జగన్ ‘కూల్చివేత’ మంచిదే, ఇది పెద్దలందరి మీద జరిగితేనే హర్షిస్తారు

(టి.లక్ష్మీనారాయణ)
1.అమరావతిలో లేచిన అక్రమ కట్టడాల కూల్చివేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచిది. ఆలోచన మంచిదైనా, విధాన నిర్ణయం, కార్యాచరణ సమగ్రంగా లేకపోతే, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది, దుష్పలితాలను చవి చూడాల్సి వస్తుంది.
2. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి చర్చ జరుగుతున్న పూర్వరంగంలో మిత్రులు చలసాని శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి  బృందం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. కృష్ణా నదికి ఒక కి.మీ. వరకు ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదన్న నా సూచనను కూడా ఆ వినతిపత్రంలో పొందు పరచడంతో నేను ఆ ప్రతినిధివర్గంలో ఒకడిగా వెళ్ళాను.
3. ప్రజా వేదిక నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నదుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ వగైరా చట్టాలను, నీటి పారుదల శాఖ అభ్యంతరాలను ఖాతరు చేయలేదన్న విమర్శ సద్విమర్శ. ఆ తప్పును నేటి ప్రభుత్వం సరిదిద్దడానికి విధానపరమైన నిర్ణయం తీసుకొని రాజకీయ సంకల్పంతో అమలు చేస్తే అభినందనీయం.
4. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా వేదిక అక్రమ కట్టడమని, దాన్ని 26వ తేదీ ఉదయాన్నే కూల్చివేయమని ఆదేశాలు జారీ చేస్తున్నానని, అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజా వేదిక కూల్చివేతతో మొదలౌతుందని విస్పష్ట ప్రకటన చేశారు.
5. చంద్రగిరి నుండి ఒక ప్రయివేటు కళాశాల విద్యార్థులు ఉత్తరం వ్రాశారని, ఆ కళాశాల భవనాలు అక్రమ కట్టడాలని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారని, అలాంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
6. రాష్ట్ర వ్యాపితంగా అక్రమ కట్టడాల కూల్చివేత ఆలోచన ఉత్తమమైనది. కారణం, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదుల గట్లను ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకొన్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. పర్యవసానంగా నీటి సమస్య, పర్యావరణ మరియు కాలుష్య సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.
7. హైదరాబాదు మహానగరంలో మూసీ నది ఏ విధంగా ఆక్రమణలకు గురైయ్యిందో, దాని దుష్ఫలితాల అనుభవాలు ఉన్నాయి. తాజా ఉదాహరణ, చెన్నయ్ మహానగరం త్రాగు నీటి సమస్యతో విలవిల్లాడి పోతున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం ఆహ్వానించతగినది.
8. అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్యవసానాలు, ప్రభావం విస్తృతంగా ఉంటాయి. కాబట్టి, రాష్ట్ర మంత్రివర్గం చర్చించి, సమగ్ర కార్యాచరణనను రూపొందించి, అమలు చేసి ఉంటే సముచితంగా ఉండేది, సత్ఫలితాలు ఉండేవి.
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొన్న అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం “ప్రజా వేదిక” కూల్చివేత వరకే పరిమితమైతే విమర్శలను ఎదుర్కోక తప్పదు. అప్పుడు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.
10. కృష్ణా నది – కరకట్టకు మధ్య ప్రయివేటు సంస్థలు – ట్రస్టులు, రాజకీయ నాయకులు, ఘరానా పెద్ద మనుషులు – పీఠాధిపతులు – స్వరూపానంద లాంటి స్వామీజీలు అక్రమంగా నిర్మించుకొని, వినియోగించుకొంటున్న భవనాలు, ఇతర కట్టడాలను కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగినప్పుడే ప్రభుత్వ నిర్ణయానికి విశ్వసనీయత, ప్రజల మద్ధతు సంపూర్ణంగా లభిస్తుంది.
(టి.లక్ష్మీనారాయణ, సాంఘిక రాజకీయ విశ్లేషకుడు)