తిరుపతిలో హెల్త్ ఎమర్జన్సీ విధించండి: నవీన్ రెడ్డి విజ్ఞప్తి

తిరుపతి నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి రాయలసీమ యాక్టివిస్టు, కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
 రోజు రోజుకీ పెరుగుతున్న వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ బెంగళూరు లలో ఇటీవల కరోనా వైరస్ బాధితుల కోసం క్రీడా మైదానాలలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాల తరహాలో తిరుపతి క్రీడా మైదానాలలో సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.
  కనీసం 5000 మంది వైరస్ బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేలా బెడ్ లు, వైద్య పరికరాలు,వైద్యులు పారామెడికల్ స్టాప్ లతో అప్రమత్తంగా ఉంచాల్సిన అత్యయిక పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
 తిరుపతిలో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్ల కొరత ఏర్పడుతున్నదని,
బాధితులకు అత్యవసరంగా ప్రాథమిక చికిత్స కోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్ ల కోసం సిఫార్సు చేసుకునే పరిస్థితి రావడం విచారకరమని చెబుతూ ఇది వైరస్ తీవ్రతను తెలియజేస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు వీడియో చూడండి

 

1) తిరుపతి నగరంలో లాక్ డౌన్ సమయంలో పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ఆ తర్వాత వేల సంఖ్యలోకి పెరగడానికి గల కారణాలు ఏమిటి అన్న దానిపై జిల్లా అధికారులు వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
2) తిరుపతి నగర ప్రజలను అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకండి అని నగరపాలక సంస్థ పోలీసు అధికారులు పదే పదే ప్రాధేయ పడుతున్నా కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం బాధ్యతారాహిత్యం.
3) తిరుపతిలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యులు నర్సులు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అనునిత్యం శ్రమిస్తూ వైరస్ బాధితుల ప్రాణాలను కాపాడుతున్నారు.
4) గోవింద నామ స్మరణతో మారుమ్రోగే తిరుపతి నగరంలో ప్రతి అర గంటకు ఒక అంబులెన్స్ సైరన్ తో దద్దరిల్లుతోంది.
5) తిరుమల తిరుపతి దేవస్థానం వారు నగరంలో అనూహ్యంగా పెరుగుతున్న వైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆన్ లైన్ సేవా టికెట్ల విడుదలపై పునరాలోచించాలి.
6) తిరుపతి నగరంలో ఉన్న 34 ప్రభుత్వ మద్యం షాపులను వెంటనే మూసివేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.
7) శ్రీ వెంకటేశ్వరస్వామి దయతో త్వరగా వైరస్ నివారణ వ్యాక్సిన్ రావాలని అంతవరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.