకి పట్టాలిస్తామని గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. దానికి సర్వేలు కూడా చేశారు. వీళ్లంతా రెండెకరాలు మూడెకరాలు దున్ను కుంటూ ఎవరి మీద అధార పడకుండా స్వతంత్రంగా బతుకుతున్నారు.
అలాంటపడు ‘హరితహారం’ కోసం వీళ్ల కడుపుగొట్టి ఇంత విధ్వంసం సృష్టించడం అవసరమా?
తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో వీళ్లకి అర్థం కావడంలేదు. వీళ్లకి తెలిసిన వాళంతా పారెస్టోళ్లు. వాళ్లే ఇపుడు పగబట్టారు.
అంతేకాదు, వీళ్లు వ్యవసాయం చేసుకుంటున్నపుడు ప్రతిసంవత్సరం ప్రతిరైతు కొంత డబ్బువసూలు చేసి ఫారెస్టోళ్లకు నజారానా కూడా ఇస్తూ వచ్చారు. ఇపుడు సడన్ గా వీళ్లంతా ఫారెస్టు దురాక్రమణదారులయ్యారు. వాళ్ల ఆగ్రహానికి గురయ్యారు. నీడ,ఉపాధి రెండూ కోల్పోయారు.
వీళ్లెలా బతుకుతున్నారని వాకబు చేసేందుకు ఏ పార్టీ వాళ్లు రాలేదు. అధికారులేమో వీళ్లందరికి ఒకటే వార్నింగ్ ఇచ్చారు. దీనిని పెద్ద ఇష్యు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు.
చెట్లు నాటాల్సిందే. కాని చెట్ల కోసం ఇలా సజావుగా సాగుతున్న జీవితాలను నాశనం చేయవచ్చా? ఈవూర్లో మొత్తంగా 200 ఎకరాలను ఇలా లాగేసుకున్నారు.
ఇదే పరిస్థితి పారెస్టాఫీసర్ అనిత మీద ‘దాడి’ చెేసి వార్తలకెక్కిన సర్సాలలో కూడా కనిపించింది.
ఇలా చాలా ఎప్పటి నుంచి అనుభవ హక్కులున్న గిరిజనులను, దళితులను తరిమేసిచెట్లు నాటాలనుకుంటున్నారు. కాగజ్ నగర్ నియోజవర్గంలో కనీసం ఒక వేయి మంది ‘హరితహారం’ కోసం నిరాశ్రయులయ్యారు.
ప్రతిచోటా ఒకటే దృశ్యం. సైనిక చర్య లాగా పోలీసుల రంగంలోకి దిగి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నవారిని తరిమేసి మొక్కలు నాటారు.
ఇక డబ్బా అనే వూరిలో ఫారెస్టు అధికారులు ఇంకా దారుణంగా ప్రవర్తించారు. పొలాలను లాక్కున్నారు. పొలం చుట్టు కంచే వేసుకున్నారు. వూళ్లో వాళ్ల పశువులను అడవుల్లోకి తోలుకుని పోయేందుకు రాస్తా కూడా వదల్లేదు.
భూముల దరిదాపుల్లోకి వీళ్లని రానీయడం లేదు. వర్షాలు బాగా కురియడంతో ప్రతిపొలంలో ప్రత్తి ఏపుగా పెరుగుతూ ఉంది. దాన్నంతా ఈ పేద రైతులు వదలుకోవలసివచ్చింది.
కాళేశ్వరంప్రాజక్టు కింద మునిగిపోయిన అటవీ భూములకు కాంపెన్సేటరీ భూములుగా వీటిని లాక్కున్నారని ఇక్కడ వాళ్లు చెబుతున్నారు.
దశాబ్దాలుగా సాగుచేస్తుకుంటున్న భూములను లాక్కోవడమేనా? దీని కొక పద్ధతి పాడూ లేదా? చెట్లు నాటేందుకు ప్రభుత్వం భూముల్లేవా? అని ఈ అమాయకులు ప్రశ్నిస్తున్నారు. బయటకు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులేదా అని మరొక వైపు కెటిఆర్ నిన్న కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
మరి తెలంగాణాలో జరుగుతున్నదేమిటి? మాభూములు ఎలా లాక్కుంటారు, గిరిజనులకు దశాబ్దాలుగా సాగుచేసుంటున్న భూముల మీద హక్కులుండవా? మరి పట్టాలున్న వారి సంగేతమిటి? మీరే ఇచ్చిన అటవీహక్కుల పత్రాల మాటమేమిటి? పాస్ బుక్కులను అటవీ హక్కు పత్రాలను వెంట్రుకలా తీసి పడేశారు. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అనే శారు. ఇదే న్యాయం?
ఇదిగో మా హక్కు అని అటవీ హక్కు పత్రం చూపిస్తే ఒక అటవీ శాఖ అధికారి దానిని చింపేసిందని ఒక మహిళ వాపోయింది.