నాటి ల‌క్ష్మీపుర అగ్ర‌హార‌మే నేటి ఎంఆర్‌ప‌ల్లె (తిరుప‌తి జ్ఞాప‌కాలు-10)

(రాఘ‌వ శ‌ర్మ)‌
మా నాన్న‌కు నెల్లూరు ట్రాన్స‌వ‌ర్ అయ్యింది.నేను బాప‌ట్ల‌లో డిగ్రీ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు రాస్తుండ‌గానే 1975లో ఎమ‌ర్జ‌న్సీ విధించారు
తిరుప‌తి వ‌దిలిపోతున్నామ‌న్న‌ బాధ‌.ఎన్జీవో కాల‌నీలో ఇల్లు ఖాళీ చేసి వెళుతూ వెళుతూ వెన‌క్కి తిరిగి చూశాను.
తిరిగిన ప్రాంతాల‌న్నీ గుర్తు చేసుకున్నాను. తిరుమ‌ల కొండ‌ను వీడుతున్నందుకు గుండె బ‌రువెక్కింది.
మళ్ళీ తిరుప‌తి వ‌స్తామో లేదో న‌న్న బెంగ‌. రెండేళ్ళ‌కే తిరుప‌తితో జీవితం ఎంతగానో పెనవేసుకు పోయింది.
అటు బాప‌ట్ల‌, ఇటు నెల్లూరు. ఎక్క‌డా లైబ్ర‌రీ వ‌దిలేవాణ్ణి కాదు.
ఎమ‌ర్జెన్సీ కాల‌మంతా నా ఆలోచ‌న‌ల్లో రాజ‌కీయ, సామాజిక‌ చైత‌న్యం అలుముకుంది.
మా కుటుంబం నెల్లూరులో ఉండ‌గానే 1977లో ఎమ‌ర్జెన్సీ ఎత్తేశారు. అప్పుడే మా నాన్న‌కు మ‌ళ్ళీ తిరుప‌తి ట్రాన్స‌వ‌ర్ అయ్యింది.
తిరుప‌తి వెళుతున్నందుకు మ‌ళ్ళీ ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. ప‌శ్చిమాన పెరుమాళ్ళ ప‌ల్లె.. ఆగ్నేయాన‌ తిరుప‌తి-తిరుచానూరు మ‌ధ్య‌..
ఉత్త‌రాన ఎన్‌జీవో కాల‌నీ..ఇప్పుడు ద‌క్షిణాన ఉల్లిప‌ట్టిడ‌..!తిరుప‌తికి న‌లుదిక్క‌లా జీవించే అవ‌కాశం ఎంత బాగుందో!
మేం ఇక్క‌డికి వ‌చ్చిన కొత్త‌ల్లో ఉల్లిప‌ట్టిడ అన్న పేరు చాలా త‌మాషాగా అనిపించేది! ప‌ట్టిడ అంటే చేను అన్న అర్థం.
ఈ ప్రాంతంలో మెట్ట పొలాన్ని చేను అని, వ‌రి పొలాన్ని మ‌డి అని అంటారు.బ‌హుశా ఉల్లి చేలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ గ్రామానికి ఉల్లి ప‌ట్టిడ అన్న‌ పేరు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు.
ఇక్క‌డ పేర్లు చాలా త‌మాషాగా అనిపించేవి.ఉల్లిప‌ట్టిడ లాగానే బైరాగి ప‌ట్టెడ ప్రాంతం కూడా ఉంది.
ఉల్లి ప‌ట్టిడ‌లో మ‌చ్చ‌బ్బ అనే వ్య‌క్తి  ‘బాడుగకు’ ఇవ్వడానికి చాలా పూరిళ్ళు క‌ట్టాడు.
మేం అత‌ను క‌ట్టిన ఒక మిద్దె ఇంట్లో ‘ బాడుగకు’ చేరాం.
అత‌ను రైల్వే గేటుమాన్ గా ప‌నిచేస్తూ రిటైర‌య్యాడు.
మ‌చ్చ‌బ్బ ఒంటి నిండా న‌ల్ల‌టి పెద్ద‌ పుట్టు మ‌చ్చతో పుట్టాడు.
అందుకే అత‌న్ని అంతా మ‌చ్చ‌బ్బ అన్నారు. అత‌నికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది.
మ‌చ్చ‌బ్బ న‌ల్ల‌గా, స‌న్న‌గా, పొడుగ్గా ఉండేవాడు.
తెల్ల‌టి పంచ‌క‌ట్టుకుని, తెల్ల‌టి ష‌ర్టు వేసుకుని పెద్ద‌రికంతో చాలా మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించేవాడు.
పిల్ల‌లు, మ‌నుమ‌లు, మునిమ‌నుమ‌ల‌తో ఆనందంగా కాలం వెళ్ళ‌దీసేవాడు.
మేం అక్కడ వుండగానే మా వీధిలో ఒక పిల్ల‌వాడు తెల్ల‌గా పుట్టాడు. ఆ పిల్ల‌వాడిని అంతా తెల్ల‌బ్బా అని పిలిచేవారు. అదే అత‌ని పేరైపోయింది.
అలాగే దివిసీమ ఉప్పెన స‌మ‌యంలో పుట్టిన పిల్ల‌వాడిని వాళ్ళ అవ్వ ‘వీడు తుఫాన్లో పుట్టినాడే! వీడి పేరు తుఫాన్ ‘ అంది. అంతే అతని పేరు తుఫాన్ అయిపోయింది.
తుఫాన్ స్కూట‌ర్ మెకానిక్‌గా చేస్తూ, మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఇప్ప‌టికీ స్కూట‌ర్లు, మోటారు సైకిళ్ళు బాగు చేస్తుంటాడు.
ఉల్లి ప‌ట్టిడ తిరుప‌తికి ద‌క్షిణాన ఉంటుంది.ఇది ముత్యాల‌రెడ్డి ప‌ల్లె (ఎంఆర్ ప‌ల్లె) పంచాయితీకి శివారు గ్రామం.
ఇది శ‌తాబ్దాల క్రితం మాట‌.ముత్యాల‌రెడ్డి ప‌ల్లె అస‌లు పేరు ల‌క్ష్మీపుర అగ్ర‌హారం.
ల‌క్ష్మీ దేవి అనే బ్రాహ్మ‌ణ మ‌హిళ‌కు కార్వేటి న‌గ‌ర సంస్థానాదీశుడు ఈ ప్రాంతంలో భూముల‌ను ఇనాంగా ఇచ్చాడ‌ట‌. ఆమెకు వార‌సులు లేక ఈ భూముల‌న్నీ ఇస‌నాకుల రెడ్ల ప‌ర‌మైపోయాయి.
మా కుటుంబం ఇక్క‌డికి వ‌చ్చే వ‌ర‌కు ఈ రెండు గ్రామాల్లో ఒక్క బ్రాహ్మ‌ణ కుటుంబం కూడా లేదు.
ముత్యాల‌రెడ్డి ప‌ల్లెలో అంతా వ్య‌వ‌సాయ దారులు. వ్య‌వ‌సాయ‌మే వీరి జీవ‌నాధారం. ఒక‌రిద్ద‌రు టీటీడీలో ఉద్యోగులు.
ఉల్లిప‌ట్టిడ‌లో వ్య‌వ‌సాయంతో పాటు, ఇత‌ర చిన్న చిన్న ప‌నులు చేసుకుని జీవించే క‌ష్ట‌ జీవులు ఎక్కువ‌.
మేం 1977లో ఉల్లిప‌ట్టెడ వ‌చ్చిన కొత్త‌ల్లో ఒక సామాజిక వ‌ర్గంలో ఒక వింత ఆచారం ఉండేది. కొంద‌రు మ‌హిళ‌లు జాకెట్లు తొడుక్కునే వారు కాదు. చీర కొంగునే జాకెట్‌గా క‌ప్పుకునేవారు.
గోపిక‌ల చీర‌లెత్తు కెళ్ళిన కృష్ణుడి ప‌ట్ల ఆరాధ‌నాభావంతో వారీ ఆచారాన్ని పాటించేవార‌ని ఆ రోజుల‌లో ఒక పెద్దావిడ‌ చెప్పింది.
ఈ ఆచారం ఇప్పుడు లేదు. అంత‌రించిపోతున్న ఆ ఆ చార‌పు అవ‌శేషంగా ఆరోజుల‌లో కూడా పెద్ద వాళ్ళు మాత్ర‌మే జాకెట్లు లేకుండా చీర కొంగును క‌ప్పుకునే వారు.
వ‌య‌సులో ఉన్న వాళ్ళు మామూలుగా జాకెట్లు వేసుకునే వారు.
ఇప్పుడెవ‌రూ జాకెట్లు లేకుండా లేరు. పాత త‌రం వెళ్ళిపోయింది. కాల క్ర‌మంలో నాగ‌రిక‌త పెరిగి ఆ ఆచారం అంత‌రించింది.
తిరుప‌తి నుంచి వ‌చ్చే రోడ్డు ఈ రెండు గ్రామాల‌ను విడ‌దీస్తోంది.
కుడి వైపున ఉండే ఉల్లిప‌ట్టిడ‌ను ‘ ఎగూరు ‘ అనేవారు.
ఎడ‌మ‌వైపున కాస్త లోప‌ల‌కు ఉండే ముత్యాల‌ర‌డ్డిప‌ల్లెను ‘దిగూరు ‘ అనేవారు.
మొత్తం మ‌ట్టి రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండేది.
ఉల్లిప‌ట్టెడ‌లో ప‌ల్లె రెడ్లు, యాద‌వులు ఎక్క‌వ‌. ముత్యాల రెడ్డిప‌ల్లెలో పంట‌ రెడ్లు ఎక్కువ‌
తిరుప‌తినుంచి వ‌స్తుంటే మ్యూజిక్ కాలేజీ, క్యాంప‌స్ స్కూల్ మ‌ధ్యలో ఉండే రోడ్డులో వెళితే ఎదురుగా రైల్వే అండ‌ర్ బ్రిడ్జి క‌నిపిస్తుంది.
నూట యాభై సంవత్సరాల నాటి ‘ హెర్మన్ స్ బర్గ్ తెలుగు మిషన్ ‘వెస్ట్ చర్చ్
అది దాటితే పురాత‌న‌మైన‌ తెల్ల‌టి వెస్ట్ చ‌ర్చి క‌నిపిస్తుంది.
ఈ చ‌ర్చి కంపౌండు చాలా పెద్ద‌ది. ఆ రోజుల‌లో చ‌ర్చి చుట్టూ కాంపౌండు వాల్ ఉండేది.
ఆ కాంపౌండ్‌లో చ‌ర్చితో పాటు ప‌రిపాల‌నా భ‌వ‌నం, ఒక నివాస భ‌వ‌నం కూడా ఉండేవి. కాంపౌండ్ వాల్ బ‌దులు, ఇప్పుడు చాలా ఇళ్ళు, షాపులు వెలిశాయి.
చ‌ర్చి ఆవ‌ర‌ణ చాలా మ‌టుకు కుంచించుకు పోయింది.
రెండేళ్ళ క్రితం ఈ చ‌ర్చి ఒక‌టిన్న‌ర శ‌తాబ్ద‌పు ఉత్స‌వాలు జ‌రిగాయి.
వెస్ట్ చర్చి వ్యవస్థాపకుడు ఆగస్ట్ మిలియస్ ( 1818-1887)
జ‌ర్మ‌నీ నుంచి 1865 లో భార‌త దేశానికి వ‌చ్చిన ఆగ‌స్ట్ మిలియ‌స్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు ‘హెర్‌మ‌న్స్‌బ‌ర్గ్ తెలుగు మిష‌న్‌ ‘ ను స్థాపించాడు.
నాయుడు పేట‌లోనే చివ‌రి శ్వాస విడిచాడు.
చ‌ర్చికి ఎడ‌మ వైపు నుంచి వెళితే పెద్ద పెద్ద చింత‌ చెట్లు. అవి దాటాక క్రిస్టియ‌న్ హాస్ట‌ల్‌.
యూనివ‌ర్సిటీలో చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌స్తుత మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర స్పరం ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలుగా ఏర్ప‌డి న‌డిపిన విద్యార్థి రాజ‌కీయాల‌కు, ప‌ర‌స్ప‌ర దాడుల‌కు యూనివ‌ర్సిటీ హాస్ట‌ళ్ళ‌తోపాటు ఈ క్రిస్టియ‌న్ హాస్ట‌ల్ కూడా కేంద్రంగా, సాక్ష్యంగా ఉండేది.
క్రిస్టియ‌న్ హాస్ట‌ల్‌ను ఇటీవ‌లే ప‌డ‌గొట్టేశారు.
ఆ ఇద్ద‌రు నాయ‌కుల రాజ‌కీయ వైరాలు పెరిగి పెద్ద‌వై, ఇప్పుడు రాష్ట్ర‌స్థాయికి చేరాయి.
ఆక్రమణలో ఒక నాటి వంక
క్రిస్టియ‌న్ హాస్ట‌ల్ దాటాక చిన్న వంక పారేది. ఆ ప్రాంతాన్ని ‘వంక గ‌డ్డ ‘ అనేవారు.
ఇప్పుడు ఆ వంక ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై కుంచించుకు పోయింది.
ఒక ప‌క్క ఆ వంక మురుగు కాలువ‌లా ద‌ర్శ‌న మిస్తుంటే, మ‌రొక ప‌క్క పూర్తిగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైంది.
వంక‌ గ‌డ్డ దాటితే ఇళ్ళు లేవు. గొల్ల‌ప‌ల్లి అయ్య‌వారు ఇంటి వ‌ర‌కు అంతా ముళ్ళ కంప‌లే.
ముత్యాల‌రెడ్డి ప‌ల్లె స‌ర్కిల్ నుంచి తూర్పున ఇప్ప‌టి ఆర్డీవో ఆఫీసు, ఆకాశ‌వాణి ఉండే అన్న‌మ‌య్య స‌ర్కిల్ వేపు క‌నీసం న‌డ‌క‌దారి కూడా లేదు. అంతా మామిడి తోట‌లే.
నిజానికి ఈ పంచాయ‌తీచాలా పెద్ద‌ది.
తూర్పున రాయ‌ల చెరువు గేటు, ప‌డ‌మ‌ర‌న డైరీఫాం, ఉత్త‌రాన వెస్ట్ చ‌ర్చి ద‌గ్గ‌ర ఉన్న రైల్వే లైను, ద‌క్షిణాన ఇప్ప‌టి వైకుంఠ‌పురం.
ఇదంతా ముత్యాల‌రెడ్డ ప‌ల్లె (ఎంఆర్‌ప‌ల్లె) పంచాయ‌తీ.
ఈ పంచాయ‌తీని తిరుప‌తి మున్సిపాలిటీలో క‌లిపేయాల‌ని ద‌శాబ్దాలుగా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది.
మున్సిపాలిటీ లో విలీన‌మైతే ప‌న్నులు పెరుగుతాయ‌ని దాదాపు ముప్పై ఏళ్ళ క్రిత‌మే కొంద‌రు కోర్టులో కేసు వేశారు.
కోర్టు కేసుల వ‌ల్ల విలీనంలో కాలయాప‌న జ‌రిగింది.
ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల కొన్నేళ్ళ క్రితం తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఈ పంచాయ‌తీ విలీన‌మైపోయింది.
ముత్యాల‌రెడ్డి ప‌ల్లె పంచాయ‌తీగా ఉన్న రోజుల‌లో ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగేవి.
స్కూల్లో చేర‌డానికి బ‌ర్త్‌ స‌ర్టిఫికెట్ అడిగిందే త‌డ‌వు స‌ర్పంచ్ శంక‌ర రెడ్డి వెంట‌నే ఇచ్చేవాడు. అలాచాలా మందికి ఇప్పించాను.
దాదాపు పాతికేళ్ళ పైగా శంక‌ర‌రెడ్డి స‌ర్పంచ్‌గా చేశాడు. బ‌లంగా పొడ‌వుగా ఉండేవాడు. గాడా గుడ్డ‌తో కుట్టిన బ‌నీను వేసుకుని, పంచ క‌ట్టుకునే వాడు. తిరుప‌తిలోకి వెళితే త‌ప్ప చొక్కా తొడిగేవాడు కాదు.
కార్పొరేష‌న్‌లో విలీన‌మ‌య్యాక ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిన‌ట్టు ప‌న్నులు పెరిగాయి.
ఏ చిన్న స‌ర్టిఫికెట్ కావాల‌న్నా కార్పొరేష‌న్ చుట్టూ చ‌క్క‌ర్లు మొద‌ల‌య్యాయి.

 

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/tirupati-memoirs-tirupati-ghat-road-traffic-jam/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *