కోణార్క మన హంపీకి తోబుట్టువు! ఇదిగో ఇలాగా…

(బి వెంకటేశ్వర మూర్తి)
 బెంగుళూరు: కోణార్క సూర్య దేవాలయం చూశారా? కాలమెంత కర్కశమైనదో, నిజాలెంత నిష్కర్షగా ఉంటాయో అక్కడి అణువణువూ వెయ్యి గుండెలతో విలపిస్తూ చెబుతుంది.
అదో తెగిన వీణ. శిథిలాలయం. మన హంపీకి తోబుట్టువు. హంపీలో హారతి వెలుగులు విలసిల్లే ఒక్క విరూపాక్షాలయమైనా ఇంకా మిగిలి ఉంది కానీ కోణార్క శిథిలాలయంలో దేవుడు లేనే లేడు.

అర్ధాంతరంగా ఆగిపోయిన అత్యద్భుతమైన కవిత్వం వంటి అద్వితీయమైన శిల్పసంపద మాత్రం సమృద్ధిగా ఉంది.

మన టాటా గ్రూపు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాక, మహా అంటే ఓ పాతికేళ్లకు ముందు వేల వేల టన్నుల ఖనిజాలనీ, గ్రానైట్ లను నెత్తికెత్తుకుని తిరిగే మల్టీ ఆక్సెల్ భారీ వాహనాలు మన దేశంలో కాలు మోపాయి.
అయితే మల్టీ ఆక్సెల్ టెక్నాలజీ మన భారతీయలకు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే వెన్నతో పెట్టిన విద్యేమో అనిపిస్తుంది.
లేకపోతే కోణార్కలోని సూర్యదేవాలయం రథానికి పన్నెండు జతల చక్రాలు ఉండటమేమిటి? కొమ్ములు తిరిగిన చండప్రచండ కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ కి కూడా గరిష్ఠ స్థాయిలో పన్నెండు చక్రాలే. కానీ కోణార్కలోని సూర్య భగవానుడు కొలువు తీరిన రథం గుడికి ఏకంగా ఇరవై నాలుగు చక్రాలు.
అంతేకాదు, ఈ రథానికి ఏడు గుర్రాల ఇంజిను. అంటే సెవెన్ హార్స్ పవర్ అన్నమాట.
ప్రాంగణంలోకి వెళ్లగానే మానవ చరిత్రలోని ఓ అత్యద్భుతమైన మహాసృజన కళ్ల ముందు క్రమక్రమంగా విచ్చుకుంటుంది. కోణార్క ఆలయం స్థూలంగా అటూ ఇటూ పన్నెండేసి చక్రాలపై రథం ఆకృతిలో నిర్మించిన సూర్య దేవాలయం.
తూర్పు, పశ్చిమాభిముఖంగా రెండు సూర్య విగ్రహాలున్నాయి. ఈ ప్రధాన ఆలయం చెంతనే కాస్త దూరంలో ఆరు బయలు నృత్య మంటపం, సమావేశ మంటపం వేరువేరుగా ఉన్నాయి.
తూర్పు గంగా వంశపు రాజు ఒకటవ నరసింహదేవుడు పదమూడో శతాబ్దం మధ్య కాలంలో కోణార్క ఆలయం నిర్మించాడని చరిత్ర చెబుతున్నది. 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు అహోరాత్రులు శ్రమిస్తే ఈ కళాఖండం సిద్ధమయ్యిందట.
పన్నెండేళ్లయినా ఆలయ నిర్మాణం పూర్తి కాకపోయేసరికి రాజు ఆగ్రహించి తుది గడువు విధించాడు. ప్రధాన శిల్పి బిజు మహారాణా ఆలయ శిఖరంలోని చివరి కలశపు శిలను అమర్చడమెలాగో తెలియక చింతాక్రాంతుడై ఉన్న సమయంలో అతని కుమారుడు పన్నెండేళ్ల ధర్మ పాదుడు, తాను తల్లి కడుపులో ఉండగా ఇల్లు విడిచి వచ్చిన తండ్రిని కలుసుకోడానికి వస్తాడు.
అంతటి అద్భుత ఆలయాన్ని నిర్మించిన కన్నతండ్రి చింతను తొలగించడానికై తానే శిఖరాన్ని అధిరోహించి కలశపు శిలను అమర్చి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాడు. కోణార్క ఆలయం గురించి స్థానికుల్లో అనూచానంగా శ్రుతిలో ఉన్న కథ ఇది.
కోణార్క సంపూర్ణమైన ఆలయంగా కాకుండా శిథిలాలయంగా మిగిలిన విషాదానికి కూడా రెండు మూడు చారిత్రక కథలున్నాయి. అసలు ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానేలేదని కొందరు చారిత్రకులు వాదిస్తున్నారు.
అయితే పూరీ జగన్నాథాలయంలో భద్రపరిచిన `మడల పూజీ’ (వార్షిక నివేదిక, కైఫీయతు) లలో కాలాపహాడ్ అనే మహమ్మదీయ పాలకుడు 16వ శతాబ్దంలో ఒడిస్సాలోని అనేక హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్టు దఖలు పర్చబడింది.
ఈ పూజీల్లో కోణార్క ఆలయ విధ్వంసాన్ని కూడా పేర్కొన్నారు. 20 నుంచి 25 అడుగుల వెడల్పున్న కోణార్క ఆలయం స్తంభాలను పగలగొట్టడం కాలాపహాడ్ మూకలకు తలకు మించిన పనైందనీ, అందువల్ల మూలస్తంభాన్ని మాత్రం కొంతమేరకు ధ్వంసం చేశారని పూజీలు చెబుతున్నాయి.
సహజ అయస్కాంత శిలలతో నిర్మించిన మూలస్తంభం పట్టు తప్పడంతో అది పట్టి ఉంచిన మిగతా స్తంభాలూ, శిల్పాలూ, కుడ్యాలు క్రమేణా శిథిలమై కాలక్రమంలో మొత్తం ఆలయమే కూలిపోయిందనీ దాఖలు పర్చారు.
కోణార్క ఆలయం లోని 52 టన్నుల బరువున్నట్టు చెబుతున్న భారీ అయస్కాంత శిలా (మాగ్నటైట్) స్తంభాన్ని బ్రటిష్, పోర్చుగీసు వర్తకులే కూల్చారని మరికొందరు చారిత్రకుల విశ్వాసం.
ఈ బృహదయస్కాంత స్తంభం బంగాళాఖాతంలోని వారి ఓడలను తీరానికి తీవ్రంగా ఆకర్షించేదనీ, ఓడల్లోని దిక్సూచి యంత్రాలను నిర్వీర్యం చేస్తూ వర్తకులకు భారీ నష్టాలు వాటిల్లజేస్తుండేదనీ, అందువల్ల ఆ వర్తకులు పని గట్టుకుని ఈ స్తంభాన్ని పడగొట్టారని వారి వాదం.
ఆలయ నిర్మాణ శాస్త్రం, శిల్పశాస్త్ర నిపుణుల ప్రకారం కోణార్క ఆలయం ఓ ఇంజినీరింగ్ అద్భుతం. అయస్కాంతశక్తి సిద్ధాంత సూత్రాన్ని వినియోగించి, పైన క్రింద భారీ అయస్కాంత శిలలను పేర్చి కోణార్క గర్భాలయంలో ఆదిత్య విగ్రహాన్ని ఎలాంటి ఆలంబన లేకుండానే గాలిలో స్థిరంగా నిలిచేలా అమర్చారని ఆలయ నిర్మాణ శాస్త్ర నిపుణులు వాదిస్తున్నారు.
శిఖరభాగంలో, పీఠభూమిలో అమర్చిన అయస్కాంత శిల్పాలు మొత్తం ఆలయ కట్టడాన్ని పట్టి ఉంచాయని వారి సిద్ధాంతం. ప్రతి రెండు రాతి కట్టడాలకు మధ్యన ఇనుపశిలలను అమర్చారనీ, తద్వారా ఆ ఇనుప శిలలను శిఖర, పీఠ భాగాల్లోని అయస్కాంతాలు ఆకర్షించడం వల్లే మొత్తం ఆలయానికి స్థిరత్వం చేకూరిందని నిపుణుల వివరణ.
ఆనాటి జనజీవనం, విద్యావైజ్ఞానిక సాంస్కృతిక ఔన్నత్యాలకు కోణార్క నిలువెత్తు దర్పణం. ఇరవై నాలుగు చక్రాల చట్రాల్లోనూ, చువ్వలలోనూ కేవలం అరచేయి నిడివిగల వృత్తాల్లో దేవీ దేవతల బొమ్మలూ, మానవ పశు పక్ష్యాదుల వివిధ భంగిమలు, అనంత వైవిధ్యంగల వివిధ దృశ్యాలు చిత్రించిన శిల్పుల కళానైపుణ్యం గమనిస్తే హృదయం ఉప్పొంగుతుంది.
ఈ 24 సూర్య చక్రాలు కేవలం కొలతల్లో మాత్రమే అన్నీ సమానం. శిల్ప వైవిధ్యంలో దేని కదే సాటి. సూర్య గమనం ఆధారంగా కాలగణనం చేసే విధానానికి ఈ చక్రాలు ప్రత్యక్ష సాక్షులు. చక్రంలోని ఎనిమిది చువ్వలు ఒక్కొక్కటి మూడు గంటల కాలంతో (జాము) సమానం.
చువ్వల మీద ఎండ పడటాన్ని బట్టి ఎంత సమయమైందో లెక్కించే వారట. వాత్స్యాయన కామశాస్త్రంలో పేర్కొన్న శృంగార భంగిమలకు కొన్ని స్తంభాలూ, కుడ్యాలపై శిల్పాల్లో జీవం పోశారు.
 ఆలయ ముఖద్వారానికి ముందు రెండు వైపులా చెక్కిన `మనిషి-ఏనుగు-సింహం’ శిల్పాలు మన మనుషులందరికీ హెచ్చరిక వంటివే. ఇందులో సింహం ఏనుగు మీదకు పంజా విసురుతుంటే, ఏనుగు మనిషిని తొండంతో చుట్టేసి బంధించి ఉంటుంది. మనిషి వెల్లికిలా పడి కొనఊపిరితో కొట్టుకుంటుంటాడు.
మన పురాణాల ప్రకారం సింహం అధికార గర్వానికి ప్రతీక. ఏనుగు ధనమదానికి ప్రతీక. ఈ రెండూ కలిసి మనిషిని (మనిషితనాన్ని) చంపేస్తాయి. ఎంతటి నిజం, తరతరాల చరిత్ర ఇదే కదా!
మెయిన్ రోడ్డు దగ్గర వాహనాలు దిగి ఎర్రని ఎండలో దాదాపు అరకిలోమీటరు దూరం నడిచి చెమటోడుతున్న పర్యాటకులను పర్యాటక శాఖ వారి శిల్ప ప్రదర్శన శాల చల్లని నీడలా ఆహ్వానిస్తుంది.
ఆ లోపలే దాదాపు వంద మంది కూర్చోడానికి వీలైన ఏసి థియేటర్ లో నిరంతరం ప్రదర్శించే డాక్యుమెంటరీ చిత్రం కోణార్క ఆలయం కథను అరగంటలో వివరిస్తుంది.
యునెస్కో వారి ప్రపంచ సాంస్కృతిక వారసత్వ కేంద్రమైన ఇంతటి అద్భుత పర్యాటక కేంద్రంలో సుశిక్షితులైన గైడ్ లు అందుబాటులో లేకపోవడం ఆవేదన కలిగిస్తుంది.