ఈ ధిక్కారానికి 30 ఏళ్లు, చైనా జడిసి పోయే ఫోటో కథ… (వీడియో)

వొళ్లు గగుర్పొడిచే సన్నివేశం ఇది. అతగాడెవరో తెలియదు,చేసంచులు పట్టుకుని భయంకరంగా, అపుడే ఒక లేగదూడను దిగమింగిన భారంతో కొండ చిలువలా వస్తున్న యుద్ధ ట్యాంకులను అటకాయించాడు.
టాంకుల శ్రేణిని నడిపిస్తున్న ‘కమాండర్ టాంకు’ ముందు నిలబడ్డాడు. కమాండర్ కు ఏమి చేయాలో అర్థం కాలేదు. డజన్ల కొద్దీ వస్తున్న ట్యాంకులన్నీ ఆగిపోయాయి.
చేసంచులు పట్టుకునే ట్యాంకు పైకెక్కాడు. ట్యాంక్ కుమాండర్ తో ఏదో మాట్లాడాడు. కిందికి దూకాడు. అయినా ట్యాంకులను ముందుకు పోనీయలేదు. అతన్ని తప్పించి ట్యాంకులు పక్కకు తిరిగి పోయే ప్రయత్నం చేశాయి. చాలా సేపు ఈ తతంగం నడిచింది. తర్వాత ఎవరో అతన్ని పక్కకు లాగేశారు. ట్యాంకులు వెళ్లిపోయాయి.
20వ శతాబ్దపు మేటి ఫోటోగా పేరున్న ఈ ఫోటోను 1984 జూన్ 5 తేదీన అమెరికా ఫోటోగ్రాఫర్ జెఫ్ వైడెనర్ తీశాడు. అంటే సరిగ్గా 30 సంత్సరాల కిందట ఈ పోటో తీశారు.ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో  ఒక ఆధ్యాయం కేటాయించాల్సినంతటి ప్రాముఖ్యం ఈ ఫోటోకు ఉంది.
స్వేచ్ఛ కోసం, అవినీతి లేని సమాజం కోసం,పౌరుల ప్రాథమిక హక్కుల కోసం  జరిగిన ఒక శాంతియుత పోరాటానికి ఒక అనామకుడి శాంతియత ధిక్కారం ప్రతీక.
ఈ గొప్పఫోటకి 1990లో పులిట్జర్ అవార్డు వచ్చింది.
ఈ ఫోటో చైనా రాజధాని బీజింగ్ లోని  త్యీనమెన్ స్క్వేర్ మారణ కాండ జరిగిన మరుసటి తీసింది.వేలాది మంది విద్యార్థులను,ప్రేక్షకులను, విద్యార్థుల తల్లితండ్రులను హతమార్చి ‘స్వర్గ ప్రశాంతి ద్వారం’ (త్యీనమెన్) గా పేరున్న చోట రక్తం పారించి జూన్ 5 న వెనుదిరిగి పోతున్న ట్యాంకర్లివి.
ఈ మారణ కాండ 1989,జూన్ 4 తెల్లవారుజామున జరిగింది.
దాదాపు పదిలక్షల మంది విద్యార్థులు స్క్వేర్ లో సమావేశమయి చైనా కమ్యూనిస్టు పాలనలోని మానవ హక్కుల ఉల్లంఘనను ప్రశ్నిస్తున్నారు.
కమ్యూనిస్టు ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతికి, వాక్ స్వాతంత్య్రం అణచివేతకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఒక నెలరోజులు గా వారంతా అక్కడ గుమికూడి నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఆ యేడాది జూన్ మూడో తేదీనాటికి ఈ ఉద్యమం చైనాలోని 341 పట్టణాలకు వ్యాపించింది. ఏంజరుగుతుందోనని  ప్రపంచమంతా చైనా విద్యార్థుల వైపుచూస్తూ ఉంది.చైనా కమ్యూనిస్టు పార్టీ వెన్నులో వణుకు మొదలయింది.
అంతే, తెల్లవారు జామున చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం స్క్వేర్ మీద యుద్ధం ప్రకటించింది .అప్పటికే బీజింగ్ లో మార్షల్ లా ప్రకటించారు. కొన్ని వైపుల నుంచి యుద్ధట్యాంకులు అగ్నివర్షం కురిపించాయి. మరికొన్ని వైపుల నుంచి సైనికులు విద్యార్థుల మీద కాల్పులు జరిపారు. ట్యాంకులను విద్యార్థుల మీది నుంచే నడిపించారు.ఎంతమంది చనిపోయారనే విషయం ఎవరికీ తెలియదు.ఎందుకంటే, ఈసంఘటనకు సంబంధించిన ప్రతిచిన్నవిషయాన్ని చైనా నిషేధించింది. అసలు 1989 జూన్ 4 అనే తేదీ గుర్తు లేకుండా రికార్డులను చెరిపేస్తూ ఉంది.దాదాపు 3వేల మంది చనిపోయారని అంతా చెబుతారు. అయితే, అప్పుడు బీజింగ్ లో ఇంగ్లండ్ రాయబారిగా ఉన్న సర్ ఎలాన్ డొనాల్డ్ ప్రభుత్వానికి పంపిన ఒక సెక్రెట్ కేబుల్ లో మృతుల సంఖ్య పదివేలని పేర్కొన్నారు. ఈ కేబుల్ 2017లో బయటపడిందని ‘గార్డియన్’రాసింది.
ఇంతకు ఎవరీతను?
ఎవరికీ అంతుబట్టని అనామక యోధుడికి టాంక్ మన్ అని పేరు పెట్టింది బ్రిటిష్ టాబ్లాయిడ్స్.
తెలియదు. ఆతర్వాత ఏమయ్యాడో కూడా తెలియదు. బతికాడా, చనిపోయాడా? చంపేశారా?తెలియదు. కాని ప్రతి సంవత్సరం జూన్ 4 ఈ ఫోటో రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. స్క్వేర్ ప్రజాస్వామిక విప్లవంలో ఇది ఆఖరిఘట్టం ఆతగాడి చారిత్రాత్మక ధిక్కారంతో రక్తపు మడుగుల్లో  ముగిసింది. జూన్ 9 నాటికి అరెస్టులతో చావులతో ఈ ఉద్యమం దాదాపు ఆగిపోయింది.
భూమ్మీద ప్రతి అంగుళానికి సైబర్ నిఘా వ్యాపించిన ఈ రోజుల్లో కూడా ఈ ‘ట్యాంక్ మన్’ అచూకి ఎక్కడా కనిపించకుండా చైనా కట్టుదిట్టం చేసింది. చైనా ఇంటర్ నెట్లో ఈ పదం దొరకదు. చైనా సెర్చ్ ఇంజిన్లు ఈ పదాన్ని పట్టుకోలేవు. అతని జ్ఞాపకం మాయం చేయాలని చైనా చేస్తున్న ప్రతిప్రయత్నం అనామక ‘ట్యాంక్ మన్’ ను  శాంతియుత ప్రజాస్వామిక పోరాటానికి ప్రతీకగా మార్చేసింది.
‘టాంక్ మన్’ ఏమయ్యాడు?
కొన్ని పాశ్చాత్య పత్రికలు అతని పేరు వాంగ్ వీలిన్ (Wang Weilin)అని, వయసు 19 సంవత్సరాలు అని రాశాయి. అతనికి మరణ శిక్ష విధించారని అప్పటి అతని మిత్రులు అనుమానిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అతని గురించి ఏమీ తెలియదని, అరెస్టు చేసినట్లు కూడా తన దగ్గిర సమాచారం  లేదని నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జియంగ్ జెమిన్ ఒక సారి చెప్పారు.
కొందరేమో అతన్ని అక్కడున్న ప్రజలు పక్కకులాగే శారని చెబితే, మరికొందరు అతన్ని పక్కకలాగి మిలిటరీ అరెస్టు చేసిందని చెబుతున్నారు.ఒక ఏడాది తర్వాత అమెరికా టివి జర్నలిస్టు బార్బరా వాల్టెర్స్ జియాంగ్ జెమిన్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఈ ఫోటో చూపి అతనేమయ్యాడో తెలుసా అని అడిగారు.
ట్యాంకులు అతని మీది నుంచి వెళ్ల లేదని, అంటే కచ్చితంగా అతన్నిచంపలేదని అర్థం అని జియాంగ్ తెలివిగా చెప్పారు.
ఆతని పేరు పత్రికల ద్వారా తెలుసుకున్నామని, అయితే కంప్యూటర్లలో ఎంత వెదికినా అతని వివరాలు తెలియలేదని చైనా అధికారి ఒకరు చెప్పారు.
