గుర్రప్ప కొండకు అద్భుతమయిన ట్రెక్… (ఫోటో గ్యాలరీ)

(భూమన్*)

మొన్న తిరుపతి సమీపంలో ని  గంగుడుపల్లెకి జల్లికట్టు చూడ్డానికి పోయినపుడు అక్కడ దూరాన ఒక కొండ మీద మా దృష్టి పడింది. అదేమిటని అక్కడున్న వారిని సమాచారం అడిగాం. అపుడు వాళ్లు దాని గురించి చాలా ఆసక్తి కరంగా  చెప్పారు.

ఈ  కొండ పేరు గుర్రప్ప కొండ. అక్కడ గుర్రప్ప అనే దేవుడు కొలువై ఉన్నాడు. అక్కడికి అనాదిగా ఇక్కడి ప్రాంతాలు ప్రజలు పోతూంటారు. పూజలు చేస్తుంటారు. వాల్లందించిన సమాచారం ప్రకారం, ఇది చాలా ఎత్తయిన కొండ. ఎక్కడం అంతసులభం కాదు. నిటారుగా ఎక్కాలి. పైకి చేరుకోవాడనికి రెండు గంటలకు పైగా పడుతుంది.

వాళ్ల చెప్పాక ఈ కొండ  సంగతేమిటో చూడాలనిపించింది.

మా ట్రెకర్స్ బృందం సై యంటే సై అంది. అలా మరుసటి రోజునే గుర్రప్ప కొండ ట్రెక్ బయలు దేరాం.

వాళ్లు చెప్పింది నిజమే. సమీపంలోని పల్లెనుంచి కొండమీదికి చేరుకోవాలంటే  అయిదు కిలోమీటర్లు నడవాలి. ఇందులో కొండ ఎక్కేందుకు నాలుగు కిలోమీటర్లు ట్రెక్ చేయాలి.  నిటారుగా ఎక్కాలి. కనీసం రెండు గంటలు పడుతుంది. మా బృందానికి ఇలాంటి ట్రెక్ అనుభవం ఉంది కాబట్టి, మేం ఒకటిన్నర గంటలో శిఖరం మీదకు చేరుకున్నాం.

కొండ మీదకు ఎక్కేందుకు ఉన్న దారులన్నీ వర్షాల వల్ల ఏర్పడిన సెలయేర్ల దారులే. ఎక్కేకొద్ది గుర్రప్ప కుండ సౌందర్యం తెలుస్తూ ఉంటుంది. ఇంత అద్భతమయిన ప్రకృతి సౌందర్యం ఈ మధ్య మాకు కనిపించలేదు. చుట్టూర కొండలు, కనుచూపు మేరా పచ్చని వాతావరణం.

ఇది కూడా చదవండి 

https://trendingtelugunews.com/top-stories/features/ahobilam-place-of-origin-of-cult-of-narasimha-swamy/

ఇలాంటి కొండ తిరుపతికి 30 కిమీ దూరాన ఉందని ఇంతవరకు మాకు తెలియనే తెలియదు. తిరుపతి నుంచి హైవే దారి పడితే, చంద్రగిరి వస్తుంది. అక్కడినుంచి గుర్రప్ప కొండదారి పట్లాలి. దారిలో  దోర్నకంబాల, మల్లాయపల్లె, మంటపం పల్లె వస్తాయి.  తర్వాత గంగుడుపల్లె. ఈ దారిలో గంగుడుపల్లె చివరి గ్రామం. అక్కడి నుంచి కిలోమీటరు నడుస్తే గుర్రప్పకొండ వస్తుంది. ఒకటే మార్గం.

కొండమీద ఉన్న దేవుడు గుర్రప్ప.  దేవుడంటే ఏమీ లేదు, అక్కడ రెండు మర్రిచెట్ల మధ్య రెండు రాళ్లు పేర్చడమే. గ్రామదేవతలంటే ఇంతకదా. సాధారణంగా గ్రామ దేవతులు మహిళలే. ఇలా పురుష గ్రామదేవుడు  చాలా అరుదు. గుర్రప్ప ఆరాధన రాయలసీమలో కనిపిస్తుంది. కడప జిల్లాలో గుర్రప్ప కోన ఉంది. ఇక్కడ గుర్రప్ప కొండ ఉంది.

