స్వాతంత్య్ర సమర జ్వాల వావిలాల

(సెప్టెంబర్ 17 వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి)
( చందమూరి నరసింహారెడ్డి)
నా జీవిత విధానం గాంధేయ మార్గం నా ఆలోచన సోషలిస్ట్ తత్వమన్న వావిలాల గోపాలకృష్ణయ్య ఓ ఆదర్శమూర్తి. స్వాతంత్య్ర పోరాట యోధుడు. శాసనసభ్యుడు, సాహిత్య పిపాసి, నిగర్వి, నిత్యం ఖద్దరు వస్త్రాలు ధరించేవారు. వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. స్వాతంత్య్ర సమర జ్వాల వావిలాల 115వ జయంతి నేడు. ఈ సందర్భంగా వారి జీవితాన్ని ఓసారి స్మరించుకోవడం సముచితం.
వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లో 1906 సెప్టెంబర్ 17న జన్మించారు. వీరి తల్లి పేరిందేవి, తండ్రి నరసింహం . తల్లి తండ్రులకు వీరు నాలుగవ సంతానం. మాధ్యమిక విద్య వరకు చదువుకొన్నారు. విద్యార్థి దశలోనే గాంధీజీ పిలుపుకు స్పందించి స్వాతంత్య్ర పోరాటాల వైపు వెళ్లారు.యువకుడిగా ఉన్నప్పుడే స్వరాజ్య భిక్ష పేరుతో ఇంటింటికి తిరిగి ధాన్యం సేకరించి కార్యకర్తలకు భోజనం ఏర్పాటు చేసేవారు. పల్నాడు గాంధీగా పేరు గడించారు.

 

జాతీయోద్యం నుంచి  1997 మద్యపాన నిషేధం ఉద్యమం దాకా తెలుగు నాట వావిలాల ముందు నిలిచి నడపని రాజకీయోద్యమం అరుదు

పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో  గార్లపాటి నరసింహారావు గారితో కలసి పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహంతో ఏ విధంగా బ్రిటీష్ వారిని గడగడలాడించారో అదే విధంగా ఆంధ్రదేశంలో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో తిరుగులేని పాత్ర పోషించారు. గ్రంథాలయోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టుబడిన వావిలాల ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్లీ అరెస్టయ్యారు. ఆ తర్వాత 1946, 1947 ప్రాంతాల్లో రహస్య జీవితం కూడా గడిపారు. ఆంధ్రపత్రికకు కొన్నాళ్లు ఉప సంపాదకుడిగా పనిచేశారు.
పాత్రికేయునిగా, రచయితగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ,శాసనసభ్యులుగా ,స్వాతంత్య్ర సమరయెథులుగా బహుముఖ పాత్రలు పోషించారు.
స్వాతంత్య్రం వచ్చాక కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపిన వావిలాల 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఉభయ కమ్యూనిస్టుపార్టీల మద్దతు తో పోటీచేసి, గెలుపొందారు. సతైనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మొదటి ఏమ్మెల్యే వావిలాల.
1955 లో సిపిఐ అభ్యర్థి గా వావిలాల పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బండారు వందనం పై 19వేల పైచిలుకు మెజారిటీ తో సతైనపల్లి నుంచి రెండవసారి విజయం సాధించారు.
1962 లో మూడవసారి కాంగ్రెస్ అభ్యర్థి యం. నాగేశ్వరరావు పై వావిలాల 18వేల పైచిలుకు మెజారిటీతో సతైనపల్లి నుంచి గెలుపొందారు .
1967 లో సతైనపల్లి నుంచి నాలుగో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పై 28వేల మెజారిటీతో గెలిచారు. ఐదోసారి 1972 లో కాంగ్రెస్ అభ్యర్థి వీరాంజనేయశర్మ చేతిలో ఓటమి పాలయ్యారు.
మరో ఆంద్ర ప్రముఖుడు తెన్నేటి విశ్వనాధం గారు, వీరు ఆ రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతలుగా ఉండి అనేక ప్రజా సమస్యలపైన అర్ధవంతమైన చర్చలు చేసారు. గుంటూరు జిల్లాలో నందిగొండ ప్రాజెక్టు ఉద్యమంలో వావిలాల చాలా చురుగ్గా పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం వీరు చేసిన కృషి మరువ రానిది. పండిత నెహ్రూ గారిచేత ఈ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయించటంలో వీరి కృషి అభినందనీయం.
1968లో ప్రపంచ శాంతి సదస్సులో భాగంగా భారత దేశ ప్రతినిధిగా వావిలాల రష్యా దేశంలో పర్యటించారు.
1992 లో ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే నిమిత్తం అమెరికా దేశంలో పర్యటించారు.
1922లో తొలి రచన ‘శివాజీ’
1947లో ‘మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?’
1951లో ‘విశాలాంధ్రం’
1976-77 ‘ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం’ అన్న పుస్తకాలు రాశారు.
1976-78 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. అప్పుడే వావిలాల ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మాతృభాషలో బోధనకు పెద్దపీట వేశారు. తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టాలని వావిలాల చట్టసభ వేదికగా పోరాటం కూడా చేశారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం కూడా వావిలాల తిరుగులేని పోరాటం చేశారు. 1990లో సంపూర్ణ మద్య నిషేధ రాష్ట్ర స్థాయి కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు.
వావిలాలను 1979లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.కేంద్ర ప్రభుత్వం 1992లో వావిలాలకు ‘పద్మ భూషణ్’ పురస్కారాన్ని అందజేసింది.
వావిలాల స్మారకార్థం వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు లో ఏర్పాటు చేసారు.సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో వావిలాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్‌ నుంచి అచ్చంపేట వెళ్లే రోడ్డులో కాలనీకి వావిలాల వారి వీధిగా పేరు పెట్టారు.
ఆయన జీవితమంతా నిరాడంబరంగా గడిపారు. ఆజన్మ బ్రహ్మచారి. అజాత శత్రువు. వావిలాల 96 ఏళ్ల వయసులో 2003 ఏప్రిల్ 29 న మరణించారు.

 

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు,ఖాసా సుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)