ఆంధ్ర ప్రభుత్వం సర్వే: ఇంగ్లీష్ మీడియానికే 96 శాతం ప్రజల మొగ్గు

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ స్పష్టంచేశారు.
విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా నాడు – నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయ స్థాయిలో అభివృద్ధిచేయడానికి కార్యక్రమాలు ప్రారంభించింది.
ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడి ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాఠశాలల్లో ఇంగ్లీషు మా«ధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
గత ఏడాది నవంబర్ 20న  రాష్ట్ర  ప్రభుత్వం   పాఠశాలన్నింటా ఇంగ్లీష్ మీడియం ను తప్పని చేస్తూ  జివొ ఎం ఎస్ 85 ను విడుదల చేసింది. ఈ జివొ ప్రకారం 2020-2021 విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు  అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంనుప్రవేశపెట్టాలి. క్రమంగా ఇంగ్లీష్ మీడియాన్ని ఇతర తరగతులకు విస్తరించాలి. అయితే, ఈ జివొను సుధేష్ రాంభోట్ల,  గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో సవాల్ చేశారు.ఇది 2009 లో కేంద్రం తీసుకువచ్చిన ఉచిత నిర్బంధ విద్య చట్టానికి వ్యతిరేకమని, అదే విధంగా  రాజ్యాంగోంని 14, 21, 21-ఎ లలోని ఐచ్ఛిక స్వాతంత్ర్యాన్ని హరిస్తుందనిసవాల్ చేశారు. ఈ వాదన తో ఏకీభవిస్తూ కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
 హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు.
1. ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
2. తెలుగు మీడియం
3. ఇతర భాషా మీడియం
ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు.
ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.
అభిప్రాయ సేకరణ వివరాలు జిల్లాల వారీగా: 

 

గమనిక : తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలని 96.17శాతం పేరెంట్స్‌ ప్రభుత్వం తరఫున వాలంటీర్లు చేసిన అభిప్రాయ సేకరణలో చెప్పినట్లు ఈ ప్రకటన విడుదల చేశారు.