ఆంధ్రాలో ప్రొహిబిషన్ తెలంగాణకు జాక్ పాట్

తెలంగాణ ప్రభుత్వం జాక్ పాట్ కొట్టబోతున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  మద్యనిషేధం అమలుచేయాలనుకుంటున్నందున, పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి మద్యం వ్యాపారులు తెలంగాణ రాబోతున్నారు.
ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. ఆంధ్రలో ఇప్పటికే బెల్ట్ షాపులను మూసేయండి జగన్ అధికారులను ఆదేశించారు.
వైన్ షాపులకు బెల్ట్ షాపులే అండ. దీనితో దుకాణం లైసెన్స్ లేకుండా ప్రతిపల్లెలో ప్రతికిరాణ షాపులో బీరు, ఇతర లిక్కర్లు అందుబాటులోకి వచ్చేలా చేశారు. ప్రతిపల్లె లో ఇపుడు అనధికారిక బార్లు వెలిశాయి. బెల్ట్ షాపులను మూసేస్తే వ్యాపారం పడిపోతుంది. అందువల్ల వీళ్లంతా తెలంగాణ వచ్చి వ్యాపారం  చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ దుకాణాలకోసం  పెద్ద ఎత్తున పోటీ పడతారని తెలంగాణ ఎక్సయిజు అధికారులు ఆశిస్తున్నారు.
అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చే ‘ఎక్సయిజ్ ఇయర్’  (2019-21) లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజు పెంచాలనుకుంటున్నట్లు సమాచారం.
అయితే, దుకాణాల సంఖ్య పెంచే ప్రతిపాదనలేదని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా పర్మిట్ రూమ్ లను మూసేయడం కూడా జరగదని వారు చెబుతున్నారు.  గత ఎక్సైజ్ ఇయర్ లో అప్లికేషన్ ధర రు. 50 వేల నుంచి రు లక్ష చేశారు.
దీనితో ప్రభుత్వం ఆధాయం మూడింతలు పెరిగి రు. 411 కోట్లకు చేరింది. అంతకు ముందు ఎక్సైజ్ ఇయర్  2015-17లో ప్రభుత్వానికి అప్లికేషన్ ధర రూపంలో సమకూరింది కేవలం రు. 100 కోట్లే. ఈ సారి ఇంకా భారీగా రాబడి పెరుగుతుంది. ఎందుకంటే, పెద్ద ఎత్తున ఆంధ్రా డీలర్లు తెెలంగాణలో దుకాణాలకోసం దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు ధర నాన్ రిఫండబుల్ కాబట్టి ఎంత మంది దరఖాస్తు చేసినా అది రాబడే.
తెలంగాణలో ప్రొహిబిషన్ ప్రతిపాదన లేకపోయినా, పర్మిట్ రూమ్ లను  మూసేయాలని గతంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇపుడు ప్రతిపక్షాలనేవి తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పట్లో ఇలాంటి ఇలాంటి సంస్కరణ ఉద్యమాలు తెలంగాణలో వచ్చే సూచేల్లేవు.
కాబటి ఈ డిమాండ్  మళ్లీ తలెత్తుతుందని అధికారులు అనుకోవడం లేదు. ప్రతిపక్షాల తర్వాత పర్మిట్ రూమ్ లను వ్యతిరేకించింది బార్ యజమానులు. ఎందుకంటే, పర్మిట్  రూంల వల్ల ప్రజలు బార్లకు రావడం లేదుని, దానితో తమ అదాయం తగ్గిపోతున్నదని వారు వాపోతున్నారు.
అయితే, అధికారులు బార్ల వాదనతో ఏకీ భవించడం లేదు. పర్మిట్ రూమ్ లనేవి చిన్న చిన్న గదులు  మాత్రమే.  20 చదరపు  మీటర్లనుంచి 100  చదరపు   మీటర్లలోపే ఉంటాయి. దీనికి తోడు అక్కడ కుర్చీలుండవు. అందువల్ల వీటి వల్ల బార్లకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గదని అధికారులు చెబుతున్నారు.