కెసిఆర్ – జగన్ కు ఇప్పుడే ఎందుకు బెడిసింది?

(వి. శంకరయ్య)

రాష్ట్ర విభజన తదుపరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏ చిన్న పాటి సమస్య ఏర్పడినా సమస్యను పక్కన బెట్టి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శలు గుప్పించే వారు.

గమనార్హమైన  అంశమేమంటే  దానితో  అసలు  సమస్యలు పక్కదారి పట్టేవి. పరస్పర దూషణలు తెర మీదకు వచ్చేవి. ఫలితంగా కెసిఆర్ రాష్ట్రంలో తనకు అవసరమైన సెంట్ మెంట్ ను చల్లార కుండా కాపాడు కొచ్చేవారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో వుంటే తనకు తెలంగాణలో పొగ పెడతాడనే భయం కెసిఆర్ ను వెన్నాడేది.

ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఓటమికి కెసిఆర్ జగన్ కు అన్ని విధాలా సాయం అందించారు. ఈ సాయంపై పలు రకాల భాష్యాలు వున్నాయి.

అందుకనుగుణంగా ఎన్నికల తర్వాత కెసిఆర్ జగన్ ఒకరికొకరు కూడబలుక్కుని  వ్యవహరించారు. ఈ పరిణామం అందరికన్నా సీమ వాసుల్లో ఆశలు మోసులెత్తేటట్లు చేసింది. ఎందుకంటే సీమ ప్రాజెక్టుల వివాదాలు తెలంగాణతో ముడి పడి వున్నందున ఇన్నాళ్లకు ఒక దారి దొరికిందని భావిస్తూ వచ్చారు. అయితే, తామొకటి తలిస్తే ఆచరణలో దైవ మరొకటి చేసినట్లయింది.

తొలుత ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు మొదలయ్యాయి.  ఇరువురు నేతల మధ్య మాట మంతీకి బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల మధ్య సాగు నీటి వివాదాలు ప్రారంభం కాగానే అందరికన్నా ముందు సీమ వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

రాజకీయాల పరిణామాలు ఎప్పుడూ నేతలు తామూహించినట్లు కొనసాగవు. క్షేత్రస్థాయి పరిణామాలను ఆధారం చేసుకొని మార్పులకు లోనౌతుంటాయి.

చంద్రబాబు నాయుడు ను ఓడించడంలో ఏకీభావం వున్నంత మాత్రాన కెసిఆర్ ప్రయోజనాలు జగన్ ప్రయోజనాలు ఒకే రీతిలో ఏలా వుంటాయి?

పైగా రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు ఒకే రీతిలో వుండవు కూడా.ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానివే. అందుకే ఎన్నికల తర్వాత కొన్నాళ్లకే మూడు పువ్వులు ఆరు కాయలుగా వున్న ఇద్దరు ముఖ్యమంత్రులు మైత్రి బెడిసి కొట్టింది.

ఇందుకు అనేక కారణాలు వున్నా ఆంధ్రప్రదేశ్ తో సెంట్ మెంట్ తగాదా కొన సాగించాల్సిన పరిస్థితి కెసిఆర్ కు తప్పలేదు. పైగా బిజెపికి వ్యతిరేకంగా ఉండేందుకు జగన్ తోడ్పాటు కెసిఆర్ కు ఏమాత్రం లభించడం లేదు. రాష్ట్రంలో ప్రధానంగా బిజెపి విసురుతున్న సవాలు నిలువరించాలంటే ప్రజలను సెంట్ మెంట్ తో రగిల్చి వ్యతిరేకత తగ్గించుకోవలసిన అగత్యం కెసిఆర్ కు ఏర్పడింది.

దీనికి తోడు అగ్నికి వాయువు తోడైనట్లు తనకు పొగబెడుతున్న బిజెపిని జగన్ పల్లెత్తు మాట అనలేని స్థితిలో వుండటం కెసిఆర్ కు పుండుపై కారం రాసినట్లయింది.

చంద్రబాబు నాయుడును ఓడించడంలో తను అన్ని విధాలా సాయపడినా తనకు పొగ బెట్టే బిజెపికి వ్యతిరేకంగా మాట మాట్లాడక పోవడం కెసిఆర్ కు చిర్తెత్తుకొచ్చినట్లుంది.

ఈ సందర్భంలో ఎవరికైనా ఒక సందేహం రాక మానదు. రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలు వారికుంటాయని ఊహించ లేనంత స్థాయిలో కెసిఆర్ వున్నారా?

ఒక సంవత్సరంగా రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు తీవ్రంగా వున్నా గతంలో చంద్రబాబు నాయుడు పై చీటికి మాటికి దాడి చేసినట్లు ఇపుడు కెసిఆర్ జగన్ మీదకు నాలుక ఝళిపింపచడం లేదు.

ఎన్నికల్లో ఎంతో సాయం చేసినా కృతజ్ఞత చూపలేదనే వరకే పరిమితమయ్యారేమో! ఇంతవరకు ఇద్దరు మధ్య సంబంధాలు లోలోపల ఉడుకు తున్నా పైకి ఏమీ జరగనట్లు నటిస్తూ వచ్చారు.

గత పక్షం రోజులుగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు తీవ్ర రూపం దాల్చడం తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ  నేపథ్యంలో కెసిఆర్ ఒక్క సారిగా జగన్ కు వ్యతిరేకంగా బాంబు పేల్చారు. ఆంధ్ర ప్రాజక్టులు అక్రమం అన్నారు. దానితో పాటు తాను ప్రజల దృష్టిలో తెలంగాణ  చాంపియన్  అనిపించుకునేలా పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు.

జగన్ మీద ఇంత కాలం తనలో వున్న అక్కసు వెళ్ల గక్కారు . గతంలో చంద్రబాబు నాయుడుపై సాగించిన దూకుడును ఇప్పుడు జగన్ పై కూడా గురి పెట్టారు. ఇక్కడితో ఇద్దరి సంబంధాలు పూర్తిగా తెగినట్లే.

ఇదిలా వుండగా కెసిఆర్ ప్రకటించిన కొన్ని పథకాలు మిగులు జలాల ఆధారంగా ప్రతిపాదించిన సీమ ప్రాజెక్టులకు శరాఘాతమయింది.

కెసిఆర్ అంత వరకే పరిమితం కాకుండా ఈ పాటికే వ్యూహాత్మకంగా వ్యవహరించి మొత్తం కృష్ణ జలాల పున:పంపిణీకి టెండర్ పెట్టారు.

ఇదిలా వుండగా పీత బాధలు పీతకు వున్నట్లు రాష్ట్రంలో అధికారంలోని కొచ్చినా జగన్ కు అన్నీ నిద్రలేని రాత్రులే! తనకు ఎన్నికల్లో సాయం చేసిన కెసిఆర్ కు సహాయ పడలేని పరిస్థితి నెలకొని ఉంది.

అందుకే గతంలో ఒక మారు కెసిఆర్ పిలిచి అన్నం పెడితే కెలికారనే విమర్శ చేసినా తను గాని తన పార్టీ వారు గాని ప్రతి విమర్శ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనువుగా లేదు. కేంద్రంతో పెట్టుకొంటే ఒక్క రోజు ప్రభుత్వం నడవదు. పైగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి తద్వారా ఈ పాటికే నమోదై వున్న సిబిఐ కేసుల నుండి బయట పడాలనేది జగన్ రాజకీయ సంకల్పం.

ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు. కెసిఆర్ తో సంబంధాలైనా తెంచుకుంటాడు గాని కేంద్రంతో తగాదా పెట్టుకోడు.

అందుకే ప్రత్యేక హోదా గురించి చేతులెత్తేశారు. తుదకు చట్ట బద్దంగా హక్కు గల పోలవరం ప్రాజెక్టుకు నిధులు గట్టిగా అడగ లేని స్థితిలో వుండగా ఇక కెసిఆర్ కు అండగా ఏలా నిలవగలరు?

ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఓడించడం వరకే ఇద్దరి ప్రయోజనాలు ఒకటిగా వుండినవి.

ఇద్దరూ అధికారం చేపట్టిన తదుపరి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి కావడంతో బిజెపి నుండి ముప్ఫు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కెసిఆర్ అగ్గిలో గుగ్గిలం అయ్యారు.

దీనికి తోడు జగన్ సోదరి షర్మిల కెసిఆర్ కు కంటిలో నలుసు అయింది. మరో విశేషమేమంటే ఆంధ్ర ప్రదేశ్ లో వైకాపా కు గౌరవాధ్యక్షురాలుగా వున్న వైఎస్ విజయలక్ష్మి తెలంగాణలో షర్మిలమ్మ వెంట వుండటం పుండుపై కారం రాసినట్లయింది.

అన్నీ కల గలసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు మరింత రగల్చడమే కాకుండా ఇంతకాలం ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య చాప కింద నీరు లాగా వుండిన  వ్యవహారం ప్రస్తుతం పెను ఉప్పెనలా పరిణమించేలా ఉంది.

(వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు 9848394013)

3 thoughts on “కెసిఆర్ – జగన్ కు ఇప్పుడే ఎందుకు బెడిసింది?

  1. శంకరయ్య గారు, మీ విశ్లేషణ బాగుంది.
    కేసీఆర్ కు, చంద్ర బాబుకు మధ్య ఉన్న దాయాది వైరం కేసీఆర్ కు జగన్ కు మధ్య లేదు.
    కేసీఆర్, చంద్ర బాబు ఒకే పార్టీ లో పని చేసిన వారు కనుక, అప్పటి వారి వ్యక్తి గత విభేదాలు రాజకీయ విభేదాలుగా బయట పడ్డాయి.
    కేసీఆర్ నోటి దురుసు తెలిసిందే.
    రెండు రాష్ట్రా ల మధ్య నీటి వివాదాలు ఉన్నాయి.
    ఇవి ఒక పట్టాన తెగ వు తెల్లర వు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *