ఆంధ్ర రాజకీయాల్లో బిజెపి కొత్త ఎత్తు… అదైనా పారుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిత్రం ఎపుడూ జరుగుతూ ఉంటుంది. రెండురాజకీయ పక్షాలు రోడ్ల మీద ఎక్కువ సందడి చేస్తుంటాయి. ఈ సందడిని ప్రజలే పట్టించుకోరు.అందులో ఒకటి కమ్యూనిస్టు పార్టీలు కాగా,రెండవది భారతీయ జనతాపార్టీ. ఈ మధ్య కమ్యూనిస్టుల సందడి కూడా బాగా తగ్గిపోయింది. బిజెపి వాళ్లు ఈ విషయంలో ముందుకు వచ్చారు.
 పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చినపుడల్లా పార్టీలో పండగవాతావరణముంటుంది. ప్రకటనలు, ధర్నాలు, వూరేగింపులు, విలేకరుల సమావేశాలు, పార్టీ సభలు…. అబ్బో  ఎంత సందడో. దీన్ని చూసి బిజెపిలో నూతనోత్సాహం అని పత్రికల వాళ్లు రాస్తుంటారు. బిజెపి రాబోతోంది అని రాస్తారు. భవిష్యత్తులో ఏవో భారీ పరిణామలు చోటుకు చేసకునేటట్లుందని పత్రికల్లో, టివిలలో,ఇపుడు తాజాగా వెబ్ సైట్ లలో, సోషల్ మీడియా విశ్లేషణలొస్తాయి.
అసలు తమాషా ఏంటే, జనం వీటినెపుడూ పట్టించుకోలేదు.బిజెపిని దగ్గరకు రానీయడం లేదు. దీనికి సోషసియాలజిస్టులేమయిన సాంఘిక కారణాలు చెబుతారేమో చూద్దాం. ఇప్పటికి మనకు కనిపిస్తున్న విషయాల గురించి మాట్లాడుకుందాం.
‘బిజెపిలో నూతనోత్సాం‘ అని ఇపుడు మళ్లీ రాస్తున్నారు. ఎందుకంటే, కన్నాలక్ష్మినారాయణను స్థానంలో  సోము వీర్రాజును పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించారు. కన్నా పగ్గాలందుకున్నపుడు ఇదే హెడ్ లైన్ వచ్చింది. కన్నారాకతో బిజెపిలో నూతనోత్సాహం, ఏవో భారీ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని తెగ రాశారు.
రెండేళ్లలో నూతనోత్సాహం పాతబడింది.కన్నాకు మరొక చాన్స్ ఇవ్వడానికి బదులు  కొత్త ఉత్సాహం కోసం వెదికారు. కన్నాను మార్చి వీర్రాజు తీసుకువచ్చారు. ఇపుడు మళ్లీ నూతనోత్సాహం అంటున్నారు. ఇలా బిజెపి లో నూతనోత్సాహం కనిపించిండం,  మాయమవడానికి సరిగ్గా ఇరవై యేళ్లచరిత్ర ఉంది.
మొదటి సారి ఇలా ‘బిజెపిలో నూతనోత్సాహం’ అని ఎపుడు రాశారో తెలుసా? 1990 లో. అపుడు అద్వానీ రామ్ రథయాత్ర   ఆంధ్రలోకి ప్రవేశించింది. అయినా సరే రాష్ట్ర బిజెపి మంచిరోజులు రాలేదు.
తర్వాత, బాబ్రి మసీదు విధ్వంసంలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ కరసేవకులు పాల్గొన్నారన్నపుడు ఇదే చెప్పారు.ఊహుఁ. ఏం కాలే.
తర్వాత వాజ్ పేయి ప్రధాని అయినపుడు బిజెపిలో నూతనోత్సాహం అని రాశారు. దాని ప్రభావం రాష్ట్రం మీద పడలేదు.
తర్వాత 2013లో అద్వానీ స్వర్ణ జయంతి యాత్ర ఆంధ్రకు వచ్చినపుడు ఇదే హెడింగ్ పెట్టి రాశారు. ఏం లాభం జరగలేదు.
తర్వాత 2014లో ప్రధాని మోదీగా అఖండ విజయం సాధించినపుడు  బిజెపిలో నూతనోత్సాహం అనేదే మెేజర్ హెడ్ లైన్. రాష్ట్ర బిజెపిలోకి ఏం ఉపయోగపడలేదు.
2019లో ప్రధానిగా మోదీ రెండో సారి రాబోతున్నడన్నపుడు మళ్ళీ అదే హెడింగ్ ప్రత్యక్షమయింది. తెలుగు రాష్ట్రాల్లో మోదీప్రభావం కనిపించనేలేదు.
 ఈ జాతీయ సంఘటనలు కాకుండా, బిజెపి రాష్ట్ర శాఖకు ఎవరు కొత్త అధ్యక్షుడయినా, ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జిగా ఏ ప్రధాన కార్యదర్విని నియమించినా ఇదే విధంగా ‘బిజెపిలో నూతనోత్సాహం’ అనే మాట విడపడుతూ వచ్చింది.
అంతేకాదు, బిజెపి  రామాలయ నిర్మాణం మీద కోర్టు తీర్పుఅనుకూలంగా వచ్చినా, ఆలయానికి శంకుస్థాపనచేసినా, బిజెపి రామాలయం గురించి ఈ వార్త వచ్చినా, అమిత్ షా కు ఆంధ్రలో పర్యటించినా ఇదే హెడ్ లైన్.
 ఈ తంతు జరగబట్టి రెండు దశాబ్దాలవుతున్నా  బిజెపిలో కనిపించే  నూతనోత్సహం ప్రజల్లో ఉత్సాహం నింపడం లేదు.
ఈ మధ్య కాలంలో కులాల వోట్లను ఆకట్టుకునేందుకు బిజెపి అన్ని కులాలనుంచి పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసింది.అపుడూ నూతనోత్సాహం కనిపిస్తా ఉందని చెప్పుకున్నారు. ప్రజలు పట్టించుకోలేదు.  తెలుగు దేశం పొత్తుపెట్టుకున్నపుడు బిజెపిలో నూతనోత్సాహం అన్నారు. అయినా ఏమీ జరగలేదు.
ఇపుడైనా ఏమయినా జరుగుతుందా?
ఎందుకంటే, మొట్టమొదటి సారిగా, జాతీయ నాయకులను కాకుండా, రామాలయం ఇష్యూ  కాకుండా భారతీయ జనతా పార్టీ  పక్కాలోకల్ సమస్య మీద ఈ సారి రాజకీయ సందడి సృష్టిస్తున్నది.
తన వ్యవూహాన్ని కుల,బిజెపి రాామాలయం, మోదీ  కోణం నుంచి మత కోణం వైపు మళ్లిస్తూ ఉంది. ఇలాంటి అవకాశం బిజెపికి గతంలో ఎపుడూ రాలేదు.బయట హిందూత్వ రాజకీయాలునడుస్తున్నా బిజెపి ఇక్కడ కులంలోనే ఇరుక్కుపోయింది.
ఇపుడు తొలిసారిగా హిందూ దేవాలయాల మీద దాడి, హిందూ మనోభావాలను గాయపరుస్తున్నారని మాట్లాడటం మొదలుపెట్టారు.
ఈసారి బిజెపిలక్ష్యం ముస్లిం లు  కాదు. క్రైస్తవం.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాహాటంగా క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నదని, క్రైస్తవ మత ప్రచారం ఎక్కువయిందని, మతమార్పిడులు తీవ్రమవుతున్నాయని ప్రచారం మొదలుపెట్టింది.
ఈ పనిని నేరుగా బిజెపి కాకుండా సోషల్ మీడియాలో బిజెపిఅనుకూలం సైన్యం చేస్తున్నది.
ఉదాహరణకు స్వరాజ్య వెబ్ సైట్  ఈ విషయం మీద చాలా వ్యాసాలు, విశ్లేషణలు చేసి ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవానికి, వైసిపి ప్రభుత్వానికి మంచి అనుబంధం ఏర్పడిందని How Devout Christian, Missionary Family of CM Jagan Mohan Reddy has built Church-State Nexus in Andhra Pradesh     రాసింది. ఈ వెబ్ సైట్ ఇలా క్యాంపెయిన్ మొదలుపెట్టింది అనేక రకాలుగా ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవ కుటుంబం ఎలా ఆంధ్రను క్రైస్తవీకరిస్తున్నదో విశదంగా వ్యాసపరంపర విడుదల  చేసింది.
ఇక్కడ స్పష్టంగా పనివిభజన కనబడుతుంది. జగన్ అనుకూలుడిగా సోము వీర్రాజుకు ముద్ర ఉంది. అందువల్ల  జగన్ క్రైస్తవ నెక్సస్ గురించి  మాట్లాడకుండా, రథాల మీద దాడులు జరగుుతున్నాయని,  హిందూ సెంటిమెంట్ హర్ట్ అయిందని మాత్రం సోము వీర్రాజు నాయకత్వంలోని బిజెపి ఆవేదన చెందుతుంది. సోషల్ మీడియా సైన్యం  మాత్రం  జగన్ ను క్రిష్టియన్ అని, అందుకే ప్రభుత్వం క్రైస్తవ కార్యకలాపాలకు మద్దతునిస్తున్నదని చెబుతుంది.
అయితే,దీనికి ఈ మధ్య ఆలయాల రథాలు కాలిపోవడానికి మాత్రం పబ్లిక్ గా లింక్ చేయలేకపోతున్నారు.
అయితే, ‘జగన్ ప్రభుత్వం – చర్చ్ అనుబంధం’ అనే  ప్రచారాన్ని వైసిపి కూడా కౌంటర్ చేసేందుకు లో సోషల్ మీడియాలో కొత్త అవతారమెత్తింది.
వైసిపి అబిమానులు #jaganwithhindus అని, #Hinduswithjagan అని క్యాంపెయిన మొదలు పెట్టారు. గతంలో జగన్  ఏ ఏ గుళ్లకు వెళ్లింది, ఏ స్వామీజీలను సందర్శించి ఆశీస్సులు తీసుకున్నది, ఏదేవుళ్లకు మొక్కింది, ఏ తీర్థం పుచ్చుకున్నది ఫోటోలతో సహా పెట్టి జగన్ హిందువులకోసమూ ఉన్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ మధ్య మరొక ప్రచారం జరిగింది. హిందువులను మచ్చిక చేసుకునేందుకు జగన్ మళ్లీ హిందూమతం స్వీకరించాడనేప్రచారం కూడా మొదలుపెట్టారు. బిజెపి వాళ్ల ప్రచాారాన్ని ఇగ్నోర్ చేసినట్లే, జగన్ ను హిందువుగా చూపించే ప్రయత్నాన్ని కూడా ఆంధ్రులు పట్టించుకోలేదు.
ఇపుడు సోషల్ మీడియా ఈ హిందూత్వ, క్రైస్తవ ఘర్ణణ చెలరేగుతున్నది.
అయితే, ఒకటి మాత్రం నిజం బిజెపి తన అజండాను, మెల్లిగా రామాలయం, మోదీ-షా, కులం  నుంచి మతం వైపు మళ్లించే ప్రయత్నం బలంగా చేస్తున్నది.
దీనికి ఈ మధ్య రాష్ట్రంలో పెరిగిన క్రైస్తవ కార్యకలాపాలు ఊతమిస్తున్నాయని చెబుతున్నారు. అంతర్వేది రథ దగ్ధం, అంతకు ముందు నెల్లూరు రథ దగ్ధం సంఘటనలో దోషులెవరో పోలీసుల పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం.
ఇవన్నీ బిజెపికి కొత్త అవకాశాన్నిస్తున్నాయి.  ప్రజలటువైపుమళ్లితే ఏమవుతుందో చెప్పలేం. తెలుగువాళ్లింతవరకు  హిందూత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. బిజెపిని చాలా దూరంగా ఉంచారు. జగన్ రాజకీయాాలు, స్వరాజ్య రాసినట్లు ‘స్టేట్ -చర్చ నెక్సస్’   బిజెపి ఇక్కడ పుంజుకునేందుకు బాట వేస్తాయా?

ఎందుకంటే, బిజెపితో కలసి పనిచేయాలని భావిస్తున్న టిడిపి, జనసేన కూడా ఇపుడు హిందూ మనోభావాల భాష మాట్లాడుతున్నాయి.