టిడిపి జేబు సంస్థగా మారిన టిటిడి

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) నూతన పాలకమండలి లోతెలుగుదేశం ఎమ్మెల్యే వి అనిత కు స్థానం కల్పించడం వివాదంగా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్ద, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో పాటూ ప్రపంచంలోని ఏ దార్మిక సంస్థకు లేనంతగా సమాజికాభివృద్ధి కలబోసి ఉన్న అరుదైన వ్యవస్ద టిటిడి. నేడు తిరుపతి ఉంది అంటే అందుకు కారణం టిటిడి.

అంతే కాదు చిత్తూరు జిల్లా కూడా దాదాపు టిటిడి మీద ఆధారపడి ఉన్నది. అలాంటి సంస్థ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికారంలో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. టిటిడి అధికారులు, ఇక్కడి సిబ్బంది ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత ఏపి ప్రభుత్వానిది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం చేస్తున్న తప్పుల కారణంగా టిటిడి వివాదాలలోకి నెట్టబడటం బాధాకరం.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టిటిడి విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించినారు. అజయ్ కల్లాం లాంటి మంచి అధికారులను కూడా నియమించింది బాబే. రాజకీయ జోక్యం కూడా తక్కువగానే ఉన్నది. కానీ అనుభవం గడించి, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత కన్నా బాధ్యతగా ఉంటారని తిరుపతి ప్రజలు భావించినారు. కానీ బాబుగారి నిర్ణయాలను చూస్తుంటే ప్రజల అంచనాలకు భిన్నంగా పాలన ఉన్నట్లుంది. టిటిడి పాలనా వ్యవహరాలకు సంబంధించి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది లేని వ్యవస్థగా ఇలాంటి సంస్థను నడపడానికి కొద్ది బాధ్యతతో వ్యవహరిస్తే సరిపోతుంది. అంతే తప్ప అనుభవం, తెలివి తేటలు పెద్దగా అవసరం లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చాక టిటిడి పరిపాలన దారి తప్పింది. దీనికితోడు పాలక మండలి పదవీకాలం అయిపోయినా రెండళ్ల పాటు టిటిడి దిక్కుదివాణం లేకుండా సాగింది. టిటిడి విషయంలో ఇలా జరగడం ఆశ్చర్యం.  అధికారులు, పాలకమండలి రెండూ ఉంటేని పాలన సరిగా ఉంటుంది. ఒకరు చేసిన తప్పులను మరోకరు సరిదిద్దుతారు. పాలక మండలి లేకుండానే కాలం గడిపినారు. రెండు సంవత్సరాల పాటు చదలవాడ నాయకత్వంలో పెద్ద నిర్ణయాలు లేకపోయినా దాదాపు వివాదాలు లేకుండా పాలన జరిగింది.

2017-18 వరకు దాదాపు ఏడాదిగా టిటిడి చరిత్రలోనే ఎపుడూ లేనట్లుగా పాలకమండలి, అధికారుల కమిటి లేకుండానే నిబంధనలకు భిన్నంగా పాలన జరిపించడం బాబు కాలంలోనే జరిగింది. అంతే కాదు రాష్ట ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం విచ్చలవిడిగా టిటిడి నిధులను దుర్వినియోగం కూడా ఈ కాలంలోనే ఎక్కువ జరిగింది. రెండు పుష్కరాల కోసం కొట్ల రూపాయిల నిధలను వెచ్చించినారు. రాజకీయ నేతల అవసరాల కోసం నిబంధనలకు బిన్నంగా అనేక దేవాలయాలను టిటిడి దత్తత తీసుకునే విధంగా చేసిన నిర్ణయాలు భవిష్యత్ లో టిటిడి కి గుదిబండగా మారనున్నాయి.

విజయవాడ నడిబొడ్డున ఉన్న 100 కోట్ల టిటిడి ఆస్థిని దుర్గగుడికి బదలాయిస్తూ జీ ఓ నెం 445 ని తీసుకుని వచ్చినారు. ఇప్పటికీ ఆ వివాదం అలానే ఉంది. కోట్ల రూపాయిలతో అమరావతి చుట్టుపక్కలా అభివృద్ది కార్యక్రమాలకు ప్రణాలికలు రూపొందిస్తున్నారు. అన్ని రాజధానులలో స్దలం ఇస్తే ఆలయాలు నిర్మిస్తామని టిటిడి కోరడం ఆందోళన కలిగించే విషయం. అంతర్గతంగా అనేక విషయాలలో అధికారులు కూడా తప్పిదాలు చేస్తున్న కారణంగా టిటిడి నిత్యం వివాదాలతో నలుగుతున్నది.

గతంలో వై యస్ జగన్ ఆలయ ప్రవేశం చేసినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని నానా యాగి చేసిన అధికార పక్షం మరి క్రిష్టియన్ బాహాటంగా ప్రకటించుకున్న అనితకు పాలక మండలిలో స్థానం ఇపుడు తలెత్తిన వివాదం. ( తాను క్రిష్టీయన్ అని అనిత అన్నట్లు విడియో తునక ఒకటి నేడు ప్రజల ముందుకు వచ్చింది.) ప్రతిపక్ష నేత ఆలయ ప్రవేశం పై రాధాంతం చేసిన అధికారపక్షం అలాంటి ఆలయానికి పాలక మండలిని నియమించేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? ఈ మధ్యనే సిబ్బందిలో కొందరు అన్యమతస్తులన్న అనుమానంతో 42 మందికి నోటీసులను ఇచ్చింది టిటిడి.( వారిని నియమించేటప్పుడు కచ్చితంగా హిందువుగా ఉండాలి అన్న నిబంధన పెట్టకుండా ఎలా ఉన్నారు). ఇపుడు వారి వివాదం కోర్టులో ఉంది. అలాంటిది కచ్చితంగా పాలకమండలి సభ్యుడు హిందువు అయి ఉండాలన్న నిబంధన ఉన్నపుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత కదా. అది కూడా ఒక ఏడాది సమయం తీసుకుని నియమించిన పాలకమండలి విషయంలో అంత అనాలోచితంగా ఎలా వ్యవహరిస్తారు? అనిత గారు హిందువా, క్రిష్టీయన్ మతనికి చెందిన వారా అన్నది కచ్చితంగా చెప్పాల్సింది ప్రభుత్వం మాత్రమే. కానీ వారు మాట్లాడినట్లుగా వస్తున్న వార్తలు ( వీడియో) చూస్తుంటే వారు ఏ మతానికి చెందిన వారు అయినా టిటిడి పాలక మండలిలో ఉండటం మాత్రం అంత సముచితమైన నిర్ణయం కాదు. ఆమె మాట్లాడినట్లు గా వస్తున్న వీడియో నిజమైతే మాత్రం ప్రభుత్వం ఎటువంటి పట్టింపులకు పోకుండా వారిని తొలగించి ఆమె స్థానంలో మరో మహిళకు అవాకశం ఇవ్వడం ఒక్కటే పరిష్కారం. తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ వివాదం మరింత పెద్దది కాకుండా చూడాలి.

-యం. పురుషోత్తం రెడ్డి, తిరుపతి. 9490493436

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *