తిరుపతిలో ‘హో’ రెత్తిన శివ‌సాగ‌రం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-24)

(రాఘ‌వ శ‌ర్మ‌)

‘ హో ‘ కవితా సంకలనం ఆవిష్క‌ర‌ణ కోసం ఇర‌వై మూడేళ్ళ క్రితం శివ‌సాగ‌ర్ తిరుప‌తి వ‌చ్చారు.

ఒక‌ప్ప‌టి పీపుల్స్‌వార్ అగ్ర‌నాయ‌కుడు స‌త్య‌మూర్తి కవి శివ‌సాగ‌ర్ గా ప్రసిద్ధులు. మ‌ర్నాడు మా మిత్ర‌బృందంతో క‌లిసి చంద్ర‌గిరి కోట‌ను సంద‌ర్శించారు.

శ్రీ‌నివాస మంగాపురంలోని పురాత‌న‌మైన‌ శ్రీ‌క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ఆవ‌ర‌ణ‌లో కూర్చుని అనేక సాహిత్య, రాజ‌కీయ విష‌యాలు మాతో ముచ్చ‌టించారు.

కవిత్వమంటే ప్రాణమిచ్చే త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ డం ఒక విషాదం. చిన్న వ‌య‌సులోనే పెద్ద పేరు సంపాదించుకున్నాడు.

ఈనాడు, ఉద‌యంలో చేసి, ఆంధ్ర‌జ్యోతి వార ప‌త్రిక‌కు ఎడిట‌ర్‌గా ఎదిగాడు.

అత‌ని ఆముద్రిత క‌విత‌ల‌న్నిటినీ క‌లిపి ‘ హో ‘ పేరుతో అత‌ని మిత్రులు ఒక సంక‌ల‌నం తెచ్చారు. ‘ హో ‘ ఆవిష్క‌ర‌ణ‌స‌భను 1998 జులై 27వ తేదీన తిరుప‌తిలోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌ ఆవరణలో ఏర్పాటు చేశారు. మామూలుగా పుస్త‌కావిష్క‌ర‌ణ అంటే పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.ఇదొక వింతైన ప‌ద్ధ‌తిలో జ‌రిగిన సాహిత్య స‌భ‌.

‘ హో ‘ ను కాస్త భిన్న‌మైన సైజులో చాలా అందంగా అచ్చేశారు.శ్రీ‌నివాస్ ముఖ చిత్రంతో అట్ట‌బొమ్మ‌, లోప‌ల క్యారికేచ‌ర్‌లు.ఆ రోజుల్లో అలా అచ్చేయ‌డం సంచ‌ల‌నమే.ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు హో స‌భ జ‌రిగింది.

స‌భ‌కు ముందు ‘ హోయి స్టు ల పేరుతో క‌ర‌ప‌త్రం వేశారు.’ హో ‘ ఇజం అంటూ కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. చెయ్యెత్తి ‘ హో ‘ అని గ‌ట్టిగా హో రె త్తిం చారు.’ హో ‘ అని చేతులెత్తి గట్టిగా అర‌వ‌డం వారి ప్ర‌త్యేక‌త‌గా, ఒక‌ నినాదంగా మారింది. ఈ కొత్త వాదంపై వార్త‌లో స‌భ‌కు ముందే ఒక నేప‌థ్య‌క‌థ‌నం రాశాను.

మ‌ర్నాడు స‌భ జ‌రిగిన‌ట్టు వార్త కూడా ఇచ్చాను.

శ్రీ‌నివాస్‌ను అభిమానించే చాలా మంది సాహితీ మిత్రులు అనేక‌ ఊళ్ళ నుంచి స‌భ‌కు వ‌చ్చారు. స‌భ‌లో ముఖ్య అతిథిగా శివ‌సాగ‌ర్ పాల్గొన్నారు. ఆయ‌న చాలా స‌ర‌దాగా యువ‌కుల‌తో క‌లివిడిగా తిరిగారు.

శివసాగర్ కూడా ‘ హో ‘ రెత్తారు. మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఎద్దుకూర బిర్యానీ ఏర్పాటు చేశారు. అల‌వాటున్న కొంద‌రు చాలా ఇష్టంగా తిన్నారు.అల‌వాటు లేక‌పోయినా ‘ హో ఇజం ‘ కోసం కొంద‌రు రుచిచూశారు. త్రిపుర‌నేని శ్రీ‌నివాస్‌ను ఎంత ఇష్ట‌ప‌డినా, ఎద్దుకూర‌ బిర్యానీ ఇష్ట‌ప‌డ‌ని చాలా మంది ఆ భోజ‌నం ద‌రిదాపుల‌కు వెళ్ళ‌లేదు.

‘ హో ‘ స‌భ ఒక‌ సంచ‌ల‌న‌మే కాదు, పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దానిపైన వాద‌ప్ర‌తివాదాలు మొద‌లైనాయి. ఆ మ‌ర్నాటి ఉద‌యం అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో శివ‌సాగ‌ర్‌ను క‌లిశాం.

నాతో పాటు వార్త బ్యూరో ఇన్‌చార్జి పున్నా కృష్ణ‌మూర్తి, పాత్రికేయుడు బి.వి. ర‌మ‌ణ‌, క‌వి, ర‌చ‌యిత‌, ఏ.ఎన్‌. నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. చంద్ర‌గిరి చూసొద్దాం అన్నారు పున్నాకృష్ణ‌మూర్తి . చెర‌గ‌ని చిరున‌వ్వుతో స‌రే అన్నారు శివ‌సాగ‌ర్ .

అప్ప‌టికే ఆయ‌న‌కు పెద్ద వ‌య‌సు. ఇన్సులిన్ పై ఆధార‌ప‌డి బ‌తుకు బండిని లాగుతున్న జీవితం. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య‌పు మూడ‌వ రాజ‌ధానిగా వెలుగొందిన చారిత్ర‌క ప్రాంతం చంద్ర‌గిరి . తిరుప‌తికి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.  అంతా స్కూట‌ర్లు ఎక్కాం.

మా ఇంట్లో కాఫీ తాగి చంద్ర‌గిరికి బ‌య‌లుదేరాం. ఏ.ఎన్ నాగేశ్వ‌ర‌రావు స్కూట‌ర్‌పై శివ‌సాగ‌ర్ కూర్చున్నారు.

బి.వి.ర‌మ‌ణ త‌న మోటారుసైకిల్‌పై వెంక‌టేశ్వ‌ర్లును ఎక్కించుకున్నారు. పున్నా కృష్ణ‌మూర్తి స్కూట‌ర్ పై గాయ‌ని చంద్ర‌శ్రీ కూర్చుంది. నా స్కూట‌ర్‌పై నేనొక్కడినే క‌దా అనుకుంటూ బ‌య‌లుదేర‌బోతున్నా.

ఆ స‌మ‌యానికి నాలుగేళ్ళ మా మేన‌ల్లుడు బ‌బ్బి గ‌భాలున నా స్కూట‌ర్ ఎక్కి కూర్చునేశాడు. అంతా బ‌య‌లు దేరాం.

శివసాగర్ దారి పొడ‌వునా ఈ ప్రాంత ప‌ల్లెల్ను చూస్తూ, వాటి గురించి ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌గిరి కోట ప్రారంభం నుంచి బి.వి. ర‌మ‌ణ శివ‌సాగ‌ర్‌కు వివ‌రిస్తూ వ‌చ్చారు.

రాజ్‌మ‌హ‌ల్ రెండత‌స్తులూ ఓపిగ్గా ఎక్కారు. తిరుప‌తి ప‌రిస‌రాల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న బి.వి. ర‌మ‌ణ గైడ్‌గా వ్య‌వ‌హ‌రించారు. అన్నిటికంటే మా బృందంలో ఇద్ద‌రు మంచి ఫొటో గ్రాఫ‌ర్లు ఉన్నారు. ఒక‌రు పున్నా కృష్ణ‌మూర్తి, మ‌రొక‌రు బి.వి.ర‌మ‌ణ‌. ఫొటో గ్ర‌ఫీలో ఇద్ద‌రూ ఇద్ద‌రే. చంద్ర‌గిరి కోట‌లోకి ప్ర‌వేశిస్తూ, ఆ మ‌లుపుల ప్రాధాన్య‌త‌ను తెలుసుకున్నారు.

కొండ‌పైన దూరంగా క‌నిపిస్తున్న ఉరికొయ్య క‌థ విని శివసాగర్ నిట్టూర్పు విడిచారు.రా‌మ‌హ‌ల్‌, రాణి మ‌హ‌ల్ అంతా క‌ల‌య‌తిరిగారు.

చంద్రగిరి రాజ్ మహల్ ముందు ఎడమనుంచి పున్నాకృష్ట మూర్తి, రాఘవ శర్మ, ఏ ఎన్ నాగేశ్వర్ రావు, శివసాగర్, చంద్రశ్రీ, వెంకటేశ్వర్లు

మ‌హ‌ల్ ముంద‌ర‌, కోనేరు ముంద‌ర అంతా క‌లిసి ఫొటోలు తీసుకున్నాం. చాలా కాలం అజ్ఞాతంలో గ‌డిపిన శివ‌సాగ‌ర్ ఒక చారిత్ర‌క ప్రాంతంలో ఇలా స‌ర‌దాగా తిర‌గ‌డం ఆయ‌న‌కొక అనుభూతి, ఆట‌విడుపు. శివ‌సాగ‌ర్ మా అంద‌రికంటే పెద్ద వారు. అప్ప‌టికే ఏడుప‌దుల‌ వ‌య‌స‌నుకుంటాను.

నాలుగేళ్ళ వ‌య‌సున్న మా బ‌బ్బి అంద‌రికంటే చిన్న వాడు. ఇప్పుడు శరత్ చంద్ర గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.

చంద్రగిరి కోటలోని చెట్ల మధ్య కుడి వైపు నుంచి బబ్బి ( శరత్ చంద్ర ), బీ.వీ రమణ, శివసాగర్, ఏ. ఎన్. నాగేశ్వర్ రావు, చంద్రశ్రీ,, వెంకటేశ్వర్లు, రాఘవ శర్మ

మ‌ధ్య‌లో మేం ఆరుగురం న‌డివ‌య‌స్కులం. అంతా స‌ర‌దాగా గ‌డిపాం. చంద్ర‌గిరి నుంచి శ్రీ‌నివాస మంగాపురం వెళ్ళాం. శ్రీ‌క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలోకి ప్ర‌వేశించాం. ఈ ఆల‌యంలో విగ్ర‌హం కూడా తిరుమ‌ల ఆల‌యంలో మూల‌విరాట్టంత పురాత‌న‌మైన‌ది. ఆ ఆల‌య ఆవ‌ర‌ణ‌లోనే కూర్చున్నాం. శివ‌సాగ‌ర్‌ను ఇంట‌ర్వ్యూ చేద్దామ‌న్న ఆలోచ‌న వ‌చ్చింది.

ఆయ‌న స‌రే అన్నారు. త‌లా ఒక ప్ర‌శ్న వేశాం. తొలి ప్ర‌శ్న బి.వి. ర‌మ‌ణ సంధించారు.’మీరు శివ‌సాగ‌ర్‌గా మ‌ర‌ణించ‌ద‌లుచుకున్నారా? స‌త్య‌మూర్తిగా మ‌ర‌ణించ‌ద‌లుచుకున్నారా?’ ఆ ప్ర‌శ్న‌కు మేమంతా ఖంగుతిన్నాం. శివ‌సాగ‌ర్లో అదే చిరున‌వ్వు. చాలా సేపు మాట్లాడ‌లేదు.
చుట్టూ క‌లియ చూశారు. చాలా సేప‌టికి శివ‌సాగ‌ర్ నుంచి స‌మాధానం వ‌చ్చింది.

‘ నేను శివ‌సాగ‌ర్ గానే మ‌ర‌ణించ‌దలుచుకున్నా ‘ అన్నారు.

‘ నా క‌విత్వానికి రాజ‌కీయాల‌కు సంబంధం లేదు. స‌త్య‌మూర్తికి,శివ‌సాగ‌ర్‌కు మ‌ధ్య సంబంధం విరుద్ధాంశాల మ‌ధ్య ఐక్య‌త‌. నా క‌విత్వ అస్థిత్వానికి రాజ‌కీయ ఉద్య‌మం ఆలంబ‌న‌. రాజ‌కీయోద్య‌మం క‌విత్వంగా ప‌రివ‌ర్త‌నం చెందింది. క‌విత్వం రాజ‌కీయోద్య‌మంపై ప్ర‌భావం చూపింది. ఉద్య‌మంలోని ఎగుడు దిగుడుల‌లో క‌నిపించిన నా మాన‌సిక స్థితే నా క‌విత్వం. అందువ‌ల్ల ఉద్య‌మ క‌విగా చ‌నిపోతాను ‘ అంటూ వివ‌రించారు.

ఇంట‌ర్వ్యూ చాల సుదీర్ఘంగా సాగింది. పున్నా కృష్ణ‌మూర్తి దాన్ని వార్త చెలిపేజీలో రాశారు. మ‌ధ్యాహ్నం అంతా తిరిగి మాఇంటికి వ‌చ్చేశాం.

మా ఇంట్లోనే అంతా నేల‌పైనే కూర్చుని భోజ‌నం చేశాం. శివ‌సాగ‌ర్‌తో వ‌చ్చిన చంద్ర‌శ్రీ గొప్ప గాయ‌ని. ఆమె శివ‌సాగ‌ర్ పాట‌లు కొన్ని పాడారు.

అప్ప‌టివ‌ర‌కు శివ‌సాగ‌ర్ పాట‌ల‌ను నావరకు నేను క‌విత‌లాగా చ‌దువు కోవడమే తప్ప పాట గా వినలేదు. పాట‌లుగా విన‌డం అదే తొలిసారి.

అంద‌రికీ వండి వ‌డ్డించిన మా అమ్మ కోసం ఒక భ‌క్తి పాట పాడ‌మ‌ని శివ‌సాగ‌ర్ చంద్ర‌శ్రీ‌ని అడిగారు.

‘ ఏడు కొండ‌ల వాడా వెంక‌టార‌మ‌ణ స‌ద్దు సేయ‌క నీవు నిదుర‌పో తండ్రీ ‘ అంటూ చంద్ర‌శ్రీ పాడింది. శివ‌సాగ‌ర్ పాట‌లు ఎంత శ్రావ్యంగా పాడిందో ఈ పాట‌ను కూడా అంతే శ్రావ్యంగా పాడింది. శివ‌సాగ‌ర్ ఉరిపాట చాల ప్ర‌సిద్ధం. నాకు చాలా ఇష్టం.

త్రిపురనేని మ‌ధుసూద‌న రావు పైన శివ‌సాగ‌ర్ ప్ర‌భావం చాల బ‌లంగా ఉండేది. మ‌ధుసూద‌న రావు త‌న ఉప‌న్యాసాన్ని ఉరిపాట‌తోనే మొద‌లు పెట్టేవారు.

‘ ఉరికంబం ఎక్కి నేను
ఊహాగానం చేసెద‌
నా ఊహ‌ల ఉయ్యాల‌లోన
మ‌రో జ‌గ‌తి ఊసులాడు
ఉరికంబం ఎక్కి నేను
తీయ‌ని క‌ల‌లే గాంచెద‌
నా క‌ల‌లే నిజ‌మై
నిఖిల‌లోక‌మే హ‌సించు

రెక్క‌విప్పి ఎర్ర‌సేన
న‌లుదిక్కులు ప్ర‌స‌రించును
మొక్క‌వోని ఎర్ర‌సేన
విముక్తిని సాధించును
భూతాల‌కు ప్రేతాల‌కు
గోరీలే క‌ట్టును

సూర్యుని అర‌చేత బ‌ట్టి
రైతు దుక్కి దున్నును
ఫ్యాక్ట‌రీలొ చంద‌మామ
మ‌ర‌చ‌క్రం తిప్పును
బిగిపిడికిలి కార్మికుడే
న‌వ‌జ‌గ‌తికి సూత్ర‌ధారి
మ‌హితాత్ముడు కార్మికుడే
న‌క్ష‌త్ర కిరీట ధారి ‘

మ‌ధుసూద‌న రావు ఈ పాట‌ను స‌భ‌లో చ‌దివిన‌ప్పుడ‌ల్లా రోమాలు నిక్క‌బొడుచుకునేవి. స‌త్య‌మూర్తితో రాజ‌కీయంగా ఎంద‌రు విభేదించినా, క‌వి శివ‌సాగ‌ర్‌గా ఆయ‌నంటే చాలా మందికి అభిమానం.

నేను హైద‌రాబాదులో వ‌ర్త‌మానం దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న‌ప్ప‌డు; 1994లో స‌త్య‌మూర్తిని తొలిసారిగా క‌లిశాను. పీలుల్స్‌వార్‌పై ఉన్న నిషేధాన్ని ఎన్టీ రామారావు ప్ర‌భుత్వం తాత్కాలికంగా ఎత్తివేసిన‌ రోజులవి.ఆ సమయంలో ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేశాను.

మ‌ళ్ళీ ఇప్ప‌డు శివ‌సాగ‌ర్‌గా ఆయ‌న‌తో ఇలా ఒక పూటంతా గ‌డిపాను.శివ‌సాగ‌ర్ లో భావుక‌త ఎక్కువ‌. అందుకే ‘ హో ఇజం ‘ తో గొంతుక‌లి పి యువకులతో పాటు హోరెత్తారు. ‘ హో ‘ లో కొన్ని క‌విత‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

‘ నీ ఇంటికి క‌న్నం వేస్తా-
నీ పెళ్ళాన్ని లేపుకుపోతా ‘

ఇలాంటి చ‌ర‌ణాల ద్వారా శ్రీ‌నివాస్ ఏం చెప్ప‌ద‌లుచుకున్నాడు !? క‌విత్వ‌మంటే ప్రాణం ఇచ్చే శ్రీ‌నివాసేనా ఇది రాసింది? స‌మాధానం చెప్ప‌డానికి శ్రీ‌నివాస్ లేడు. అతని మరణానంతర మే ‘ హో ‘ వచ్చింది.

శ్రీ‌నివాస్ కొంతకాలం పీపుల్స్‌వార్ ద‌ళాల‌లో ప‌నిచేసి వ‌చ్చిన‌వాడు. మంచి స్నేహ‌శీలి. ప్రేమికుడు. క‌విత్వ‌మంటే ప‌డిచ‌స్తాడు. శ్రీ‌నివాస్ రాయ‌ని ఇలాంటి వాక్యాలు కొన్ని క‌విత‌లు గా ‘ హో ‘ లో చేర్చార‌ని ఒక వాద‌న బ‌య‌లుదేరింది.

పిట్ట పోరు పిట్ట‌పోరు పిల్లి తీర్చిన‌ట్టు ఏబీకే ‘ హో ఇజం ‘ పైన కొర‌డా ఝుళిపించారు. వార్త‌లో ‘ హో ఇజం ‘ పైన‌ ఒక సంపాకీయ‌మే రాశారు.

హోయిజానికి పునాది లేదన్నారు. ఇద‌స‌లు ఇది ఒక సాహిత్య ధోర‌ణే కాద‌న్నారు. దాంతో ‘ హో ‘ కాస్తా చ‌ల్ల‌బ‌డి పోయి మ‌ళ్ళీ ఆ ‘ హో ‘ రు ఎక్కడా వినిపించ లేదు. త్రిపుర నేని శ్రీ‌నివాస్ పీపుల్స్ వార్ నుంచి బైటికొచ్చాక నాకు ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఎంత దూరంలో ఉన్నా న‌వ్వుతూ చెయ్యూపే వాడు. ఒక రోజు ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ ఎదురుగా రోడ్డు ప‌క్క‌న మిత్రుల‌తో క‌లిసి మాట్లాడుతున్నాడు.దూరం నుంచి శ్రీ‌నివాస్ ను గమనించి అత‌ని ద‌గ్గ‌ర‌కు వెళుతున్నాను.

అత‌ని పాత ‘ వార్ ‘ స్నేహితులంతా న‌లుదిక్కుల‌కు వెళ్ళిపోయారు.శ్రీ‌నివాస్ న‌న్ను చూసి న‌వ్వ‌డం మొద‌లు పెట్టాడు. ఏమిటి అంత‌గా న‌వ్వుతున్నార‌న్నాను.

ఏం లేదు. మిమ్మ‌ల్ని చూసి పోలీస్ ఇంటెలిజెన్స్ అనుకుని మా వాళ్ళంతా పారిపోతున్నారు అన్నాడు మ‌ళ్ళీ న‌వ్వుతూ.నా ఆకారం అలా ఉందా !? అన్నాను. మ‌ళ్ళీ న‌వ్వులు.

నేను విజ‌య‌వాడ ఆంధ్ర‌భూమిలో చేస్తున్న‌ప్పుడు శ్రీ‌నివాస్‌ను ఒక‌టి రెండు సార్లు సిటీ బ‌స్సలో క‌లిశాను. శ్రీ‌నివాస్ ఉద‌యంలో చేస్తున్నాడు. విజ‌య‌వాడ‌లో ఒక సారి వాళ్ళింటికి వెళ్ళాను. అదే చివ‌రి సారి చూడ‌డం. మ‌ళ్ళీ చూడ‌లేదు.

శివ‌సాగ‌ర్ కూడా ‘ హో ‘ గురించి మ‌ళ్ళీ ప్ర‌స్థావించ‌ లేదు.ఒకే ఒక్క రోజు ‘ హో ‘ నినాదంగా మోగి, ఏబీకే దెబ్బ‌కు అలా మూగ‌వోయింది.

(ఆలూరు రాఘవశర్మ,సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *