కొరడా “పిడి” నుండి “కొస” వరకూ సాగించిన ఆయన సుదీర్ఘ ప్రయాణం-ఓ కొత్త గుణపాఠాల ప్రయోగశాల.
-ఇఫ్టూ ప్రసాద్ ( పిపి )
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు నేడు వార్తలకెక్కారు. తొలుత పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారిగా, ఆ పిమ్మట సాంఘిక సంక్షేమ శాఖలోనూ ఉన్నతాధికారిగా ఆయన సాగించిన సుదీర్ఘ ప్రస్థానం ప్రత్యేకంగా పరిశీలన, విశ్లేషణ చేయాల్సిన అంశం. ఆయన చేసిన ప్రయాణం వర్తమాన సమాజానికి కొన్ని సందేశాల్ని ఇస్తోంది. భవిషత్తుకు కొన్ని హెచ్చరికల్ని కూడా చేస్తోంది.
పోలీస్ అధికారిగా రాజ్య ఎదురు కాల్పులతో ఆయన ఆనాడు వార్తలకెక్కారు. ఉత్తర తెలంగాణలో యువ పోలీస్ ఉన్నతాధికారిగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాజ్య వ్యవస్థ చేపట్టిన బూటకపు ఎదురు కాల్పుల ప్రక్రియకి ఆయన విశ్వసనీయ ప్రతినిధిగా పేరొందారు. ఆనాడు విప్లవోద్యమం ఆయన మీద నిప్పులు చేరిగింది. తన రాజకీయ దారిలో ఆయన్ని ఓ ఆగర్బ శత్రువుగా కూడా నాడు విప్లవోద్యమం పరిగణించింది. అదో సుదూర గతం. అది దాదాపు పాతికేళ్ల క్రితం మాట.
అదే ప్రవీణ్ కుమార్ గారు నేడు ఒక సామాజిక, సాంఘిక సంస్కర్తగా పేరొందారు. ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేష కృషి సాగిస్తోన్న అధికారిగా ఆదరణ పొందారు. అట్టడుగు సమాజ పొరలలో పుట్టి పెరిగిన పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్ది, ఆత్మ విశ్వాసం కలిగించి అత్యున్నత ఎవరెస్టు శిఖరం ఎక్కించిన రోజు ప్రవీణ్ కుమార్ విశిష్టత లోకం గుర్తించింది. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఇంకా ఎన్నో ఎన్నెన్నో రకాల విశిష్ట ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన పాత్రధారిగా ఆయన బహుళ ప్రజాదరణ పొందారు. తాను గురుకులాల నిర్వాహణా విధి చేపట్టిన తర్వాత ఆచరణలో ఈ పురోగతిని నిరూపించిన ఘనత ఆయనకు దక్కుతుంది. సాంఘిక వివక్షతలు, సామాజిక పీడన, అణచివేతలపై ఆయన రాజ్యాంగ బద్దంగా కృషిచేసే ఓ కృషీవలునిగా కూడా గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వార్తలలోకి ఎక్కారు. అదేమిటో చూద్దాం.
ప్రవీణ్ కుమార్ తాజాగా వార్తలకెక్కడం యాదృచ్చిక సంఘటన కాదు. సమాజ గమనంలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య విధిగా జరిగే భావ సంఘర్షణ అనివార్యంగా ఒక నిర్దిష్ట స్థలం &తలాలలో భౌతిక ఘర్షణ రూపం తీసుకోవడం సమాజ సహజ నియమమే. అప్పుడది అంతర్గత రూపం నుండి బహిరంగ రూపం తీసుకోవడమూ సహజమే. ప్రవీణ్ కుమార్ వార్తలకెక్కిన తాజా పరిణామం కూడా అందులో భాగమే. అదిపరస్పర విరుద్ధ సామాజిక శక్తుల మధ్య సంఘర్షణ ఫలితమే. ఇదెంత మాత్రం యాదృచ్చిక సంఘటన కాదు. దీనికి ముందు నుండి కొనసాగే సాంఘిక పరివర్తనా క్రమంలో మాత్రమే దీన్నొక విడి సంఘటనగా చూడాలి. అంతే తప్ప, మొత్తంగా విడిసంఘటన కాజాలదు. ఈ సామాజిక పరివర్తనా క్రమాన్ని ఆమోదించ లేని తిరోగమన రాజకీయ, సాంఘిక శక్తుల ప్రతిచర్యల (Reactions) ఫలితమిది. ఇది కేవలం ప్రవీణ్ కుమార్ వైపు నుండి చూడాల్సిన సంఘటన కాదు. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య భావ సంఘర్షణ క్రమం లేకుండా, ఇలా వార్తల కెక్కిన తాజా వివాద సంఘటన చోటు చేసుకోవడం జరగదు. ఈనిర్దిష్ట అవగాహనా వెలుగులో ఇదో పరిశీలించాల్సిన అంశం.
నేడు రాజ్యాంగానికీ, రాజ్యానికీ మధ్య వైరుధ్యం క్రమక్రమంగా పెరుగుతోంది. ఐతే అనేక తలాలలో అది అంతర్గతంగా సాగుతోంది. కొన్నిసార్లు అది బహిర్గత మవుతుంది. అలా బహిర్గత వ్యక్తీకరణ రూపమే నేడు బయటపడ్డ వివాధం. అదే దీనికి మూలం కూడా!
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు ఓ అధికారిగా రాజ్యాంగం ద్వారా చేకూరిన అవకాశాలకి లోబడి ప్రవీణ్ కుమార్ కృషి సాగుతోంది. ఆ మేరకు చట్టపరిధిలో గురుకుల విద్యాసంస్థల విద్యార్థిలోకపు వైజ్ఞానిక, సామాజిక పురోగతికై ఆయన వైపు నుండి అంకిత భావంతో కృషి సాగుతోంది. అది సాంకేతికంగా విద్యా, విజ్ఞానాలకే పరిమితం కాదు. నేటి సామాజిక భౌతిక పరిస్థితి లో సాంఘిక సంస్కరణాత్మక రూపం కూడా తీసుకోవడం సహజమే. అనివార్యంగా కుల, మత రూపాల్లో కూడా ఒక పురోగమనశీల అవగాహన, నిబద్ధతలకు విధిగా దారితీసే అవకాశం ఉంది. అది కూడా యాదృచ్చిక పరిణామం కాదు.
ఆయా రంగాల్లో గురుకుల విద్యార్థుల పురోగతికై చేపట్టే ప్రవీణ్ కుమార్ కృషి అక్కడికే పరిమితం కాదు. సహజంగా అది నేడు ఉనికిలో ఉన్న పలు ఆధిపత్యాలకి ప్రాతినిధ్యం వహించే రాజకీయ, సాంఘిక, ఆర్ధిక ఆధిపత్య, పెత్తందారీ వర్గాల ప్రయోజనాలతో కూడా ఘర్షిస్తుంది. అదే ఆచరణలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ! అది తొలుత భావ సంఘర్షణగా ప్రారంభమౌతుంది అనివార్యంగా భౌతికంగా కూడా ఘర్షిస్తుంది. ఇది క్రమంగా ఇతర రూపాలకు విస్తరిస్తుంది. పలు ఆధిపత్యాలకి ప్రాతినిధ్యం వహిస్తోన్న నేటి వ్యవస్థీకృత రాజకీయ ఆధిపత్య శక్తులకు అది ప్రత్యేక కడుపుమంటను కలిగించడం సహజమే. ప్రవీణ్ కుమార్ పై బండి సంజయ్ విద్వేషాపూరిత రాజకీయ దాడికి మూల కారణమదే!
రాజ్యానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అది ఒక చేతితో ప్రజల్ని అణచి వేస్తోంది. మరో చేతితో అది సంక్షేమ చర్యల్ని కూడా చేపడుతోంది. అన్నార్తులకు ఓవైపు తూటాలు వడ్డిస్తుంది. మరో వైపు అన్నం ముద్దలను కూడా అందిస్తోంది. మొదటి తలంలో ఉంటూ, రాజ్య కర్తవ్య పాలనలో ఓ ఉన్నత పోలీసు అధికారిగా తొలినాటి ప్రవీణ్ కుమార్ రాజ్యం చే మన్ననల్ని అందుకున్నారు. రెండో తలంలో ఉంటూ రాజ్యాంగబద్ద కర్తవ్య పాలనలో అదే ప్రవీణ్ కుమార్ నేడు సంక్షేమ శాఖాధికారిగా కూడా ప్రజాదరణ పొందారు. తొలుత పోలీసు ఉన్నతాధికారి గా రాజ్యంచేత బెస్ట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. తర్వాత సంక్షేమ శాఖ ఉన్నతాధికారిగా కూడా ఓ బెస్ట్ ఆఫీసర్ గానే గుర్తింపు పొందారు. నాడు మొదటి తలం (space) లో రాజ్య నిర్బంధానికి ప్రాతినిధ్యం వహించడంలో పేరొందారు. నేడు రెండో తలంలో రాజ్య సంక్షేమ విధానానికి ప్రాతినిధ్యం వహించడంలోనూ పేరొందారు. అదీ రాజ్య విభాగమే. ఇదీ ఓ రాజ్య విభాగమే. నాడూ, నేడూ తాను రాజ్య సేవకులే. తన భావన కూడా తాను చిత్తశుద్ధి గల రాజ్య సేవకునిగా పని చేస్తున్నాననేది కావచ్చునేమో! ఆయన మనస్సులో భావన ఏమిటో మనం చెప్పేది కాదు. అది అప్రస్తుతం. కానీ పై రెండు విధులను సమానం చేయడం సరైనది కాదు. తన మానసిక భావన ఏదైనా, మనస్సులో మాట ఏమైనా తన ఆచరణలో ఫలితం ఏమిటనేదే ముఖ్యం.
పైన పేర్కొన్న రాజ్యం యొక్క రెండు మొఖాలు ఒకటి కావు. ఆరెండింటి మధ్యకూడా ముఖ్య మార్పు ఉంది. రాజ్యానికి గల రెండు మొఖాలలోని ఒకటైన సంక్షేమ విభాగాన్ని భక్షించి, సంక్షేమ రహితమైన రెండో విభాగాన్ని మాత్రమే మిగిల్చే ప్రక్రియ నేడు సాగుతోంది. దీనినే పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో పూర్తి ఫాసిస్టు రాజ్య వ్యవస్థ సుస్థిరపడే పరివార్తనా ప్రక్రియ అంటారు. అందులో భాగంగా రాజ్యంలోని లోపలి మొఖం ఒక పధకం ప్రకారం నేడు దాని బయటి మొఖాన్ని భక్షించే పనిలో ఉంది. ఈ వెలుగులో ప్రవీణ్ కుమార్ తాజా పాత్రని లోతుగా పరిశీలించాల్సి వుంది.
ఏ అట్టడుగు సామాజిక వర్గం నుండి ఉన్నత విద్య గడించి ప్రవీణ్ కుమార్ పైకి వచ్చారో, అట్టి తన అట్టడుగు సామాజిక వర్గాల పిల్లల భావి సంక్షేమం పట్ల ఆయనలో ఓ నిబద్ధత, అంకిత భావాల్ని పై నిర్దిష్ట చలన క్రమం ఏర్పరిచి ఉండొచ్చు. అందుకై కృషి చేస్తోన్న క్రమంలో ఆయన సామాజిక ఆలోచనలలో కూడా మార్పును తెచ్చిఉండొచ్చు. ఇది కూడా ఓ నిర్దిష్ట చలనక్రమంలో అంతర్భాగమే. నేడు ఉనికిలో ఉన్న సామాజిక, రాజకీయ ఆధిపత్యాలకి వ్యతిరేకంగా ఓ సంస్కరణాత్మక, ఆలోచనాత్మక భావనలు ఆయన మెదడును ఆవహించి ఉండొచ్చు. ఇది కూడా పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ క్రమంలో ఉత్పన్నమయ్యే చలనక్రమంలో అంతర్భాగమే. నేటి సామాజిక దౌష్ట్యాలు, దూరాఛారాలు, దుర్మార్గాలపై అదో ధిక్కార ప్రతిస్పందనే! న్యాయమైన, హేతుబద్ధమైన ప్రతిస్పందనే! దానిని సైతం సహించలేని సామాజిక, రాజకీయ ఆధిపత్య శక్తుల ప్రతినిధిగా నేడు బండి సంజయ్ రంగంలోకి వచ్చాడు. ఈ వివాద పూర్వ రంగమిదే!
ఇది నిజానికి ప్రవీణ్ కుమార్, సంజయ్ ల మధ్య వ్యక్తిగత వివాదం కాదు. దీన్ని వ్యక్తిగత వివాదంగా భావిస్తే, రెండు పొరపాటు ధోరణులకి, అంచనాలకీ దారి తీస్తుంది. మొదటిది, ప్రవీణ్ కుమార్ అట్టడుగు సామాజిక వర్గాల పిల్లల భావి పురోగతి కై నేడు నూతన సాంఘిక దృక్పధాన్ని అవలంబిస్తూ; నేటి రాజ్యాంగ పరిమితుల్లోనే సాంఘిక, విద్యా, విజ్ఞాన ప్రయోజనాల కై విస్తృత కృషి చేస్తున్నారు. దాని పరిధి కొద్దిమందికి పరిమితం కాదు. అది సువిశాలమైనది. దానిని కేవలం ప్రవీణ్ కుమార్ చేపట్టే వ్యక్తిగత మంచిపనుల పరిధికి కుదించడం సముచితం కాదు. మరోవైపు నేడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించే ఆధిపత్య అభివృద్ధి నిరోధక భావజాలం ప్రమాదకరమైనది. దాని వెనక ఓ పెద్ద వ్యవస్థీకృత రాజకీయ నిర్మాణ వ్యవస్థ ఉంది. బండి సంజయ్ వున్నా లేకపోయినా కొనసాగే నిర్మాణ వ్యవస్థ అది. కేవలం బండి సంజయ్ వ్యక్తిగత నిర్వహణలో మనుగడ సాగించే నిర్మాణ వ్యవస్థ కాదు. దానిని బండి సంజయ్ కారణంగానే తలెత్తిన వివాదంగా భావించడం కూడా సరికాదు. ఈ ఇద్దరిలో ఎవరూ వ్యక్తిగతవాదులు కారు.
ప్రవీణ్ కుమార్ కృషి నేటి సామాజిక భౌతికపరిస్థితిలో ఎంత ఎక్కువ ఆధిపత్య వ్యతిరేక ప్రజాతంత్ర పాత్రను పోషిస్తుందో, అట్టి సువిశాల పాత్రని వ్యక్తిగతంగా పరిమితం చేయడం సరికాదు. అట్లాగే బండి సంజయ్ పాత్ర నేటి భౌతిక స్థితిగతులలో ఎంత ఎక్కువ ఫ్యూడల్, బూర్జువా, పెత్తందారీ, మనువాద వర్గాల ఆధిపత్యాల్ని బలపరుస్తుందో దాని రాజకీయ పరిధిని కేవలం సంజయ్ వ్యక్తిగత పరిధిలోకి పరిమితం చేయడం సరికాదు. ఇది పరస్పర విరుద్ధమైన, రాజీ పడలేని రెండు భావజాలాల మధ్య చాలాలోతైన సంఘర్షణ! దాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంగా చూడరాదు.
ప్రవీణ్ కుమార్ గారు నేడు ఒకవైపు రాజ్యాంగబద్ద అధికారి స్థానంలో ఉంటూనే, మరోవైపు రాజ్యాంగం కల్పించిన కొన్ని అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని, అట్టడుగు సామాజిక వర్గాల పిల్లల విద్యా, విజ్ఞాన, సామాజిక, సంక్షేమం కై కృషి చేస్తున్నారు. వ్యక్తిగత అంకిత భావంతో ప్రవీణ్ కుమార్ చేపట్టే కృషి ఫలితాలు ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా అనుభవించేవి కాదు. రాజ్యాంగాన్ని ప్రవీణ్ కుమార్ ఆసరాగా చేసుకున్నట్లే, అట్టడుగు సామాజిక వర్గాల పిల్లలు ప్రవీణ్ కుమార్ ని ఆసరాగా చేసుకుంటున్నారు. అత్యంత సహజమిది. అంతిమ సారంలో రాజ్యాంగ ఫలాలు బాధిత సామాజిక వర్గాలకు చేరే క్రమమిది. ఇది ఆచరణలో నేటి పురోగామి, ప్రగతిశీల, లౌకిక శక్తుల సామాజిక కృషిలోనూ అంతర్భాగమే.
బండి సంజయ్ ఏ ఫ్యూడల్, రాచరిక, మనువాద, కార్పొరేట్ ఆధిపత్య భావజాలాలకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తూ, సామాజిక ఆధిపత్య భావజాలంతో ప్రవీణ్ కుమార్ పై నేడు విద్వేషపూరిత విమర్శలకు దిగాడో, అట్టి ఆధిపత్య భావజాలాల వ్యతిరేక ధిక్కార సామాజిక, రాజకీయ కృషిని తీవ్రతరం చేయాల్సిన చారిత్రిక ఆవశ్యకత నేడు చారిత్రిక పురోగామి శక్తుల ఎదుట ఎంతైనా ఉంది. ఇది నేటి సామాజిక పురోగామి శక్తుల ఓ తక్షణ కర్తవ్యమే
పోలీస్ శాఖలో ఒకప్పుడు రాజ్యం చేత బెస్ట్ ఆఫీసరు గా పేరొందిన ప్రవీణ్ కుమార్ నేడు సంక్షేమ శాఖలోనూ సంబంధిత సామాజిక వర్గాల బాధిత ప్రజల చే బెస్ట్ ఆఫీసర్ గా గుర్తింపు పొందుతున్నారు. ఐతే ఈ రెండో బెస్ట్ ఆఫీసర్ స్థానం సదా సుస్థిరమైనది కాదు. రానున్న కాలంల్ అది స్థిరంగా కొనసాగే అవకాశంలేదు. అందుకు క్రింది బలమైన కారణం ఉంది.
పైన పేర్కొన్నట్లు రాజ్యానికీ, రాజ్యాంగానికీ మధ్య వైరుధ్యం నేడు క్రమంగా పెరుగుతూ ఉండటం ఓ భౌతిక వాస్తవం. వివిధ సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యాలకి “రాజ్యం” నేడు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐతే పైన పేర్కొన్నట్లు రాజ్యానికి రెండు మొఖాలు వుంటాయనే వాస్తవం మరిచి పోరాదు. దాని బాహ్యమొఖం నేడు “సంక్షేమం” ముసుగును దరించి వుంది. లోపలి మొఖం (అంతర్ముఖం) “సంక్షేమ రహిత” రూపంలో ఉంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చేపట్టిన సామాజిక సంకల్ప కృషికి రాజ్యాంగమే ఒక నిలవ నీడను కల్పించింది. అదే గురుకుల విద్యా సంస్థల సంక్షమ అధికారిగా పనిచేసే అవకాశం. అది ఇప్పుడు తన “నివాసం”. మున్ముందు అదే నివాసంలో ఆయన్ని రాజ్యం వుండనిస్తుందా? నిర్వాసితుణ్ణి చేస్తుందా? ఇదో కీలక ప్రశ్న!
పైన పేర్కొన్న నివాస స్థలంపై రాజ్యం యొక్క సంక్షేమ రహిత విభాగం (ఫాసిస్టు విభాగం) దాడి చేస్తోన్న కాలమిది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, రాజ్యంలోని సంక్షేమ రహిత అంతర్గత విభాగానికీ, దాని బాహ్య సంక్షేమ సహిత ఉపరితల విభాగానికీ మధ్య ఘర్షణ తీవ్రతరమవుతోన్న కాలమిది. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే, రాజ్యం (state) యొక్క ఇరుసు (కేంద్రకం లేదా న్యూక్లియస్)కీ; దానిఉపరితల కక్ష్యలో పరిభ్రమిస్తోన్న బాహ్య సంక్షేమ రాజ్యాంగం (welfare constitution) కీ నడుమ వైరుధ్యం నానాటికి మరింత తీవ్రతరమౌతోన్న కాలమిది. దీనినే రాజకీయ పరిభాషలో చెప్పాల్సి వస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకూ, ఫాసిజనికీ మధ్య వైరుధ్యమిది.
ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఒక నర్మగర్భితమైన నగ్నసత్యం బోధపడుతుంది. రాజ్యాంగబద్ద పోలీస్ ఉన్నతాధికారిగా తొలి దశలో రాజ్యం యొక్క ఇరుసు వద్ద నివాసంలో నివసించారు. నేడు రాజ్యం చివరి కక్ష్యలో నివసిస్తున్నారు. అణువును ఓ ఉదాహరణగా తీసుకుంటే, ప్రవీణ్ కుమార్ కార్యస్థానం న్యూక్లియస్ స్థానం నుండి ఎలెక్ట్రాన్ల స్థానంలోకి మారింది. ఇంకా చెప్పాలంటే, అన్నార్తులకి రాజ్యం తూటాలు వడ్డించే చోటు నుండి, అన్నం ముద్దలు వడ్డించే చోటుకు చేరారు. ఇది అర్ధమైతే ప్రవీణ్ కుమార్ పై బండి సంజయ్ విద్వేషం వెనక దాగిన రహస్య రాజకీయ ఎజెండా బోధపడుతుంది.
రెండు మొఖాలతో కూడిన ద్విముఖ “రాజ్యం” యొక్క బయటి సంక్షేమ మొఖానికి మరణశాసనం రాసే ప్రక్రియని నేడు రాజ్యంలోని ఫాసిస్టు విభాగం ఐన న్యూక్లియస్ చేపడుతోంది. ప్రవీణ్ కుమార్ వంటి అంకితభావంతో పని చేసే కొందరు అధికారులు నేడు రాజ్య ఇరుసు వద్ద నివాసం ఉండలేక సంక్షేమ తలంలో కొత్త నివాసస్థానాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారిని అట్టి కొత్త నివాసాల నుండి ముందుగా ఓ వ్యూహంప్రకారం నిర్వాసితుల్ని చేయకుండా రాజ్యం యొక్క సంక్షేమ మొఖానికి మున్ముందు మరణశాసనం రాయడం ఫాసిస్టు రాజకీయ శక్తులకి సాధ్యం కాదు. అట్టి ప్రక్రియలో ఈ వివాదమూ అంతర్భాగం కావచ్చునెమో! రాజ్య ఫాసిస్టు శక్తుల మనస్సుల్లో ఏ వ్యూహం వుందో సమీప భవిష్యత్తు తేల్చి చెబుతుంది. తస్మాత్ జాగ్రత్త!
పైన పేర్కొన్న రెండో సంక్షేమ విభాగంలో దాగి ఉన్నదే నేడు ఉనికిలోని భారత రాజ్యాంగం. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ రచించి, తుదకు రాజ్యాంగ సభ ఆమోదించి నేడు అమలులో ఉన్న భారత రాజ్యాంగాన్ని కూల్చివేసే ఒక ప్రక్రియను ఫాసిస్టు రాజకీయ శక్తులు తమదైన శైలిలో నేడు త్వరితం చేస్తున్నాయి. దీంతో సంబంధం లేని వివాదం కాదిది.
రాజ్యాంగ ఫలాల్ని సంబంధిత అట్టడుగు సామాజిక వర్గాల పేద, నిరుపేద విద్యార్థులకు అందించడానికి నేడు ప్రవీణ్ కుమార్ సాగిస్తోన్న సామాజిక, సంక్షేమ కృషి అనివార్యంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ లక్ష్యానికి దోహదపడుతుంది. అది విశాల అర్ధం (Broader sense) లో చూస్తే, ఫాసిజాన్ని వ్యతిరేకించే విశాల ప్రజాతంత్ర రాజకీయ లక్ష్యానికి కూడా దోహదపడుతుంది. ఇదే అసలు గమనార్హ అంశం.
ప్రవీణ్ కుమార్ గారి పాతికేళ్ల ప్రస్థానంలో వచ్చిన ఈ కీలక మార్పు ఆహ్వానించ దగినది. రాజ్యం ద్వారా న్యాయార్ధులకు తూటాలు వడ్డించే ప్రక్రియకు ప్రాతినిధ్యం వహించే స్థానం నుండి ఆయన ఏనాడో వైదొలిగారు. ఆ నెత్తుటి విధి ఆయనకు సంతృప్తి ఇచ్చి ఉండక పోవచ్చు. లేదా మరో కారణం ఏదైనా ఉందేమో! ఆ మార్పుకి అంతర్గత కారణాలు ఏమైనప్పటికీ, ప్రవీణ్ కుమార్ రాజ్య రెండోతలంలోకి మారడం ఓ భౌతిక వాస్తవం. నేడు రాజ్య సంక్షేమ తలంలోకి తన నివాస స్థలాన్ని మార్చుకొని, అట్టడుగు సామాజిక వర్గాల విద్యార్థులకు విద్య, విజ్ఞానం, సాంకేతిక, సామాజిక న్యాయ ఫలాల్ని అందించే ప్రక్రియకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదో భౌతిక వాస్తవం.
పాత ప్రవీణ్ కుమార్ రాజ్యం పాతతలం నుండి స్థానభ్రంశం చెంది, నెడు కొత్త తలంలో కొత్త ప్రవీణ్ కుమార్ గా ఆవిస్కృతులు కావడం గమనార్హం. ఒకవేళ నేటి నివాసం నుండి ఆయన్ని వెల్లగొట్టే ప్రయత్నాలు జరిగితే, వాటికి వ్యతిరేకంగా దృఢంగా, ఐక్యంగా నిలబడాల్సిన చారిత్రిక బాధ్యత పురోగామి శక్తులన్నింటి పై ఉంది. నివాస స్థానం నుండి నిర్వాసితుణ్ణి చేసే ముందు ప్రవీణ్ కుమార్ కి “పిచ్చికుక్క” ముద్రవేసే పెను రాజకీయ ప్రమాదం కూడా ఉంది. అట్టి లక్షణాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కాపాడుకునే బాధ్యత కేవలం ఆయన కృషి ద్వారా ప్రత్యక్ష లబ్ది పొందుతోన్న అట్టడుగు విద్యార్థుల, వారి తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కారాదు. అది సమాజంలోని సకల పురోగామి, ప్రగతిశీల శక్తుల తక్షణ కర్తవ్యంగా మారాలి.
ఈ సందర్భంగా ఓముఖ్య విషయాన్ని చెప్పాల్సి ఉంది. మూడు దశాబ్దాల క్రితం రాజ్య నిర్బంధ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించి బూటకపు ఎదురు కాల్పులు సాగించిన నేపథ్యం వల్ల విప్లవోద్యమం ఆయన పై నిప్పులు చేరిగింది. అది గత నేపధ్యం విస్మరించి ఆయన పక్షాన నిలబడాల్సిన కొత్త చారిత్రక ఆవశ్యకత నేడు ఏర్పడింది. ఔను మరి! ,స్థల, కాలాదుల్ని బట్టి విధానాలూ మారతాయని గతితర్కం చెబుతోంది. అంబేద్కర్ రచించి అమలులో ఉన్న రాజ్యాంగానికి మరణ శాసనం రాసే ప్రమాదం పొంచి ఉన్న కాలాన్ని బట్టి ‘గతితర్కం’ మిత్రుల, శత్రువుల పొందిక (composition) లో మార్పుల్ని తెస్తుంది. నగ్నమైన క్రూర ఫాసిస్టు రాజ్య వ్యవస్థ స్థాపనకై సన్నాహాలు జరిగే ప్రమాదకర సంక్లిష్ట కాలమిది. ఈ క్లిష్ట, కష్టకాలంలో నూతన తక్షణ రాజకీయ కర్తవ్యమిది.
ఈ కొత్త భౌతిక పరిస్థితి ఆకాశం నుండి హఠాత్తుగా ఊడిపడింది కాదు. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ లేకుండా ఉత్పన్నమైనది కాదు. ఈ సుదీర్ఘ సంఘర్షణ క్రమంలో ఒకానొక నిర్దిష్ట కాలం, స్థలం, తలం, గతి, స్థితి, దశ, దిశల్లో అనివార్యంగా ఏర్పడిందే. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని సామాజిక, ఆర్ధిక, రాజకీయ పురోగామిశక్తులు మీనమేషాలు లెక్కపెట్టకుండా ప్రవీణ్ కుమార్ వెంట దృఢంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. అవి అట్టి పాత్రను పోషిస్తాయని ఆశిద్దాం.
మరో చివరి మాట! ప్రవీణ్ కుమార్ తొలుత రాజ్య ‘కొరడా’ పిడిని తనచేతి పిడికిట్లో ధరించాడు. దాని దెబ్బలకు విప్లవోద్యమ శక్తుల వంటిమీద వాతలు పడే పరిస్తితి ఆనాడు వుండేది. నేడు కొరడా పిడిని చేత ధరించే స్థానాన్ని వదిలేసి, దాని “కొస” వద్దకు చేరారు. కొరడాకి నేడు కూడా ఆయన దూరం కాలేదు. దాని నుండి అలీనం కాలేదు. కానీ నాడు దెబ్బ కొట్టే స్థానంలో కొరడాని ఝళిపించే పాత్రధారిగా వున్నారు. నేడు దాని దెబ్బలు తినే స్థానంలోకి మారారు. రాజ్యకొరడా బారి నుండి పాలితుల్ని కాపాడే లక్ష్యం ధరించిన సామాజిక, రాజకీయ, చారిత్రిక పురోగమన శక్తుల భుజస్కంధాలపై నేడు మరో కొత్త బాధ్యత పడింది. అదే ప్రవీణ్ కుమార్ వీపు పై కూడా వాతలు పడకుండా కాపాడటం! ఈ కొత్త చూపుతో కొత్తకోణంలో తమ రాజకీయ లక్ష్యాలకి కొత్త సానరాయిపై పదును పెట్టుకొని అవి కొత్త విధిని నూతన దీక్షతో నిర్వహిస్తాయని ఆశిద్దాం.
ఈ తరహాలో ప్రవీణ్ కుమార్ మొదటి వ్యక్తి కాదు. చివరి వ్యక్తి కూడా కాడు. ఈ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణలో మున్ముందు ఎందరో ప్రవీణ్ కుమార్లు ఇలాంటి కొత్త బాధితులుగా మారతారు. ఓ సుదీర్ఘ భావి ఫాసిస్టు రాజకీయ ప్రక్రియకి చేకూరనున్న దుష్ఫలితాలవి. అట్టి ప్రమాదకర భావి ఫాసిస్టు రాజకీయ ప్రక్రియ నియంత్రణకై ముందుకు సాగుదాం. ప్రవీణ్ కుమార్ ని నిర్వాసితుణ్ణి చేస్తే ఆయన వ్యక్తిగతంగా నష్టపోయే మాట నిజమే. కానీ అట్టి ప్రవీణ్ కుమార్ బాసటగా, ఆసరాగా సామాజిక సంక్షేమ ఫలాల్ని అనుభవించే లక్షలాది పేద విద్యార్థులకు జరిగే నష్టం అంతకంటే వందలు, వేల రెట్లు ఎక్కువే. అంతకన్నా మించి, 130 కోట్ల మంది దేశ ప్రజల్ని నాటి నాజీ జర్మనీ తరహా ఫాసిస్టు ప్రయోగశాలలోకి ఈడ్చే రాజకీయ ప్రక్రియకి కూడా అది బలం చేకూరుస్తుంది. అందుకే ఈ సామాజిక, రాజకీయ విధిని జీవన్మరణ కర్తవ్యంగా భావించి, నేనుసైతం… ఫాసిస్టు రాజకీయ ప్రక్రియను అడ్డుకునే విధిలో భాగస్వామిని అవుతానంటూ చంద్రునికి ఓ నూలుపోగుగా, వారధి నిర్మాణంలో ఓ ఉడతలా మనవంతు పాత్రను పోషిద్దాం..