తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ, మెప్మా డైరెక్టర్ టి.కే. శ్రీదేవి తెలిపారు.

సోమవారంనాడు మాసబ్ టాంక్ లోని మెప్మా కార్యాలయంలో పురపాలక శాఖ, మెప్మా డైరెక్టర్ టి.కే. శ్రీదేవి మెప్మా ప్రత్యేక కాల్ సెంటర్ ను రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలలో చదువుకునే నిరుద్యోగ యువతకు మెరుగైన శిక్షణ, నైపుణ్యం మెరుగుపర్చుకోవడానికి ఈ ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు.

కామాక్షి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ పని చేస్తుందని, పట్టణ నిరుద్యోగ యువత 040 – 48210000 అనే నెంబర్ కు కాల్ చేసి కెరీర్ గైడెన్స్ ను పొందవచ్చునని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులతో పాటు సాంకేతిక విద్య ను అభ్యసించిన నిరుద్యోగులు సైతం కెరీర్ గైడెన్స్ ను పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో 142 అర్బన్ లోకల్ బాడీ కేంద్రాలకు ఈ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5-30 గంటల వరకు కార్యాలయ పని వేళలలో పని చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కాల్ సెంటర్ కు వచ్చిన వివిధ ఫోన్ నెంబర్ల డేటాను భద్రపర్చడం జరుగుతుందని తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఏరోజు కారోజు విశ్లేషిస్తామని తెలిపారు.

ఇప్పటి వరకు పద్నాలుగు వేల మంది పట్టణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఉపాధి పొందిన అనంతరం వారు ఆ ఉద్యోగాలలో కొనసాగుతున్నారా లేదా ఇంకా మెరుగైన శిక్షణ కావాలా వంటి అనేక విషయాలపైన ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగికి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు అని, ప్లేస్ మెంట్ తర్వాత కూడా వారి పరిస్థితిని అంచనా వేయవచ్చు అని తెలిపారు. ప్లేస్ మెంట్ పొందిన వారందరినీ ఒక సంవత్సరంపాటు మెప్మా పర్యవేక్షిస్తుందని తెలిపారు. మధ్యలో ఉద్యోగం మాని వేసినా కూడా మరళా వారికి శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధి పొందిన వారందరికీ కార్మిక చట్టాలు కంపెనీలు పాటించడానికి దృష్టి సారించడానికి ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. మార్కెట్ పోటీ ప్రపంచంలో పోటీ పడే విధంగా తీర్చి దిద్దుతామని వివరించారు. ఏ ఒక్క ఫోన్ కాల్ ను మిస్ కాకుండా చూడడం ఈ సాఫ్ట్ వేర్ ప్రత్యేకత అని తెలిపారు. వివిధ స్థాయిలలో సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తామని, దీని ద్వారా నూటికి నూరు శాతం ఉపాధి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మెప్మా కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో నడుస్తున్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం, నెల వారి ఆదాయం పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలు, పట్టణ నిరాశ్రాయులకు వసతి కేంద్రాల నిర్వహణ, వీధి విక్రయదారుల వంటి కార్యక్రమాల ద్వారా మెప్మాను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి తగిన కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెప్మా అడిషనల్ డైరెక్టర్ అనురాధ, కామాక్షి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ సైదిరెడ్డి, రష్మీ, చైతన్య, పద్మ, కన్నన్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *