తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీలను అధికార టీఆర్ఎస్ చావుదెబ్బ తీసింది. మొత్తం 119 స్థానాలకు గానూ 88 చోట్ల ఘనవిజయం సాధించి విజయదుందుభి మోగించింది. అంతేకాకుండా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు రంగం సిద్ధమయింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.
త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతానని కందాళ ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ ను వీడిన సంగతి తెలిసిందే. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కారు ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కేందుకు సిద్దమయ్యారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.