మృత దేహాల వల్ల కరోనా వ్యాపించదు: గుంటూరు జిల్లా వినూత్న క్యాంపెయిన్

గుంటూరు: కరోనా వైరస్‌ తో చనిపొయిన వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అపోహలను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం  చేపట్టింది.
కరోనా సోకి చనిపోతే అంత్యక్రియలను అడ్డుకోవడం సామాజిక కళంకం. , మృత దేహంతో వైరస్ వ్యాప్తి చెందదు, కొవిడ్ నిబంధనలు పాటిస్తే సరి పోతుంది అని నచ్చ  చెప్పేందుకు జాయింట్ కలెక్టర్ ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు.
నిజానికి చాలా మంది శాస్త్రవేత్తలు చాలా సార్లు ఈ విషయం స్పష్టం చేశారు. కరోనావైరస్ ఎక్కుగా ముక్కుల నుంచి వచ్చే చీమిడి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. చీమిడి తుంపర్లు బయటకు రావాలంటే, వ్యక్తి దగ్గాలి, లేదా తుమ్మాలి. తుమ్మకుండా, దగ్గకుండా కనీసం మాట్లాడకుండా కరోనా వ్యాపించదు.  ఈ విషయాన్ని ఇటీవల న్యూఢిల్లీ, అఖిల భారత వైద్యశాస్త్రాల సంస్జ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా కూడా స్పష్టంగా చెప్పారు. కరోనా వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం వల్ల కోవిడ్ వ్యాపించదనే విషయం చాలా మందికి తెలియదు.

Coronavirus can not spread through dead bodies. It spreads from respiratory secretion. Coughing is necessary for the spread of this virus. So there is no risk in cremating infected bodies: Dr Randeep Guleria, Director AIIMS

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టం వివరించింది.   శవాల ద్వార కరోనావైరస్ వ్యాప్తి చెందుతందనడం తప్పు అని కూడా పేర్కొంది.
The widespread belief that corpses pose a major health risk is inaccurate. Especially if death resulted from trauma, bodies are very unlikely to cause outbreaks of diseases such as typhoid fever, cholera, or plague though they may transmit gastroenteritis or food poisoning syndrome for survivors if they contaminate streams, wells or other water sources. (Source: World Health Organization)
ఈ స్పృహ లేక కరోనా చనిపోయిన వారి పట్ల బంధువులు కూాడా చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంటారు.చివరకు శవాలను అలా వదిలేసిపోతున్న సంఘటనలు కూడా వినవస్తున్నాయి.  ప్రజల్లో మృతదేహాల పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు గుంటూరు అధికారులు ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. దేశంలో ఇలాంటి క్యాంపెయిన్ ఎక్కడైన జరిగినట్లు సమాచారం లేదు.
“రోగి చనిపోయిన తర్వాత ఊపిరి నిలిచిపోతుంది. దీనితో మృతుడి ఊపిరి ద్వారా పరిసరాల్లోకి వైరస వెదజల్లబడే అవకాశమే లేదు. అంతేకాదు, మృతదేహాలను తరలిస్తున్నపుడు పిపిఇ కిట్లు ధరిస్తున్నందున ఒక వేళ ఉన్నా వారికి వ్యాపించే అకాశమేలేదు,’అమెరికాకు చెందిన తెలుగు డాక్టర్ విజయ్ వి ఎల్దండి తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ బోర్డు ఛెయిర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మృతులనుంచి వైరస్ వ్యాపిస్తుందనే అకారణ భయమేనని, దీనివల్ల గ్రామాలలోకి మృతుల దేహాలను రానీయని పరిస్థితి వస్తున్నదని అమెరికా షికాగోలోని యూనివర్శిటీ ఆఫ్ ఇలినాయిస్ లో  డివిజన్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్, డిపార్ట్ మెంట్ ఆప్ మెడిసిన్ లో పని  చేస్తున్న డాక్టర్ ఎల్దండి చెప్పారు.

 

కరోనా వైరస్‌ వలన చనిపోయిన వ్యక్తి మృతదేహాం నుంచి వైరస్‌ వ్యాప్తి చెందదు అని ప్రచారం నిర్వహించటం తో పాటు ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగేలా సాక్షాత్తు జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ కరోనా వైరస్‌ తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలలో స్వయంగా పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం గుంటూరు నగరం బొంగరాలబీడు స్మశాన వాటికలో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన 57 సంవత్సరాల కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తి అంత్యక్రియల్లో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. మృతి చెందిన వ్యక్తి బంధువులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా సంయుక్త కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ కోవిడ్‌–19తో చనిపోయిన వ్యక్తి మృతదేహంలో 6 నుంచి 7 గంటల తరువాత కరోనా వైరస్‌ ఉండదన్నారు. సాధారణంగా చనిపోయిన వ్యక్తి శరీరంలో 24 గంటలు తర్వాత ఎటువంటి వైరస్‌లు ఉండవన్నారు. కోవిడ్‌ –19 నిబంధనల ప్రకారం కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహంను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో పూర్తిగా రుద్ది, బ్యాగ్‌లలో ప్యాక్‌ చేసి మృతదేహాలను అందించటం జరుగుతుందన్నారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహంను పట్టుకొని అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు.
పాజిటివ్‌ వ్యక్తి మృతదేహంను సమీపం నుంచి చూసిన, మాస్క్‌ ధరించి బౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియల్లో , పాల్గొన్నా కరోనా వైరస్‌ సోకదన్నారు. మృతదేహంను ఖననం, దహన సంస్కారాలు నిర్వహించినా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదన్నారు. ప్రజల్లో ఉన్న అపోహాలు భయందోళనలు వలన కరోనా వైరస్‌ సోకి చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించటం కోసం కొన్ని సంధర్భాల్లో కుటుంభసభ్యులే ముందుకు రావటం లేదన్నారు. అదే విధంగా పాజిటివ్‌ వ్యక్తుల అంత్యక్రియలను తమ స్మశానావాటికల్లో చేయవద్దని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అడ్డుకుంటున్నారన్నారు. చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించకపోవటం మానవత్వానికే మచ్చగా నిలుస్తుందన్నారు. ప్రజలలో పాజిటివ్‌ వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై ఉన్న అనవసర భయాందోళనలు, అపోహాలు , పొగొట్టడం కోసమే కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొనటం జరిగిందన్నారు. అందువలన కుటుంబసభ్యులు కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను నిర్భయంగా తీసుకువెళ్ళి కోవిడ్‌–19 నిబంధనల ప్రకారం స్వస్థలాల్లో గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహించుకోవాలన్నారు. మానవతాదృక్పధంతో ఆలోచించి ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు కోవిడ్‌– 19 తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా జరిగేలా జిల్లా యంత్రాంగంకు సహకరించాలన్నారు.
కోవిడ్‌–19తో మరణించిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గుంటూరు నగరంలో మూడు స్మశానవాటికల్లో పాజిటివ్‌ వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు అమ్మచారిటబుల్‌ ట్రస్ట్, మహాప్రస్థానం సేవ సమితి, స్వచ్ఛంద సేవ సంస్థల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు క్వారంటైన్‌లోను, కోవిడ్‌ –19 ఆసుపత్రులలో ఉండి అంతిమసంస్కారాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉంటే , అటువంటి మృతదేహాలను స్వచ్ఛందసేవా సంస్ధల సహకారంతో 48 గంటల్లోనే వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం నిబంధనల ప్రకారం పోలీస్, రెవెన్యూ యంత్రాంగంతో 48 గంటల్లోపే విచారణ పూర్తి చేసి అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి భాస్కరరెడ్డి, జిల్లా కోవిడ్‌ –19 మృతదేహాల మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి రమేష్‌ నాయుడు, గుంటూరు తూర్పు మండల తహశీల్దారు శ్రీకాంత్, నగరపాలక సంస్థ డిప్యూటి కమిషనర్‌ బి శ్రీనివాస్, అమ్మచారిటబుల్‌ ట్రస్ట్‌ , మహాప్రస్థానం సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.