Like this post? Please share it with friends!

ఇక్కడికి ప్రతిసంవత్సరం ఈచుట్టుపక్కల ప్రాంతాల ప్రజలొస్తారు.చాలా మంది రెండు గుర్రాలను బహూకరిస్తారు. ఇలా వచ్చిన గుర్రాలను ఇక్కడ చూడవచ్చు. గుర్రప్ప ఇక్కడి ప్రజలకు ముఖ్యమయిన దేవుడు. ఆయన చాలా మహిమ ఉన్న దేవుడని, ఆయనను నమ్ముకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే తలనీలాలర్పిస్తారు. పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. భోజనాలు చేస్తారు. దినమంతా ఆ కొండలల్లో ఉల్లాసంగా గడిపి సంతోషంగా తిరిగి వెళ్తుంటారు.

ఏదైతేనేముంది, ఈ గ్రామాలనుంచి వందల సంఖ్యలో ప్రజలు ఈ కొండ ఎక్కడి, ప్రకృతి మధ్య ఒక దినమంతా, ఇతర ప్రాపంచిక సమస్యలు మర్చిపోయి జీవించి, ఈ కొండలన్నీకలియ తిరిగి, ఇంటికి వెళ్లడమనేది చాలా ఆరోగ్యదాయకం. ఇదొక మంచి అలవాటేగా.

మరొక చిత్రం ఏమిటంటే, తీరా కొండ ఎక్కింతర్వాత, మేకల కాపర్లకుటుంబాలు ఒక పదిదాకా నివాసముండటం మాకు కనిపించింది. వాళ్లంతా ఈ కొండల్లో మేకలును మేపుతూ జీవిస్తున్నారు. మేకల కోసంవాళ్లు చక్కటి గూళ్లు తయారు చేశారు. భలే అందంగా ఉంటాయి. అడవి జంతువులు మేకల మీద దాడి చేయకుండా ఉండేందుకు, పాములు గీములు రాకుండా కట్టుదిట్టంగా వీటిని ఏర్పాటు చేశారు.

తిరుపతి, చంద్రగిరి, కాళహస్తినుంచి వ్యాపారస్థులు వచ్చి ఈ మేకలను కొనుక్కుని పోతుంటారని వారు చెప్పారు. వారానికొకసారి కిందికి వెళ్లి బత్తెం తెచ్చుకుని ఇక్కడే జీవిస్తూ ఉంటారు. ఎక్కడో దూరాన  కొండమీద ఉన్న వీళ్లకి మాంసం మార్కెట్ గురించి బాగా తెలుసు. మార్కెట్ లో మాంసం ధర ఎంతుందో తెలుసుకుని ఆ ప్రకారమే వ్యాపారస్థులకు మేకలు అమ్ముతుంటారు.

మొత్తానికి గుర్రప్ప కొండ ఎక్కి పైకి  రావడం మాకు గొప్ప అనుభూతనిచ్చింది. అక్కడ క్రూర జంతువులేమీ లేవుగాని, ముళ్లపందులు, జింకలు, నెమళ్లు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. దారిపొడుగునా రకరకాల పక్షుల అరుపుల మధ్య మన ట్రెక్ సాగుతుంది. ఇదొక గొప్ప అనుభవం.

ఇక్కడొక చిత్రం జరిగింది. ఈ గ్రామాలలో నా పూర్వ విద్యార్థులున్నారు. మేము వస్తున్నట్లు తెలియగానే వాళ్లంతా గ్రామస్థులను వెంటేసుకుని వచ్చి స్వాగతం పలికారు. వాళ్ల మేకపోతును తీసుకుని వచ్చారు. మాతో పాటే కొండమీదకు వచ్చారు. మాకు విందు నిచ్చారు. మీకు తెలుసోలేదో, మా కడప జిల్లాలో కడ్డీచియ్యలు చాలా పాపులర్, పొద్దుటూరు వెళ్తే కడ్డీచియ్యలు తినకుండా వెనక్కి రావద్దు. మాకు అనుకోకుండా , గుర్రప్పకొండమీద కడ్డీచియ్యలు ఆరగించేఅవకాశం  కల్పించారు మా పూర్వ విద్యార్థులు.  ఈ అవకాశం కల్పించిన గంగుడుపల్లి రైతులకు, మిత్రులకు, నా పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇది వేరేకథ.

మేం కొండమీదకు  గంగుడు పల్లె వైపు నుంచి ఎక్కాం. దిగేందుకు మంటపం పల్లె వైపునుంచి ఉన్న మరొక దారిని ఎంచుకున్నాం. ట్రెక్ లో ఎపుడూ ఈ పద్ధతి పాటిస్తుంటాను. వచ్చిన దారినే తిరిగి రావడం నేను చేయను. ఎందుకుంటే, ఇలాంటి చోటకు వచ్చినపుడు సాధ్యమైనంత వరకు కొత్త దారులు తొక్కడం అలవాటు. అపుడే  మనకు ఈ ప్రాంతాన్ని తనివితీరా వీక్షించగలం.

మంటపం పల్లె వైపునున్న దారి కష్టమని, దూరమని మిత్రలు చెప్పాక, అటువైపునుంచే దిగాలన్నపట్టుదల బలపడింది. కొండన మీది నుంచి  కొత్తదారిలో దిగివచ్చాం. ఈ ట్రిప్  కూడా చాలా ఉత్సాహంగా సాగింది. ఈ ట్రెక్ ఎంత బాగుందంటే, మరొక సారి తొందర్లోనే రావాలని నిర్ణయించుకున్నాం.

అపుడు రెండు రోజులు ఈ కొండమీద గుడారాలేసుకుని గడిపి, చుట్టుపక్కల కొండలన్నీ కలియదిరిగి రావాలని కోరిక. ఎందుకంటే, తిరుపతి పరిసరాలలో ఎవరికి తెలియని, తెలిసినా పెద్దగా సమాచారం లేని వింతలు విశేషాలు ఇలా ఒకటొకటే బయటపడుతున్నాయ్. ఒకచోటికి వెళ్లితే అక్కడి సమీపంలో ఇంతవరకు ఎవరికీతెలియని అందమయిన ప్రదేశాల ఉనికి వెల్లడవుతూ ఉంది. ఈ కొండల్లో తిరిగితే, పురాతన  కట్టడాలు కనిపించవచ్చు,  గుహలైనా కనిపించవచ్చు. అందులో పురాతన మనిషి  గీచిన కుడ్యచిత్రాలూ కనిపించవచ్చు. అలా జరిగితే వాటిని ప్రపంచానికి తెలియచేయాలన్న ఆశయం కూడా మా ట్రెక్స్ లో ఉంది. మా ట్రెకింగ్ ఆశయం మరొకటి కూడా ఉంది. ఈ కొండల్లో, కోనల్లో, గుండాల్లో, మడుగుల్లో, అడవుల్లో సాగుతున్న మా పాదయాత్రలు చూసి మీరూ ఇన్ స్పైర్ అవుతారని, నెలకో, రెన్నెళ్లకో, కనీసం, అయిదారు నెలలకొకసారైన ఇలాంటి కొండ ప్రాంతాల్లో తిరుగుతారని ఆశ. ఇలా తిరిగి ప్రకృతితో మమేకమయి ఒకటి రెండు రోజులు గడిపినపుడు మీ  ఆరోగ్యం బాగపడుతుంది, మనచట్టూర ఉన్న కొండలను,వనాలను కాపాడుకోవడం ఎంత అసవరమో మీకు తెలుస్తుంది, ఇదే విషయాన్ని మీరూ నలుగురి మీరు చెబుతారని నమ్మకం.

(భూమన్  75 సం. విశ్రాంత అధ్యాపకుడు,రచయిత, వక్త, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *