Home Features తన జనాన్ని వెదుక్కుంటూ అడవి బాట పట్టిన ఎమ్మెల్యే

తన జనాన్ని వెదుక్కుంటూ అడవి బాట పట్టిన ఎమ్మెల్యే

267
0
Picture credits Kranthi

(జిఎస్ సంపత్ కుమార్)

సీతక్క అనే మూడక్షరాలు తెలంగాణలో  ప్రత్యేకం. ఎన్నికల రాజకీయాల్లోకి రాకముందు, ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చాక, ఈ మూడక్షరాల వన్నె తగ్గలేదు. ఆకర్షణ పోలేదు.కారణం అపుడు ఇపుడూ జనమే ఈ మూడక్షరాల భాష, శ్వాస.
అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచాక రాజధానికే పరిమితమయ్యే కల్చర్ కు ఈ మూడక్షరాలు చాాలా దూరం. ఎన్నికల్లో గెలిచాక, ప్రజలతో చాలా సోషల్ డిస్టెన్స్ పాటించడం ఈ నాటి రాజకీయాల లక్షణం. అయితే, కొంతమంది ఎమ్మెల్యేలు ఎలాంటి బేషజం లేకుండా జనం మధ్య ఉండేందుకే ఇష్టపడతారు. కష్టపడతారు. జనంతోనే ఉంటారు. వాళ్లకోసమేపనిచేస్తుంటారు.
శాసన సభ సమావేశాల్లో తప్ప మిగతా సమయమంతా వాళ్లు క్యాపిటల్ సిటిని వదిలేసి జనాన్ని వెదుక్కుంటుూ వెళ్తుంటారు. ఈ దారిలో పయనించే ఒక మహిళా నేత పేరే ఈ మూడక్షరాలు. అందుకే సీతక్క గురించి ప్రత్యేకంగాచెప్పుకోవలసి వస్తుంటుంది. ఇపుడు కరోనా కట్టడిలో తనకు వోటేసి గెలిపించిన ప్రజలను ఆదుకునేందుకు ఆమె పడరాని పాట్లు పడుతున్నారు. సీతక్క కరోనాకాలపు కథ ఇది.
ఇంతకీ ఎవరీ సీతక్క
ప్రజలు కష్టాల్లో వుంటే వెంటనే అక్కడ వుండాలనేది తన స్వభావం. ఒకప్పుడు ప్రజల్లో అక్కగా.. అండగా నిలబడి పోరాటాల్లో పాల్గొన్నడమే కాదు.. ఏకంగా ప్రజలకోసం సమసమాజ నిర్మాణంకోసం తుపాకీ పట్టి పోరాడిన గతం సీతక్కది.
ప్రజలు ఎదుర్కొంటున్న బాదలు, గాధలు తెలిసిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఎలావుంటుందో సమాజానికి మంచి సందేశమిస్తున్న ఆ అక్క ఎవరో కాదు ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ దన్సారి అనసూయ. తాను గిరిజనురాలైనా అదే గిరిజన ప్రాంత ప్రజల తలలో నాలుకగా మెలుగుతున్నది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో వైరస్ అంటే ఏమీ తెలియని గిరిజన ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ గిరిజనులను చైతన్యవంతులను చేస్తున్నది.
తన నియోజక వర్గం మొత్తం అటవీ ప్రాంతమే.. ఒక్కొ గ్రామానికి వెళ్ళాలంటే కిలో మీటర్ల కొద్ది నడవాల్సిందే. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటి వెళ్ళాల్సిందే. కనీసం నడక బాటకూడా లేని పరిస్థితి. అలాంటి ప్రదేశాలకు ప్రస్తుత మన ఎమ్మెల్యేలు వెళ్ళగలరా అంటే వెళ్ళలేని పరిస్థితి. కాని సీతక్క మాత్రం నిత్యం ఆప్రాంతాలన్ని పర్యటిస్తూ.. అక్కడి ప్రజలకు తనకు చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఎంతైనా సీతక్క నీకు హాట్సాప్ చెప్పాల్సిందే.. నిజమైన ప్రజా ప్రతినిధి ఎలావుండాలో సమాజానికి చూపిస్తున్నారు.
ఎన్నికల బాట పట్టాక ఆమె రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొదటి సారి 2009-2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారిరెండో సారి తెలంగాణవచ్చాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే(కాంగ్రెస్) ధనసరి అనసూయ @సీతక్క తన ఉదారస్వభావాన్ని చాటుకుంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో కుగ్రామాలకు నిత్యావసర వస్తువుల కొరత తారా స్థాయిలో ఏర్పడుతోంది. అందులో ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, తండాలు, మారుమూల కుగ్రామాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం వాహనాలు వెళ్లేందుకు రోడ్ల సౌకర్యం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. కేవలం ఎడ్ల బండ్ల ద్వారానే ఆ గ్రామాల్లోకి ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది.

లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అలాంటి గ్రామాల నిరుపేద ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క పరితపిస్తున్నట్టు తెలుస్తోంది. కాలినడకన, ఎండ్ల బండి మీద నిత్యవసర సరుకులు అందజేస్తూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు ఎమ్మెల్యే సీతక్క. కరోన వైరస్ మహమ్మారిని తరిమికొట్టే నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో కుగ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణ సౌకర్యం లేని గ్రామాల్లో పేద ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సందర్బాలు వెలుగు చూస్తున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సీతక్క వాళ్లని ఆదుకునేందుకు అడవి బాట పట్టారు.అడవుల్లో సుదూర గిరిజన గూడేలకు రకరకాల మార్గాలలో చేరి వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.సాధారణ రోజుల్లోనే నిత్యావసర వస్తులు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రాాంతాలివి. ఇపుడు లాక్ డౌన్ వల్ల ఇక్కడి ప్రజలు తిండికోసం చాలా  కష్టాలుపడుతున్నారు. వీళ్లని ఆదుకునేందుకు ఆమె పూనుకున్నారు.
” ప్రభుత్వం రేషన్ కార్డున్నవా ళ్లందరికి 12 కెజిల బియ్యం అందిస్తూ ఉంది.అయితే,  చాలా మంది గిరిజనులకురేషన్ కార్డులు లేవు. అందువల్లవారంతా లబ్దిదారుల జాబితా కెక్కలేదు.వీళ్లంత ఇపుడు లాక్ డౌన్ వల్ల ఉపాధిలేక, తిండిగింజలు లేక పస్తులుండే పరిస్థితి వచ్చింది. అందువల్ల నేను స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది,” అని ఆమె న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెప్పారు.
తన నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.మైళ్లకు మైళ్ల కాలినడక వెళుతున్నారు. బండి మీద వెళుతున్నారు. దూరానికి,ప్రయాణ భారానికి ఆమె వెనకాడటం లేదు.  కుగ్రామాల్లోని నిరుపేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకొన్న సీతక్క ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ములుగు నియోజకవర్గం అంటే…
ములుగు  ఆదివాసీ నియోజకవర్గం. అక్కడ కోయ, గోండు, మరియు లంబాడీ లాంటి ఆదివాసీ జాతులు ఎక్కువగా నివసిస్తుంటారు. అడవి ప్రాంతం కాబట్టి కొన్ని చోట్లకి కనీసం రోడ్లు కూడా ఉండకపోవడంతో రవాణా సౌకర్యం ఉండదు. అలాంటి ప్రాంతాలకు నిత్యావసర సరుకులు చేరవేస్తూ ప్రతి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు సీతక్క. అలాంటి ప్రాంతాలకు చేరురకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే. వీలైన చోట ట్రాక్టర్ ప్రయాణం, అక్కడ నుండి ఎడ్ల బండి, అక్కడ నుండి కాలినడక, అవసరం అనుకుంటే బురదలో కూడా నడక కొనసాగిస్తున్నారు సీతక్క. అడవి మార్గం గుండా కుగ్రామాలకు చేరుకోవడంలో తన వ్యక్తిగత సిబ్బంది మరియు గన్ మెన్ లను సైతం వదిలేసి అక్కడి స్థానిక నాయకుల సహాయంతో ఆదివాసీ గ్రామాల్లోని ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందించి వారి ఆకలిని తీర్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు సీతక్క. తాను కూడా వారితో పాటే భోజనం చేస్తూ తన నిరాడంబరతను చాటుకుంటున్నారు.
ప్రతిరోజు ఆమె ఉదయం 9 గంటలకు బియ్యం,ఉప్పు , పప్పు, సబ్బులు, మాస్కులు, ఇతర నిత్యవసర సరుకులు తీసుకుని ములుగునుంచి బయలుదేరి, వాటిని సుదూర గిరిజన గూడేలోల పంచి రాత్రి పదిన్నరకెపుడో వస్తారు. మళ్లీ మరుసటిి రోజు ఇదే కార్యక్రమం మొదలవుతుంది.
ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉంటే ఎంత కష్టం, నష్టం సంభవించనా వెనకడుగు వేసేది ఉండదని సీతక్క నిరూపిస్తున్నారు. సీతక్క పట్టుదలకు, పేదల సమస్యల పరిష్కారానికి చూపిస్తు చొరవ వందకు వంద శాతం ఆదర్శప్రాయంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎమ్మెల్యే అనగానే చాలా విలాసవంతమైన జీవనం, మెరుగైన నివాస సదుపాయాలు, అన్ని సౌకర్యాలతో కూడుకున్న వాహనం, మంది,మార్బలం.. ఇది ప్రస్తుత ప్రజా ప్రతినిధుల జీవన శైలి. ప్రజా జీవితంతో పెద్దగా సంబందాలు అవసరంలేని పరిస్థితులు ఉన్న తరుణంలో ఇళ్లకే పరిమితమవుతున్నారు కొంత మంది ప్రజా ప్రతినిధులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో అందరు ప్రజా ప్రతినిధుల్లా కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు సీతక్క. ఎమ్మెల్యే సీతక్క ఔదార్యం తోటి ప్రజా ప్రతినిధులకు ఎంతో స్పూర్తి దాయకంగా ఉందనే చర్చ జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లోని నిరుపేదల సంక్షేమం కోసం సీతక్క చూపిస్తున్న అంకితభావానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్దానిక ప్రజానీకం.
అడవిలోఅక్క.. ఆదివాసీల అమ్మ..!
ఆపదకాలంలో అడవిబిడ్డల పాలిట ఆమె ఆశాదీపమైంది. ఆదివాసీల ఆకలి తీర్చేందుకు నిత్యం కొండాకోనల్లో పర్యటిస్తోంది. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా… ఆపన్నులకు అమ్మగా…. విపత్కర పరిస్థితుల్లో తన ప్రజల కోసం పరితపిస్తోంది ములుగు ఎమ్మెల్యే సీతక్క. గన్‌‌తో ఉన్నా…. గన్‌మెన్‌తో ఉన్నా….. అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీతక్క పేదల ఆకలి తీర్చేందుకు ‘గో హంగర్‌ గో’ పేరుతో ఛాలెంజ్‌ విసిరారు.
ఆపదలో ఆదుకుంటున్న సీతమ్మ..
కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ…. ఎంతో మందికి పూటగడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డల ఆశాదీపంగా…. వారి ఆకలితీర్చేందుకు నిరంతరం పరితపిస్తోంది…. ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క.
లాక్‌డౌన్‌ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి…. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా…. కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ…. నిత్యావసర సరకులను అందిస్తున్నారు. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడాల్లో పర్యటిస్తూ… ప్రజల్లో భరోసా నింపుతున్నారు.
320 గ్రామాల్లో పర్యటన
ములుగు నియోజకవర్గంలో 7వందలకు పైగా పల్లెలుండగా…. ఇప్పటి వరకు 320 గ్రామాల్లో పర్యటించిన…. సీతక్క అందరికీ నిత్యావసరాలు అందజేశారు. ఆదివాసీలకు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పుదినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా పంపిణీచేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి, ప్రజలకు అందిస్తున్నారు.
కరోనా పట్ల అవగాహన తక్కువగా ఉండే గిరిజనగూడాల్లో…. వైరస్‌ వ్యాప్తిపై తెలియజేస్తూ…. మాస్కులు పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు పౌష్ఠికాహారం, అప్రమత్త చర్యలను తెలియజేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో… ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజనగ్రామాల పర్యటనలో చెలిమల్లో దప్పిక తీర్చుకుంటూ…. అడవుల్లోనే సేదతీరుతున్నారు.

 

(*సంపత్ కుమార్ , సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)