Home Features రాయలసీమను కృష్ణానదీ ప్రాంతంగా తెలంగాణ గుర్తించడమే లేదు

రాయలసీమను కృష్ణానదీ ప్రాంతంగా తెలంగాణ గుర్తించడమే లేదు

304
0
(V Sankaraiah)
గొంతెండి పోతున్న రాయలసీమ దాహార్తి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతి పక్షాలకు చెందిన నేతలు పలువురు గతంలోనూ ఇప్పుడూ పలు ప్రతిపాదనలు చేస్తున్నారు.కాని ఆచరణలో అన్నీ బెడిసి కొడుతున్నాయి.
ఏదో ఒక ప్రతి బంధకం ఎదురౌతోంది. ఎన్నికల అనంతరం ఇరువురు ముఖ్యమంత్రుల కౌగలింతలు చూచిన సీమ ప్రజలు మురిసి పోయారు. తీరా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ప్రకటించితే తెలంగాణ మోకాలడ్డింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా సంగమేశ్వరంనుండి ఎత్తిపోతలు కాకుండా ముచ్చు మర్రీ ఎత్తిపోతలనే మరింత విస్తరణకు పూనుకొని వుంటే అభ్యంతరాలు లేకుండా ఎంతో కొంత మేలు సీమకు ఒన కూడేది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. పైగా నికర జలాలు కేటాయింపులు వున్న గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం అనిశ్చితికి చేరుకొంది.
ఈ ఏడు సుంకేసుల నుండి 288 టియంసిల నీరు కృష్ణలో కలిసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టుగా ఎపి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తెలంగాణ భూభాగం మునక ప్రాంతంగా వుండే ఇక గుండ్రేవుల రిజర్వాయర్ భవిష్యత్తు గురించి ఏమని వ్యాఖ్యానించగలం!
ఇదిలా వుండగా తాజాగా సీమకు చెందిన పాత తరం నేతలు రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు మొత్తం 16 మంది మూడు రోజుల క్రితం చేసిన ప్రతిపాదన ముందుగా పరిశీలిద్దాం.
డాక్టర్ మైసూరారెడ్డి నాయకత్వంలో 16 మంది సీమకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తూ గోదావరి జలాలను కృష్ణ కు తరలించి ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణ జలాలను “గ్రేటర్ రాయలసీమ”కు కేటాయించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రిని కవలనున్నట్లు ప్రకటించారు.
ఇది కొత్త ప్రతిపాదన ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఈ ప్రతి పాదన ప్రచారంలోనికి వచ్చింది. పట్టిసీమ నుండి వచ్చే గోదావరి జలాలను కృష్ణ డెల్టాకు ఉపయోగించి డెల్టాకు కేటాయించిన నీటిని రాయలసీమకు ఇవ్వాలనే ప్రతిపాదన పలువురు చేశారు.ఒక మేరకు చంద్రబాబు నాయుడు అమలు చేశారు కూడా. ప్రస్తుతం డాక్టర్ మైసూరారెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు అప్పట్లో సీమ వాసులు కూడా జీవో ఇవ్వమని చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. అయితే న్యాయ పరంగా అది సాధ్యం కాని పని. ఇంతకీ ఇప్పుడు డాక్టర్ మైసూరారెడ్డి గ్రేటర్ రాయలసీమ అని ఎందుకు వాడారో అర్థం కాదు.
వాస్తవ మేమంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని సీమ వాసులతో పాటు తాజాగా డాక్టర్ మైసూరారెడ్డి ప్రభృతులు కోరుతున్నట్లు జీవో విడుదలకు అవకాశం లేదు.
ఎందుకంటే కృష్ణ నదీ జలాల వివాదానికి చెందిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ తీర్పు వచ్చి దాన్ని రెండు రాష్ట్రాలు ఆమోదించి కేంద్రం గెజిట్ నోటిఫై చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా నీటి కేటాయింపులకు చట్టబద్ధత కల్పించే అవకాశమే లేదు. అటు తెలంగాణకు ఇటు ఆంధ్ర ప్రదేశ్ కు ఇది వర్తించుతుంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు చెంది బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన జుట్టు తెలంగాణ చేతికి ఇచ్చినట్లవుతుంది. ఈ పాటికే తెలంగాణ మొత్తం కృష్ణ జలాలను తిరిగి పంపిణీ చేయాలని ట్రిబ్యునల్ ముందు కేసు దాఖల్ చేసి వుంది. . ఈ చిక్కుతోనే ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకు కృష్ణ నదీ యాజమాన్య బోర్డును నోటిఫై చేసేందుకు తెలంగాణ కూడా అంగీకరించ లేదు.తుది తీర్పు వచ్చి ఎవరి వాటా ఎంతో తేలిన తరువాత చూద్దామని తెలంగాణ మొండి కేసింది. ట్రిబ్యునల్ తుది తీర్పు రెండు రాష్ట్రాలకు ప్రాణపదం అదే సమయంలో మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే భావించాలి.
ప్రస్తుతం గ్రేటర్ రాయలసీమ నేతలు న్యాయ పరమైన ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కావచ్చు లేదా నిజంగానే సీమ దాహార్తి తీర్చేందుకు కావచ్చు చేసిన ప్రతిపాదనలో వున్న ఈ ప్రమాదం గమనించి నట్లు లేదు. ఒక సంవత్సరంలోనే దాదాపు 1600 కోట్లు వ్యయం చేసి పట్టిసీమ పథకం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు అవకాశం వుండి వుంటే సీమ వాసులను సంత్రుప్తి పర్చేందుకు ఓటు బ్యాంకు కోసమైనా జీవో ఇచ్చివుండే వారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలాంటి జీవో ఇవ్వ లేరు. ఇస్తే మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకే దెబ్బ తగులుతుంది. ముఖ్యమంత్రులు రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఆయా సమయాల్లో సాగునీటి రంగంలో తలలు పండిన ఇంజనీర్లు విధిగా సలహాలు ఇస్తుంటారు. కృష్ణ నది జలాల కేటాయింపులకు తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు కొత్త పుంతలు తొక్కింది. ఏ నదీ జలాల పంపకంలో నైనా ఏ రాష్ట్రమైనా “మా అవసరాలు ఇవి. ఆ మేరకు నీళ్లు కేటాయించండి” అని అగడం చూచాం. కాని 2014 లో రాష్ట్ర విభజన తదుపరి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించిన తొలి రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు దాఖలు చేసిన ప్రమాణ పత్రం పరిశీలించితే రాష్ట్రంలో అంతర్గతంగా నీటి కేటాయింపులకు చట్ట బద్దత కల్పించితే వచ్చే పెను ముప్పు అవగతం కాగలదు.
“పట్టిసీమ నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పోలవరం నుండి తరలిస్తారు. ఇవి రెండూ వేర్వేరు కదా? పైగా సిఆర్డీఏ పరిధిలో సాగువుండదు. ఆంధ్ర ప్రదేశ్ కు 515 టియంసిలు అక్కర లేదు. అందువలన ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన 515 టియంసిలలో 357 టియంసిలు కోత విధించి 155 టియంసిల కేటాయించితే చాలని” తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ దాఖలు చేసి వుంది.
ఈ సందర్భంలో జరిగిన విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాక్షులు కెవి సుబ్బారావు , విశ్వేశ్వరరావు లను తెలంగాణ తరపున లాయర్ వైద్య నాథన్ చేసిన క్రాస్ ఎగ్జామినేశన్ మినిట్స్ పరిశీలించితే ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకు మనం అనధికారికంగా నీటి కేటాయింపులు చేసుకోవాలే గాని చట్ట బద్దత కావాలని కోరడమంటే రాయలసీమతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసినట్లే.
తొలి నుండి తెలంగాణ చేస్తున్న మరో ప్రమాదకరమైన వాదన ఏమంటే రాయలసీమను కృష్ణ పరీవాహక ప్రాంతంగా గుర్తించక పోవడమే. ట్రిబ్యునల్ ముందు ఆంధ్ర ప్రదేశ్ 13 విచారణాంశాలను చేర్పించితే తెలంగాణ 17 విచారణాంశాలను చేర్పించింది. తెలంగాణ పొందు పర్చిన అంశాల్లో సీమకు చెందినవి  రెండూ  ప్రమాదకరమైనవే.
1)ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో కెసి కెనాల్ కు వున్న కేటాయింపులను సమీక్షించి బేసిన్ లోని ప్రాజెక్టులకు తిరిగి పంపిణీ చేయడం. అంటే కెసి కెనాల్ కు తుంగభద్ర నుండి నీటి కేటాయింపులు వుండి మనం వాడుకోకుండా శ్రీ శైలంలో కలుస్తున్న నీరు పంపణి చేయాలని కోరడమే.
2) పక్క బేసిన్ లోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న కెసి కెనాల్ శ్రీశైలం కుడి కాలువ సాగర్ కుడి కాలువ తుంగభద్ర ఎగువ కాలువ కింద పంటల విధానంలో మార్పు చేసి ఆదా అయ్యే నీటిని బేసిన్ లోని ఇతర ప్రాజెక్టులకు కేటాయించడం
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యగైకొన్నా రేపు ట్రిబ్యునల్ ముందు ఎదురు దెబ్బలు లేకుండా చూచుకోవలసి వుంది.
ఈ రోజు డాక్టర్ మైసూరారెడ్డి ప్రభృతులు సూచన చేసినట్లు . చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రాజకీయ పార్టీకి చెందని పలువురు రైతు సంఘాల నేతలు అదీ కోస్తాకు చెందిన పలువురు అప్పట్లోనే ఈ సూచన చేశారు.
ఇదేమీ కొత్తది కాదు. పట్టిసీమ నుండి వచ్చే 80 టియంసిలకు తోడు సాగర్ నుండి కృష్ణ బ్యారేజీ వరకు లభ్యమయ్యే నీరు ఎంతైనా కావచ్చు కృష్ణ డెల్టాకు ఉపయోగించి ఆ మేరకు లభ్యమయ్యే నీటిని రాయలసీమకు సరఫరా చేయ వచ్చని ఇది వరలోనే చెప్పారు.
అయితే ఈ ఏర్పాటు అనధికారికంగా జరగాలనే గాని డాక్టర్ మైసూరారెడ్డి ప్రభృతులు లేదా సీమ పరిరక్షణ ఉద్యమ కారులు కోరుతున్నట్లు చట్టబద్ధత కల్పించే అవకాశం లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ న్యాయ పరమైన చిక్కుతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు జీవో జారీ చేయలేక పోయారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సాహసం చేయలేరు. ఈ దేశ పౌరులుగా అమలులో వున్న చట్టాలను నిబంధనలు కష్టమైనా నష్ట మైనా మనం పాటించ వలసినదే. అందుకే తరతరాలుగా రాయలసీమ దురదృష్టం బారిన పడి అంగ లార్చుతోంది.
శ్రీ శైలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మింపబడకుండా సిద్దేశ్వరం వద్ద బహులార్థసాధక ప్రాజెక్టుగా నిర్మాణం జరిగి ఉంటే బచావత్ కమిషన్ సీమకు నీటి కేటాయింపులు చేసేది. ఈ వెంపర్లాట తప్పేది. మరో దురదృష్టం ఏమంటే ఈ ఏడు కృష్ణ బ్యారేజీ నుండి 800 టియంసిల సముద్రం పాలైనవి. అయితే ఈ రోజు శ్రీ శైలం జలాశయంలో 35 టియంసిల నీరు వున్నదని వాడుకొనేందుకు కేవలం ఏడు టియంసిలు మాత్రమే వుంటాయని చెబుతున్నారు. జనవరి10 న 151 టియంసిల నీరు వుంటే మార్చి 17 కల్లా 55 టియంసిలకు చేరాయి. ఎందుకిలా జరిగింది? వరద పోటెట్టిన ఏడు ఇలా వుంటే లీన్ సంవత్సరాల్లో సీమ పరిస్థితి ఏమిటి?
ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్భోచితంగా వ్యవహరించ వలసి వుంది. అంతర్ రాష్ట్ర వివాదాలతో కాలం గడప కుండా తాత్కాలికంగా సీమకు సాగునీటి ఏర్పాట్లు వేపు దృష్టి సారించ వలసి వుంది. చంద్రబాబు నాయుడు అధికారంలో వున్నా లేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేక మరొకరు అధికార పీఠం అధిష్టించి వున్నా సీమకు సాగు నీరు అందించాలంటే రెండే మార్గాలు. ఒకటి తెలంగాణతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో కలసి ముందుకు సాగడం. రెండు. అంతర్ రాష్ట్ర వివాదాల జోలికీ పోకుండా వున్నంతలో సాగునీటి వసతి కల్పించడం. తొలి ఆఫ్శన్ చేజారి పోయింది. ఇక దాన్ని గురించి శల్య పరీక్ష అనవసరం. తెలంగాణ అభ్యంతరాల కన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే కఠినతరమైనది. అవి పక్కన బెడతాం.ఈ రెండు మార్గాలు కాకుండా బస్తీమే సవాల్ అని ముందుకు పోతే గతంలో సీమకు అన్యాయం జరిగినట్లే చరిత్ర చర్విత చరణం అవుతుంది.
ఈ నీటి సంవత్సరం ముంచుకొస్తోంది. అయినా కృష్ణకు వరద రావాలంటే ఇంకా ఒకటిన్నర మాసం పైన బట్ట వచ్చు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ముచ్చు మర్రీ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయడం గాని విస్తరణ గాని చేస్తే కొంత మేరకైనా సీమకు నీళ్లు ఇవ్వవచ్చు. అటు హంద్రీనీవా కు ఇటు కెసి కెనాల్ కు వెను వెంటనే నీళ్లు ఇవ్వ వచ్చు. ఈ తగాదాలు తేలే లోపు ముచ్చు మర్రీ నుండి బనకచర్లకు 25 కిలోమీటర్ల కాలువ పూర్తి చేస్తే మన వాటా నీళ్లను శ్రీ శైలం జలాశయంలో 798 అడుగుల నీటి మట్టంలో వున్నా తరలించుకోవచ్చు.
పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం సంగమేశ్వరంనుండి ఎత్తిపోతలపై మనకున్న హక్కుల కోసం కాలయాపనతో అసలుకే ప్రమాదం తెచ్చుకోవడం సముచితం కాదు.
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
(ఇది మొదట విశాలాంధ్ర దిన పత్రిక లోె అచ్చయింది)