అనంతపురం జిల్లాలో ఒకపుడు రైతు ఉద్యమాలు ఇలా ఉండేవి…

(విద్యాన్ దస్తగిరి)
రాజాజీ మద్రాసు ముఖ్యమంత్రి (మొదటి దఫా 1937-39.)గా వున్నపుడు నీలం సంజీవరెడ్డి కల్లు మంత్రిగా(ప్రొహిబిషన్ మంత్రి) వున్నాడు. (రాజాజీ రెండో సారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అది 1952నుంచి 53దాకా.ఇది వేరే విషయం)
మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రైతు  సమస్యల పై మేము మెమొరాండం ఇచ్చినాము.  అపుడే సంజీవరెడ్డి ప్రొహిబిషన్ మంత్రి.
’ఇగో పార్లు యియ్యండి, జొన్నలియ్యండి అని వచ్చినారు.” అని మా కోర్కెలపై ఎగతాలిగా, వెటకారంగా మాట్లాడినాడు. అర్జీ కూడా చూడలేదు. అవమానం అయింది. దాని మీద “ వినదగు నెవ్వ రు చెప్పిన” అనే కరపత్రం జిల్లా రైతు ఉద్యమనాయకులు, కమ్యూనిస్టు నేతలు సదాశివన్, నీలం రాజశేఖర రెడ్డి , తరిమెలనాగిరెడ్డి రాసినారు.ఆ కరపత్రం మేము పంచినాము. ఇందులో రాజశేఖర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి తమ్ముడు, తరిమెల నాగిరెడ్డి బావ. వీళ్లిద్దరు కమ్యూనిస్టులయ్యారు. ఇందులో నీలం రాజశేఖర్ రెడ్డి సిపిఐలో ఉండిపోతే, తరిమెల నాగిరెడ్డి  చివరకు విప్లవోద్యమం బాట పట్టారు.
1946 ఎన్నికలలో ఐదుకళ్లు సదాశివన్ నాయకత్వాన ధర్మవరం తాలుకాలో ప్రచారం చేసినాము.
రైతు సంఘములో  ముఖ్యులుగా  వున్నవారిని ఏరుకొని పార్టీలోకి తీసుకొన్నాము.ఎగువపల్లెలో తక్కలిపాటి పోతన్న, తక్కిలిపాటి తిప్పన్న, నడిమింటి కొండప్ప, ఎగువవాళ్ళ చెన్నయ్య, నారప్ప,నేసే తిప్పేస్వామి,నేసె కొండన్న, వడ్ల రామయ్య, మాల రామయ్య,  మాల ముత్యాలప్ప,ఇట్లా పది పదైదు మంది, అక్కడ: కొత్త గ్యాదిగకుంటలో డి.బొమ్మయ్య, నేను(సి ముత్యాలప్ప), పొడపాటి వెంకట్రామయ్య, పరిటాల శ్రీరాములు బావమరది డి.చిన్న ముత్యా లప్ప,వాళ్ళ అన్న కొండప్ప  వడ్డే అక్కులప్ప, వడ్డే వీర చెన్నప్ప,  శ్రీరాములు పార్టీ సభ్యుడు కాదు. ముత్తపుకుంట్ల లో సరిపూటి రామప్ప(సరిపూటి సూర్యనారాయణ నాన్న గారు) మొదలగువారు రైతుసంఘంలో వున్నారు.
ఎగువపల్లె కేంద్రంగా కూడా కమ్యూనిస్టు పార్టీ సెల్ వుండేది.ఒక సెల్ లో 8-10 మంది సభ్యులు వుండేవారు. మొదటి సెల్ ఎగువపల్లె లో ఏర్పాటు చేసినాం. తరువాత గ్యాదిగకుంట, గంగంపల్లి,నసనకోట సెల్లులు ఏర్పాటు చేసినాం.పార్టీకి అండ రైతులే.
శివాయిజమా భూపోరాటాలు  వచ్చినపుడు వ్యవసాయ  కార్మికులు అండగా వున్నారు .పార్టీ ఏ కార్యక్రమ    మిచ్చినా అమలు జరిగింది. తిరమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి, సదాశివన్ గార్లు వచ్చేవారు. పార్టీ అంటే మంచి అభిమానం. ఈ పది వూర్లలో పార్టీ చెప్పినట్లే కార్యక్రమాలు జరిగేవి. పునాది రైతులే. శివాయిజమా పోరాటం తరువాత కూలీలూ.
స్వాతంత్య్రం వచ్చింది. కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడింది. ఈ స్వాతంత్య్రాన్ని కమ్యూనిస్టు పార్టీ గుర్తించలేదు. నెగిటివ్ గానే తీసుకుంది. వచ్చింది అసలైన స్వాతంత్య్రం కాదు అని పార్టీ అభిప్రాయం. స్వాతంత్య్రం వచ్చినరోజు పెద్ద ఊరేగింపు జరిగింది.ఆ ఊరేగింపులో పాల్గొన్నవాల్లని  భ్రమలకు లోనైన జనాలుగా అంచనావేసి ఆ ఊరేగిం పును పార్టీ అఫీసునుండే చూస్తూ వున్నాను.
1946 ఏప్రిల్ 30న  ప్రకాశం  మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాని (ఇపుడు ముఖ్యమంత్రి) అయ్యారు. ఆయన  కమ్యూనిస్టుల మీద విరుచుకుపడ్డారు. ఒక  ఆర్డినెన్స్  తీసుకు వచ్చారు. ఆ మేరకు సదాశివన్, రాజశేఖర్ రెడ్డి, తరిమెల నాగిరెడ్డి ని అరెస్టు చేసి జైల్లో వుంచినారు. వి.కె.పోలీసులకు దొరకకుండా అండర్ గ్రౌండులో వున్నాడు. నేను ఆఫీసు ఇన్ చార్జ్ గా ఆఫీసులో వున్నాను. మరలా ఎప్పుడో ఈ అభిప్రాయం తప్పని పార్టీ సమీక్షించుకుంది. ఈ ఆర్డినెన్స్ పీరియడ్ లో వి.కె. నేను సమన్వయం చేసుకుంటూ ప్రజాసమస్యలపై  పార్టీ శాఖలకు సర్కులర్లు, కరపత్రాలు తయారుచేసి పంపేవాళ్ళం.పి.సి.జోషిది  సంస్కరణవాద దృక్పథమని, వర్గపోరాటాలు ఉధృతంచేయాలనే వాదం నెగ్గి కలకత్తా మహా సభలో రణదివే కార్యదర్శిగా ఎన్నికైనాడు.

కమ్యూనిస్టు ఉద్యమంలో  చలిచీమల ముత్యాలప్ప -4


  పార్టీలో అంతర్గత చర్చలు తీవ్రమైనాయి. బుద్ధవరంలో రాష్ట్ర మహాసభ జరిగింది. నేను కూడా ప్రతినిధిగా హాజరైనాను. జి.అధికారి రిపోర్టు యిచ్చినాడు. చర్చలు తీవ్రంగా జరిగినాయి. బుద్దవరం మహాసభ అయిపోయినంక మా బావమరది తాతినేని వెంకటేశ్వరరావు ఊరు  కపిలేశ్వరం పోయినాము. అనంతపురంజిల్లాలో  కరువుపనులు పర్యవేక్షించడానికి రాష్ట్ర పార్టీ కొంత మంది వలంటీర్లను పంపింది.వారిలో  వెంకటేశ్వరరావు ఒకడు.ఆ తరువాత కొందరు వాపసు వెళ్ళిపోయినారు. వెంకటేశ్వర రావు.ఇక్కడే వుండి పార్టీ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు.
భార్యతో ముత్యాలప్ప
ఉరవకొండ సి.పి.ఐ. ఆర్గనైజరుగా హోల్ టైమర్ గ  వున్నారు. ఆయనకు నా చెల్లెలు హైమనతితో వివాహం జరిగింది. హైమవతి కమ్యూనిస్టు కార్యక్రమాల్లో పాల్గొంది. సమావేశాల్లో పాటలు కూడా పాడేది.వెంకటేశ్వర రావు 1955 ఎన్నికలలో పోటి చేసినాడు. ఓడిపోయినాడు. కపిలేశ్వరం గన్నవరం దగ్గర.ఆ రోజే గాంధీ గారి హత్య జరిగింది. జిల్లా పార్టీ నాయకత్వం మరల అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో వి.కె.పూర్తిగా అజ్ఞాతవాసం. నేను సెమీ లీగల్ గా ఉన్నాను. నేను అనంతపురం తాలుకాలో ఆర్గనైజర్ గ వున్నాను. తరిమెల,ఇల్లూరు సోదనపల్లి ప్రాంతాల బాధ్యతలు నిర్వహించినాను. మార్గదర్శకుడు వి.కె.
ఈ సంద ర్భంగానే జి.రామకృష్ణ, తాతినేని వెంకటేశ్వర రావు. పూలకుంట సంజీవులు. గణే నాయక్ .యం.కె దాసప్ప,  యం.కె.రామప్పను అరెస్టు చేసినారు.  గుత్తి తాలుకాలో కూడా పని చేసినాను. అనంతపురం తాలుకాలో శింగనమ ల, సోదనపల్లి,తరిమెల యేరియాల్లోను, గుత్తి తాలుకాలో దిమ్మగుడి,వడుగూరు,పామిడి యేరియాల్లో పనిచేసినాను.
వి.కె. జిల్లా అంతటా చూసేవాడు. ఒకసారి తరిమెలనుండి సోదనపల్లెకు నడుచుకుంటూ పోయినాను.. నా వెంట బోయ ముత్యాలప్ప వున్నాడు. ఆయన చాల గట్టివాడు,పెద్దమనిషి, నమ్మకమైనవాడు. సోదనపల్లెలో సోదనపల్లె నారాయణ రెడ్డి ఇంట్లో ఉన్నాము. పోలీసులు వచ్చి చుట్టుముట్టి నన్ను అరెస్టు చేసినారు. బహుశా 1948 జూన్,లేదా జూలైలో అరెస్టు జరిగింది. అరెస్టు చేయడమే కాక నన్ను కొట్టుకుంటూ  తీసుకపోతున్నారు. ముక్కులో రక్తం కారు తోంది. ఆ ప్రాంతంలో వ్యవసాయ కూలి పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయి.
శింగనమల చెరువుకింద గోవిం ద పేట, బండమీదపల్లె మొదలగు పల్లెల్లో కౌలుదార్ల పోరాటాలు జరుగుతున్నాయి. కరపత్రాలు పంచినాము. సభలు జరిపినాము.  భూస్వాములు పోలీసులకు పోరాటాలపై రిపోర్టులు పంపినారు.ఈ నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
బోయ ముత్యాలప్ప గొర్లోనిమాదిరి కంబడి కప్పుకొని తప్పించుకొని పోయినాడు. అరెస్టు చేసిన పోలీసులు భూస్వా మి నారప రెడ్డి ఇంటికి తీసుకొనిపోయినారు. అప్పటికే అక్కడ కోడికూర విందు భోజనం సిద్ధంగా వుంది. నన్నూ తినమనిరి. నేను ఛీత్కరించినాను. అక్కడినుండి అనంతపురం జైలుకు తెచ్చినారు.వారం తరువాత వేలూరు జైలుకు డిటెన్యూగా పంపినారు. వారం రోజుల తరువాత కడలూరు జైలుకు మార్చినారు.
1948 నుంచి 1951 వరకు జైలులో ఉన్నాము. కేరళ,తమిళనాడు, ఆంద్ర,తెలంగాణా కామ్రేడ్స్ చాలామంది ఉన్నారక్కడ.  దాదాపు రెండువేల మంది కమ్యూనిస్టులు అక్కడ వున్నారు.పశువులు కాసేవారినుంచి, పెద్ద మేధావుల వరకు అన్నిరకాల కామ్రేడ్స్ అక్కడ వున్నారు. మద్దుకూరి చంద్రశేఖరరావు, కడియాల గోపాలరావు,మొదలగువారున్నారు. మన జిల్లా నుంచి తాతినేని వెంకటేశ్వరరావు, జి.రామకృష్ణ.పూలకుంట సంజీవులు,యం.కె.దాసప్ప. యం.కె.రామప్ప,గణే నాయక్ లను కూడా అప్పటికే అక్కడకు మార్చినారు. ఎ.కె.గోపాలన్. వెంకట్రామన్ –లాయరు, ఆనందనంబియార్ – రైల్వే యూనియన్ నాయకులు, వై.విజయకుమార్,ఏటుకూరి బలరామ మూర్తి,కంబంపాటి సీనియర్,కాట్రగడ్డ రాజగోపా ల రావు, తరగతులు తీసుకొనేవారు.
భోజనాలు మేమే చేసుకొనేవాళ్ళం.రాజకీయంగా పెద్ద యూనివర్సిటి మాదిరి ఉన్నింది. పొద్దున్నే టిఫెన్ తరువాత క్లాసులు. భోజనం తరువాత క్లాసులు, తరువాత చదువుకోవడం ఇలా ఒక క్రమ పద్దతిలో జరిగింది.అన్ని సబ్జక్టులలో  తరగతులు జరిగేవి. ఈ జైలుజీవిత కాలంలోనే మా చెల్లెలు ఒకరు చనిపోయింది.
Vidwan Dastagiri

((విద్వాన్ దస్తగిరి, విశ్రాంత ఉపాద్యాయులు.రచయిత. ఆయన అనంతపురం జిల్లాలో గ్యాదిగకుంటలో సి.ముత్యాలప్పతో  చేసిన ఇంటర్ వ్యూ  ఇంటర్వ్యూ ఆధారంగా )

ముత్యాలప్ప జ్ఞాపకాలు-3 ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/anantapuram-communist-veteran-chalichemmala-mutyalappa-memoirs/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *