తెలంగా సెంటిమెంట్ ఎంత కాలం మోయాలి? ఉద్యోగాలెపుడొస్తాయ్?

(వడ్డేపల్లి మల్లేశము)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం, భావజాలం, సెంటిమెంట్ వాస్తవ పునాదుల మీద ఏర్పడినది అనటంలో సందేహం లేదు.

కానీఏర్పడి ఆరు సంవత్సరములు అయిన ఇప్పటికీ అదే సెంటిమెంట్ ను ఉపయోగించుకొని పాలనను అధికారపక్షాన్ని సమర్థించుకోవడం తోపాటు ప్రతిపక్షాలను లేకుండా చేయడం ఎన్నికల కోసమే తమ కాలాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేయడం సామాన్య ప్రజానీకం గమనిస్తున్నారని విషయాన్ని ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది.

గత రెండు దశాబ్దాల క్రితం  రాష్ట్రంలో వివిధ విద్యార్థి ప్రజా ఉద్యమాలు ఉద్యమ సంస్థల భావజాలం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది.

అప్పటికే ప్రజలలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బలంగా నాటుకుని ఉండింది. ఈ విషయాన్ని సందర్భోచితంగా తీసుకొని ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమతి రాజకీయ నాయకత్వాన్ని వహించింది.  సకల జనుల సమ్మె వంటి అనేక పోరాటాలు రూపాలలో ప్రజలూ వివిధ రూపాల్లో నిరసన తెలిపి సంపూర్ణ సహకారాన్ని అందించడం ద్వారా తెలంగాణ సాకారమైనది.

ఆకాంక్షలు లక్ష్యాలు

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు సరిగా రావడం లేదని, నిధుల మంజూరులో వెనుకబాటుతనం ఉందని, ఉద్యోగ నియామకాల్లో కూడా వివక్షత కొనసాగుతున్నదని ఇక ఇక్కడి ప్రాంత ప్రజలకు ఆత్మగౌరవం  లేదని బలమైన కారణాలను తెరాస ముందుకు తీసుకువచ్చింది.  ఈ ప్రాంత మౌలిక సమస్యలను పరిష్కరించి తెలంగాణకు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సమకూర్చడానికి శాయశక్తులా కృషి చేస్తామని ఆనాడు టిఆర్ఎస్ నాయకులు ప్రకటించడం జరిగింది.

2014లోనూ 2018 లోనూ రెండుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎవరూ కోరని అటువంటి హామీలను ప్రకటించడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడానికి స్పష్టంగా వాగ్దానం చేయడం జరిగింది.

ఇది ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరినది కాదు పైగా ప్రస్తుతము ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఒక వైపు భర్తీ చేయకపోగా ఉద్యోగ విరమణ వయస్సు ని పెంచడం ద్వారా కూడా అనేక మంది నిరుద్యోగులు పొట్ట కొట్టడమే అవుతుంది.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సమస్యల మీద నిరసన తెలపడానికి కూడా అవకాశం లేకుండా ఇందిరా చౌకు ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కింది.

హాల్ మీటింగులు పెట్టుకోవడానికి కూడా అనుమతి నిరాకరించి కోర్టు ద్వారా అనుమతి పొందితే తప్ప సభలు సమావేశాలకు సాధ్యం కానటువంటి గడ్డు పరిస్థితులను తీసుకువచ్చిన అటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది.

ఉమ్మడి రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని సొంత రాష్ట్రంలో అన్ని సజావుగా సాగి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటామని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు ను తుంగలో తొక్కి సమావేశాలు సభలు జరుపుకోవడానికి కోర్టుల ద్వారా అనుమతి పొందాల్సిన దుస్థితి రావడం ఇదే నా ఆత్మ గౌరవం.

మరొక వైపు ప్రతిపక్షం ద్వారా ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపు ప్రోత్సహించి అధికార పార్టీలో విలీనం చేసుకొని వారిని భ్రమలకు గురి చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడం కూడా తెలంగాణ సెంటిమెంట్ కాక మరేమవుతుంది.

ఇక శాసనసభలో శాసనమండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవడం సమగ్రమైన చర్చ జరిగి ప్రజల స్థితిగతులను మార్చడం కోసం ఆరాట పడే విధానం ఎక్కడా కనబడడం లేదు. మౌలిక మైనటువంటి పేదరిక నిర్మూలన , ఉద్యోగ కల్పనా, సమానత్వ సాధన, రాష్ట్రంలో భూ సంస్కరణలు, భూమిలేని వారికి భూమిని పంచడం, ఎక్కడ వేసినది అక్కడే ఉన్నవి.

ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీ మేరకు దళితున్ని ముఖ్యమంత్రి చేయడం ,దళితులకు వ్యవసాయ భూమిని ఉచితంగా ఇవ్వడం వంటి అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు.

ఉద్యమ కాలంలో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రకృతి విధ్వంసం గుట్టల విధ్వంసం పైన బహిరంగంగా ప్రశ్నించి గొంతెత్తి నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఆ వైపుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా తెలంగాణ సెంటిమెంట్ పైనే నేడు పాలన కొనసాగడం సామాన్య ప్రజానీకం అందులోని లొసుగులను గుర్తించక ప్రలోభాలకు గురి కావడం బాధాకరం.

రాజకీయ పార్టీలు ఏవైనా రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో మెజారిటీ భాగం ఉన్నత వర్గాల చేతిలో ఉండటం ఆ వర్గాలకు చెందినటువంటి నాయకులు క్రింది స్థాయి వరకు భూ దందాలకు అక్రమార్జనకు పాల్పడి భూముల విలువను గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యునికి భూమి అందుబాటులో లేకుండా పోయిన ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నారు తప్ప ఏనాడూ కూడా నివారించడానికి ధరలను నియంత్రించడానికి ప్రయత్నం చేయలేదు.

ఇటీవల కేంద్రప్రభుత్వం చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కేంద్రంతో సయోధ్య కొనసాగుతామని వైరుధ్యం అవసరం లేదని చట్టాల పైన మాట్లాడే వలసిన అవసరం లేదని కేంద్ర చట్టాలు యధావిధిగా అమలు అవుతాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించడం దేనికి సంకేతం?

ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని సమర్థించడానికి అధికార పక్ష సభ్యుల కు ఎక్కువ సమయాన్ని కేటాయించడం తో వారు ప్రశంసించడం తో నే సరిపోతుంది కానీ చర్చ జరగడం లేదు మరొకవైపు ప్రతిపక్ష సభ్యుల కు అధికారం అవకాశం ఇవ్వకపోవడంతో చట్టసభలు నామమాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది .ఇదంతా కేవలం రాష్ట్ర ఏర్పాటు అనే ఒక సుదూర లక్ష్యాలను ముందుంచుకుని చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ సెంటిమెంటుని వాడుకుంటే నిర్మాణాత్మక పాలన అందించడానికి ప్రజలకు అందడానికి మరెంత కాలం పడుతుంది?

Vaddepalli Mallesamu

(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్,  సిద్దిపేట జిల్లా, తెలంగాణ ఫోన్ నెం 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *