వందేళ్ల ఏలూరు “పెరుగుచెట్టు” నేలకొరిగింది, ఒక అడ్రసు మాయమయింది…

ఆ “పెరుగుచెట్టు” ది వందేళ్ల చరిత్ర.
ఎంతోమందికి సేద తీర్చింది, మరెంతోమంది చిరు వ్యాపారులకు నీడనిచ్చింది. ఆ చెట్టు ఇక లేదు. ఒక భవంతి యజమాని స్వార్ధానికి బలయ్యింది.
వందేళ్ల చెట్టు అమాంతం కూలిపోయింది. తనతోపాటు మరో నిండు ప్రాణాన్ని తోడుగా తీసుకెళ్లింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు ఆ చెట్టు నేలకొరిగింది? అసలు ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడైనా ‘పెరుగు’ చెట్టు ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది? ఆ చెట్టు పెరుగు చెట్టు ఎలా అయింది… ఆ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ పూర్తిగా చదవండి.
‘పెరుగుచెట్టుై ఏలూరు వన్ టౌన్ లో ఉంది. వన్ టౌన్ లో చాలా చెట్లుంటాయి. ఈ  చెట్టు ప్రాముఖ్యం ఏమిటంటే, ఏలూరు వన్ టౌన్ లాగా, ఈ చెట్టు కూడా ఒక ప్రముఖ పోస్టల్ అడ్రసు. ఈ ప్రాంతంలో దుకాణాలు, ఇక్కడ నివసించే ప్రజలు ఈ చెట్టును ఒక వీధిలాగా వాడుతూ వచ్చారు. ఇపుడదిరికార్డుల కెక్కిన పోస్టల్ అడ్రస్ అయింది.
కానీ దాని అసలు పేరు పెరుగుచెట్టు కాదు, మర్రిచెట్టు (Peepal tree, Ficus religiosa). అయితే దానికి పెరుగుచెట్టు అనే పేరు ఎలా వచ్చిందంటే… బ్రిటిష్ కాలంనాటి ఆ మర్రిచెట్టుకు సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ఆ కాలంనాటి నుండి ఆ చుట్టుపక్కల రైతులు పచ్చగడ్డి, పాలు, పెరుగు చెట్టుకింద పెట్టుకుని అమ్మేవారు. అలా ఆ మర్రిచెట్టు కి “పెరుగుచెట్టు” అనే పేరు వచ్చింది.
ఇది కూాడా చదవండి: ’అమ్రపాలి‘కష్టాల్లో క్రికెటర్ ధోని భార్య సాక్షి ధోని
అయితే కాలక్రమేణా ఆ చెట్టుకింద పాలు, పెరుగుతో పాటు పండ్లు, కూరగాయల వ్యాపారాలు కూడా సాగించడం మొదలుపెట్టారు.
1979 , 1996 తుఫానుల సమయంలో కూలిపోయినప్పటికీ వేర్ల సహాయంతో మళ్ళీ పెరిగింది అని చెబుతారు ఊరివాళ్ళు. అలాంటి చెట్టు, ఎందరికో ఆసరా ఇచ్చిన చెట్టు ఇప్పుడు ఒకరి స్వార్ధం కోసం శాశ్వతంగా జూలై 5 నేలరాలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊరివాళ్ళు.
ఆ చెట్టు పక్కనే ఉన్న స్థలంలో ఐదు అంతస్థుల భవన నిర్మాణానికి పనులు చేపట్టాడు స్థలం యజమాని. కొమ్మలు అతని స్థలంలోకి రావడంతో ఎవరి అనుమతి లేకుండా వాటిని నరికేశాడు. దీంతో ఆ చెట్టుకి ఒకవైపు బరువు ఎక్కువ ఐంది. అంతేకాకుండా ఆ చెట్టును పూర్తిగా తొలగించడానికి.. చెట్టు మొదట్లో కలుపుమందు వేశారని కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. రానురాను ఆ చెట్టు వేళ్ళు కుళ్లిపోయి ఒక్కసారిగా నేలకూలింది.
అయితే అదే సమయంలో రోడ్డు పక్కన ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగించే మాణికల రమణమ్మ (48 ), ఆమె భర్త సుబ్బారావు చెట్టు కిందకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఆ దంపతులపై చెట్టు కూలి పడింది. రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… సుబ్బారావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుబ్బారావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.