ఆంధ్రలో ఇక విధిగా పెయిడ్ క్వారంటైన్

అమరావతి,26మే: విదేశాల నుండి అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి విమానాలు, రైళ్ళు,బస్సులు మరే ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న వారిని స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ కు ఆలాగే ఇనిస్టిట్యూటషనల్ క్వారంటైన్లలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లుతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రజల్లో పూర్తి అవగాహన కలిగించేందుకు ఐఇసి యాక్టివిటీని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
హోం క్వారంటైన్ కు సంబంధించి కోవిడ్ ఆర్డర్ సంఖ్య 51,52 లను విధిగా పాటించాలని చెప్పారు. మధ్య ప్రాశ్చ్య దేశాల నుండి వచ్చిన సింప్టమాటిక్, అసింప్టమాటిక్ వారందరినీ విధిగా 14రోజులు క్వారంటైన్ కు పంపాలని స్పష్టం చేశారు.
ఎంత మందిని క్వారంటైన్ లో ఉంచింది ఎంతమందికి పాజిటివ్ ఉంది వివరాలను పంపాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా హోం క్వారంటైన్ లో ఉన్న వారిని క్షేత్ర స్థాయిలోని ప్రైమరీ హెల్తు టీంలు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు,ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఇంకా వీడియో సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి పలు అంశాలపై ఆమె కలెక్టర్లతో చర్చించారు.
విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొనగా ఇంకా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్,సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.