1989 జూన్ 3 నాటి ఒక ఫోటో…
అయితే, ఈ సంఘటన తర్వాత ట్యాంక్ మన్ చైనా నుంచి హాంకాంగ్ కు పారిపోయాడని అక్కడి నుంచి తైవాన్ కు పోయి అక్కడి ఒక మ్యూజియంలో పురాతత్వ నిపుణుడిగా జీవిస్తున్నాడని ట్యాంక్ మన్ తో పాటు స్క్వేర్ నిరసనల్లో పాల్గొనేందుకు బీజింగ్ వచ్చిన ఒక వ్యక్తి చెప్పారు.
సౌత్ కొరియా వార్తా సంస్థ యానాప్ కూడా అతను తైవాన్ లో తలదాచుకున్నాడని రాసింది.
అయితే, ఈ సంఘటన జరిగిన రెండు వారాలకు చైనా ప్రభుత్వం అతనికి మరణ శిక్ష విధించిందని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ దగ్గిర సలహాదారుగా పనిచేసిన  బ్రూస్ హెర్సెన్సోన్ 1999లో ప్రెసిడెంట్ క్లబ్ కు చెప్పాడు.
స్క్వేర్ నిరసనల తర్వాత చైనా ఫైరింగ్ స్క్వాడ్ అతన్ని చంపేసిందని మరికొందరు చెబుతున్నారు. అయితే, చాలామంది ఇంకా అతను ఎక్కడో సజీవంగానే ఉంటాడని ఆశిస్తున్నారు. చైనా లో అతని బొమ్మ కనిపించే అవకాశమే లేదు కాబట్టి తన ఫోటో సృషిస్టున్నఅంతర్జాతీయ సంచలనం గురించి, పాపం, ఆయనకు తెలిసే అవకాశం లేదు.
చైనాలో నిషేధం…
ప్రపంచమంతా చైనాను చూసి వణుకుతుంది. అయితే,చైనా జూన్ 4 అంటే వణికి పోతుంది. ఈ తేదీ గురించి, త్యీనమెన్ స్క్వేర్ లో జరిగిన రక్తపాతం గురించి గత 30 సంవ్సరాలలో పుట్టిన తరానికి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడింది.
రికార్డులో నుంచి ఈ నిరసనల పేరు తొలగించింది. ఈ నిరసనలను గురించి మాట్లాడటం, చదవటం, రాయడం, పాడటం అన్నీ నేరమే.గత వారం రోజులుగా ప్రపంచమంతా త్యీనమెన్ స్క్వేర్  అమరువీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటే, చైనా డెయిలీలో గాని, గ్లోబల్ టైమ్స్ లో గాని ఒక్క మాట రాయలేదు. ఒక్క ఫోటో లేదు. కొడుకులను, కూతుళ్లను కోల్పోయిన చైనా కుటుంబాలు ఇంట్లో రహస్యంగా శ్రద్జాంజలి ఘటించాలే తప్ప అది బయటకు పొక్కరాదు. 2019, త్యీనమెన్  30 వ వార్షికోత్సవం  అనే  మాట వినిపించకుండా ఇంకా బతికి ఉన్న నాటి ప్రజాస్వామిక  ఉద్యమకారులను, వృద్ధాప్యంలో ఉన్నా, గృహనిర్బంధంలో ఉంచారు.
నిజానికి ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలో ఒక వర్గం విద్యార్థులకు మీద సానుభూతి చూపింది. మరొక వ్యర్గం అది పాశ్చాత్య దేశాల కుట్ర అని ప్రచారం చేసింది. రెండో వర్గం గెలిచింది. మొదటి వర్గీయులను అరెస్టు చేశారు.దాదాపు 8 లక్షల మంది కమ్యూనిస్టులు విద్యార్థులకు మద్దతునిచ్చారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసిన పేరు అప్పుడు కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ జౌజియాంగ్ (Zhao Ziyang). విద్యార్థులకు మద్దతునిచ్చినందుకు ఆయన అన్ని పార్టీ పదవులనుంచి తొలిగించి గృహనిర్బంధంలో ఉంచారు. 2005 లో ఆయన సర్వహక్కులు కోల్పోయి  చనిపోయారు.
ఈ రోజు చైనాలో  త్యీనమెన్ స్క్వేర్ కు చైనీయులు కొత్త మార్గం కనుక్కున్నారు. స్క్వేర్ అమరులకు నివాళులర్పించేందుకు ఎవరింట్లో వాళ్లు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనిని చైనా ఆప లేదుగా!

(ఈ స్టోరీ మీకు నచ్చితే షేర్ చేయండి. ప్రజాస్వామిక జర్నలిజానికి చేయూత నీయండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *