Home Telugu జగన్మోహనా! మొర ఆలకించవా: కార్యకర్తల వినతి

జగన్మోహనా! మొర ఆలకించవా: కార్యకర్తల వినతి

56
0
SHARE
(యనమల నాగిరెడ్డి)
వైసీపీ కార్యకర్తల నిరంతర శ్రమ, మీ అకుంఠిత దీక్ష, మీపై నమ్మకంతో ప్రజలు అందించిన అపూర్వ మద్దతుతో   అద్భుత విజయం సాధించి, రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన  చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపారు.
175 మంది సభ్యులున్న శాసనసభలో 151 మంది వైసీపీ నాయకులను గెలిపించి అఖండ మెజారిటీతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం  జరిగింది. ఆ తర్వాత క్రింది స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, దొడ్డి దోవన వైసీపీలోకి వచ్చి, నాయకులను ప్రసన్నం చేసుకొని తమను భక్షించడానికి యత్నిస్తున్న టీడీపీ అవినీతి జలగల నుండి సాధారణ కార్యకర్తలమైన తమను కాపాడాలని  వారు జగన్ రెడ్డిని కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలకు, అధినేతకు వారు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో పోలీసులు, రెవిన్యూ అధికారుల అండదండలతో టీడీపీ జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు  వైసీపీ నాయకులపైన , కార్యకర్తలపైన చేసిన దాడులు, దౌర్జన్యాల గురించి చెప్పనలవి కాదు. చేసిన అక్రమ దోపిడీల గురించి వివరించడానికి వీలుకాదు.
అలాగే ఆర్థికపరమైన అధికారమున్న అధికారుల వ్యవస్థను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిన వివరాలు అందరికీ తెలుసు. “నీరు-చెట్టు నుండి గృహనిర్మాణం, వృద్యాప్య పెన్షన్, ఇంటిస్థలాల మంజూరు, రేషన్ కార్డుల జారీ ఒకటేమిటి చెప్పుకుంటూ పొతే కొండవీటి చాంతాడంత జాబితా” బయటికి వస్తుంది.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం, ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకోవడం, ఉన్న కాల్వలను కుదించడం లాంటి అనేక ఘనకార్యాలు చేశారు.
తాము చేసిన తప్పుడు పనులను కప్పి పెట్టుకోడానికి, ఒకవేళ ప్రభుత్వం ఈ అవినీతిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశిస్తే అందులో నుంచి బయట పడటానికై  టీడీపీ నాయకులు వైసీపీలో చేరాలని ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తూ వైసీపీ నాయకుల చెంత చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
గతంలో వారు చేసిన అవినీతి స్థాయిని పట్టి వారు ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, రెండవ శ్రేణి నాయకులకు, గ్రామస్థాయి పెద్దల పంచన చేరడానికి తమకు వీలున్న మార్గాలన్నీ వెదుకుతున్నారు.
ఇప్పటి వరకు వైసీపీని, పార్టీ కార్యకర్తలను ఆగర్భ శత్రువులుగా చూసి, వేధించిన ఈ ప్రభువులు వైసీపీ మద్దతు సాధించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా వీరు (తాము ఇంతకాలం సంపాదించిన సొమ్ముతో) వైసీపీ శాసనసభ్యులకు పెద్ద,పెద్ద దండాలు వేయడం, పూల బుకేలు సమర్పించి తమ ప్రేమ చాటుకుంటున్నారు.  ఇక సన్మానాలు చేయడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే వైసీపీలో ఒకస్థాయిలో ఉన్న తమ స్నేహితులు, బందువులతో (ఇన్నిరోజులు పట్టించుకోని) బాదరాయణ సంబంధాలు వెలికి తీసి, వారి ద్వారా పార్టీలో చేరడానికి/ మద్దతు పొందడానికి యత్నిస్తున్నారు. ( ఈ బంధాలు ఇన్ని రోజులు ఏమయ్యాయో మీరే ఆలోచించాలి).
గత ఎనిమిది సంవత్సరాలుగా పార్టీ వెంట నడిచి  జెండా మోసిన కార్యకర్తలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీన పడ్డారు. పార్టీపై  తమ నిబద్ధతను, అధినేతపై తమ శక్తిని, విశ్వాసాన్ని ఎన్నికలలో చూపారు. ప్రస్తుతం మన నాయకులను అభినందించడానికి దండలు వేయడానికి, సన్మానాలు చేయడానికి “ఆర్థికంగా” అశక్తులుగా ఉన్నారు.
 అవకాశవాదం ఊపిరిగా బృతుకుతున్న వీరు “అధికారం పంచన లేకపోతె ఒక్క నిముషం కూడా బ్రతకలేరు”. అయితే తమ బ్రతుకు తెరువు కోసం పార్టీలోకి రావాలనుకుంటున్న “ఈ కలుషితమైన కొత్తనీటిని” రాకుండా నిరోధించే స్థితిలో కార్యకర్తలు లేరు.
ప్రస్తుతం పార్టీలో చేరాలనుకుంటున్న ఈ ఘనులు 2024 ఎన్నికల సమయానికి మళ్ళా ఎగిరి టీడీపీలోకానీ, మరో పార్టీలో కానీ దూకరని గ్యారెంటీ లేదు. అలాగే ఈ ఘనులు తమదైన శైలిలో పని చేసి, నాయకులకు దగ్గరై “నాయకుల చెవిలో జోరీగలుగా మారి”  వైసీపీని నమ్ముకొని ఉన్న “అసలు సిసలు” కార్యకర్తలను శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఈ దుస్థితి మొదలైందని, మొత్తం అన్ని నియోజకవర్గాలకు త్వరలో ప్రాకే అవకాశం ఉందని, వైసీపీని పట్టి పీడించడానికి సిద్ధంగా ఉన్న”ఈ  టీడీపీ వైరస్ ను” నిరోధించి పార్టీ క్యాడర్ ను రక్షించాలని వారు కోరుతున్నారు.
“రాజకీయాలలో తమ వెంట ఉన్నవారు ఎలాగూ తమ వెంటే ఉంటారు. కాబట్టి ప్రత్యర్థి పార్టీ వారిని దరి చేర్చుకొని, ప్రత్యర్థిని బలహీన పరచడం” నాయకుల సాధారణమైన ఎత్తుగడ గా ఉంటుందని, అయితే  ముందు తమ వెంట ఉన్నవారిని కాపాడుకొని (టీడీపీ వారి లాగా) ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ వారిని తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే పందికొక్కుల్లా ప్రజాధనాన్ని మేసిన వారిని కాకుండా నిజమైన టీడీపీ సాధారణ కార్యకర్తలను ఆకర్షిస్తే వైసీపీకి మేలు జరుగుతుందని వారు అంటున్నారు.
అవసరం కోసం జెండా నీడకు వచ్చే వాడి కోసం కష్ట పడి, ఏ కష్టం వచ్చినా జెండా వదలకుండా ఉన్న సాధారణ కార్యకర్తలను కాపాడాలని వారు నాయకులను కోరుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని ఈ “ఆయారాం గయారాం” ల విషయంలో   పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేయాలని, తమను కాపాడాలని కోరుతున్నారు.
(వైసీపీ కార్యకర్తలు సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారంలో పెట్టిన పోస్టింగులు మరియు కొందరు కార్యకర్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా రాసిన వ్యాసం. ఇందులో వక్తం చేసిన అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం)