ఆ రోజుల్లో చుట్టాలు వస్తే వారాల తరబడి వుండి పోయేవాళ్ళు…

(పరకాల సూర్యమోహన్)
మా కవిటం ఇంటిని పరకాల సత్రం అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు బంధువులు కలిపి షుమారుగా ఓ ఇరవై మందివుండేవాళ్ళు. దూరపు బంధువులు, దగ్గర బంధువులు ఎంతో కొంతమంది ఎప్పుడూ ఇంట్లో వుంటూవుండేవాళ్ళు. ఇంక మా ఇల్లు ఎంత సందడిసందడిగా,
నిత్య కోలాహలంగా వుండేదో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి గానీ అర్థం కాదు.ఇంక పండుగలు పబ్బాలు, పుణ్యాలు పురుళ్ళు, తద్దినాలు వస్తే ఇల్లంతా ఎంత హడావుడిగా వుండేదో వేరే చెప్పక్కర్లేదు.
మా ఇంట్లో సావిడి ఓ మినీ మ్యారేజ్ హాల్ అంత వుండేది. ఆ హాల్లో మా బంధువుల పెళ్ళిళ్ళు ఎన్ని జరిగాయో లెక్కలేదు. ఆ రోజుల్లో చుట్టాలు వస్తే వారాల తరబడి వుండి పోయేవాళ్ళు.
మా మేడ లో 12 గదులు ఉండేవి. మూడు వసారాలు అందులో ఒకటి దంపుళ్ళ వసారా. అక్కడ ధాన్యాలు దంపేవారు. అరిసెల కోసం, చలిమిడి కోసం బియ్యం పిండి రోకళ్ళతో దంచేవారు.
కందులు, మినుములు వగైరాలు విసరడానికి ఒక పెద్ద తిరగలి ఉండేది. మేము కూడా ఆ తిరగలి విసురు తామని పెద్దవాళ్ళని పీక్కుతినేవాళ్ళం. మా పోరు పడలేక మా చేత కూడా విసరనిచ్చేవాళ్ళు.
మా ఇంటి తిరగలి
కందులు, మినుముల మొక్కల్ని మా పొలాల్లో చేల గట్ల మీద వేసేవాళ్ళు. మా బాబయ్య పొద్దున్నే పొలం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బాగా ఏపుగా ఎదిగిన పచ్చి కంది కాయల్ని ఓ కట్ట కోసుకొచ్చేవాడు.  ఆ పచ్చి కంది కాయల్ని అలాగే ఒలుచుకుని తినేసేవాళ్ళం లేకపోతే కట్టెల పొయ్యిలో కాల్చుకుని తినేవాళ్ళం. అలా వేడి వేడి కందిగింజలు ఎంతో రుచిగా వుండేవి.
మా ఇంట్లోఇంకో గది వుండేది . దాని పేరు గుండిగ గది అందులో ఇత్తడి గుండిగలు, ఇతరత్రా పాత్రలూ వుండేవి. అదో స్టోర్రూమ్ లాంటిది. అరటి పళ్ళ గెలల్నీ, పనసకాయల్నీ ఆ గదిలో పండబెట్టేవాళ్ళు. ఆపచ్చి అరటి గెలలు బాగా పండటంకోసం వాటి చుట్టూ అరటి ఆకుల్ని చుట్టేవారు. పనసకాయలు బాగా పండగానే ఇల్లంతా ఘుమఘుగా వాసనవేసేది. ఆ గదికి మా పెద్దవాళ్ళ ఎప్పుడూ తాళం వేసి వుంచేవాళ్ళు. లేకపోతే మా వానర మూక ఆ పళ్ళని బతక నిస్తుందా?

మోహన రాగాలు-3


మా దృష్టి అంతా ఆ గది మీదే వుండేది. అరటి పళ్ళు బాగా పండిన తర్వాత కొడవలితో అత్తాలు కోసి  పంపిణీ చేసేవాళ్ళు. ఆ తర్వాతే అవి మా చేతుల్లోకి వచ్చేవి.
పనసకాయ బాగా పండిన తరువాత లోపల వున్న తొనల్ని ఒలవడం ఓ పెద్ద జటిలమైన ప్రహసనం.అదంతా పెద్దవాళ్ళ వ్యవహారం.
ఓ పెద్ద పీట బోర్లించి పనస కత్తికీ, చేతులుకీ బాగా నూనె రాసుకుని పనసపండుని నిలువుగా రెండు ముక్కలు చేసేవాళ్ళు. లోపల బంగారం రంగులో పనస తొనలు వుండేవి. నెమ్మదినెమ్మదిగా పనసతోనల్ని తెగిపోకుండా వలిచేవాళ్ళు.
మా పిల్లమూక ఈగల్లా అక్కడే ముసిరేసేవాళ్ళం. పనసతొనలన్నీ విడదీసి పేద్ద పళ్ళెంలో పోసేవాళ్ళు. మాకు తలో మూడోనాలుగో పనసతొనలు ఇచ్చేవాళ్ళు. లోపల గింజలు విడదీసి ఆ పనసతొనలు తింటూంటే ఆ మధురమైన రుచిని మాటల్లో వర్ణించడం కష్టం. ఆ పనస గింజల్ని కుంపట్లోనో, పొయ్యిలోనో కాల్చుకు తినేవాళ్ళం .మా పిన్నీ వాళ్ళు పనసగింజల్ని కరకరా వేయించి వుప్పు కారం జల్లి వడ్డిస్తే మేము వేడివేడి అన్నంలో నెయ్యివేసుకుని అద్దుకు తినేవాళ్ళం.
మా కవిటం కాలువ సుందర దృశ్యం.నిర్మలంగా ఉన్న నీటిలో గట్టు మీది చెట్లు ఎంత అందగా ప్రతిబింబిస్తున్నాయో చూడండి. పరీక్షగాచూస్తే మా రావిచెట్టు కూడా కనిపిస్తుంది.
మా వంట వసారా లో ఈజీగా ఒక 50 మంది భోజనం చేయవచ్చు.వంటింట్లో చివర గాడి పొయ్యి ఉండేది. మొత్తం ఇంటిల్లిపాదికీ వంటలు అక్కడే. ఈ మూలనుంచి ఆ మూలవరకూ పెద్దా చిన్నా అంతా కలిపి కనీసం ఓ పాతిక మంది భోజనాలు చేసేవాళ్ళు.రోజూ పెళ్ళివారిల్లులా వుండేది. అలాంటి రోజులు మళ్ళీరావు.
పైన మిద్దె ఇల్లు. అది ఖానాలు ఖానాలు గా ఉండేది వాటిల్లో బంధువులు వారి వారి సామాన్లు పెట్టుకునేవారు, పగలు కూడా చీకటి గా ఉండేది, పిల్లలు అందులో కి వెళ్ళాలంటే భయపడేవారు.
మోహన రాగాలు-2  

నిడదవోలు రాదారి పడవ ప్రయాణం మర్చిపోలేను…

ఇక్కడ మా బాబ్బ (మా తాతయ్యల తల్లి)గురించి చెప్పాలి.  అవిడ నిండు నూరేళ్ళు బతికింది. చివరిలో కళ్ళు కనపడేవికావు. మా బాబ్బకూడా మా అందరితో బాటే భోజనం చేసేది. విస్తట్లో అన్నీ వడ్డించాకా చేత్తో తడుముకుంటూ తినేది. ఇంతకీ చెప్పవచ్చేదేమంటే మా బాబ్బ మా చిన్నతనాల్లో మిద్దెలో ఓ మూల ఎవరికీ కనపడకుండా కుండలో సపోటా కాయలు పండబెట్టేది. మేము ఎవరూ కనిపెట్టలేమని ఆవిడ అభిప్రాయం. కానీ మేము ఇట్టే కనిపెట్టేసి కుండలో పండిన సపోటా పళ్ళని శుభ్రంగా లాగించేవాళ్ళం. మేము దొంగతనంగా తినేస్తున్నామని ఆవిడ కనిపెట్టేది
. “వెధవలు, కోతి మూక, ఏడు ఇరుకుల్లో దాచినా కనిపెట్టి తినేస్తున్నారు” అని తిట్టిపోసేది. మావి దున్నపోతు చర్మాలు.పట్టించు కునే వాళ్ళం కాదు. దులుపేసుకుని పోయేవాళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా చెప్పండి?
మిద్దె లో చివర ఒక భోషాణం పెట్టె ఉండేది దానికి రహస్య ఆరలు ఉండేవి, అందులో దస్తావేజులు/వెండి సామాగ్రి పెట్టేవారు.
మిద్దెలో రెండు గుంజలకి తెల్లటి పంచె కట్టే వాళ్ళం. మిద్దె బైట డాబా మీద బాగా ఎండ పడు తున్నప్పుడు రెండో మూడో ఇటుకలు పేర్చి ఓ అద్దాన్ని దాని మీద ఎండ పడేలా చేసి ఆనించేవాళ్ళం. ఆ అద్దం లోంచి ఎండ ఫోకస్ మిద్దె కిటికీ గుండా ఆ తెల్లని పంచె మీద పడేలా చేసే వాళ్ళం. ఆ తర్వాత, ఓ అట్టముక్క సంపాదించి సరిగ్గా సినిమా ఫిల్మ్ రోల్ లో ఒక ఫ్రేం కి సరిపడా కత్తిరించి ఆ ఫ్రేం ని ఆ చిల్లులో అమర్చేవాళ్ళం. ఆ తర్వాత భూత అద్దం తీసుకొని ఫిల్మ్ లోనుంచి కాంతిని భూత అద్దం గుండా పంచె మీద పడేలా చేసి ఫోకస్ సరిగ్గావుండేలా సరిచేసేవాళ్ళం. తెరమీద అభిమాన సినిమా బొమ్మ ప్రత్యక్ష మయ్యేది. గాలికి పంచె వూగితే తెరమీద సినిమా బొమ్మలు కదులుతున్నటే భ్రమ పడేవాళ్ళం. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టూ,చంద్రుని మీద అడుగు పెట్టినట్టూ మాకు అనిపించేది.
వేసవిలో మే మంతా డాబాలోనే పడుకునే వాళ్ళం. మేడమీద కోట బురుజుల్లా ఈ చివర ఓ గది ఆ చివరఓగది వుండేది. మధ్యలో కనీసం ఓ పాతిక మంది పడుకునేటంత చోటువుండేది. చాపలు, జంబుకానాలు పరిచి పడుకునేవాళ్ళం. అందరికీ తలగడాలు వుండేవికాదు. కొంతమంది తలకింద ఏమీ లేకుండానే పడుకునే వాళ్ళు. తలగడాలు వున్న వాళ్ళు నిద్రలోకి జారుకున్నాకా వాళ్ళ తలకింద నుంచి తలగడాలు నెమ్మదిగా లాగేసే వాళ్ళం. అవో సరదా చిలిపి పనులు.
కవిటంలో మహిళా సంఘానికి ఎదురుగా వెలసిన గుడి. అయ్యప్ప భక్తుల కొంగు బంగారం. మా గ్రామానికి ఇదొక ఆకర్షణ
అలాంటి రోజులు మళ్ళీ రావు. సాయంత్రం అవగానే ఇంటి పాలేరు ఈ చివరి నుండి ఆ చివరివరకూ తుడిచి నీరు చల్లేవాడు. వేసవిలో అలా నీళ్ళు చల్లడంవల్ల నేల చల్లబడేది.
పిల్లలందరూ అన్నాలు తిని, పుస్తకాలు దగ్గర కాసేపు కునికిపాట్లు పడి పక్కల మీదకి చేరేవారు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ కాలువ దగ్గర ఉన్న రావిచెట్ల ఆకుల గలగల శబ్దాలు వింటూ నిద్రలోకి జారుకునే వాళ్ళం.
ఇంట్లో అందరి మొహాల్లో ఎంతో ఆప్యాయత కనిపించేది. వీళ్ళు వచ్చి ఇలా తిష్ట వేసారే అని ఎవరూ అనుకునేవారు కాదు. వచ్చిన వాళ్ళు అంతా సొంతవాళ్ళు ఎంతో కావల్సిన వాళ్ళు కావడంచేత ఎవరి మనసుల్లోనూ కల్మషం వుండేదికాదు. అంతా ఎంతో కలివిడిగా వుండేవాళ్ళు. ఎంతో ఆప్యాయత, అనురాగాలు వెల్లి విరిసేవి. ఎంతో చేదోడు వాదోడుగా , పనులు పంచుకుంటూ ,హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ వుండేవాళ్ళు. అంతే తప్పించి, వచ్చినవాళ్ళు ఎప్పుడు పోతారా అని ఎవరూ అనుకునేవాళ్ళు కాదు.
రాత్రి భోజనాల కార్యక్రమం అయ్యీక వంట గది మెత్తం ఆవు పేడతో అలికేవారు, బాల్చి నిండా పేడ కలిపిన నీళ్ళుపోసి వరిగడ్డి వుండ చేసి అందులో ముంచి అలికేవారు.
వంటిల్లు అలా అలుకుతున్నప్పుడు ఆడవాళ్ళు వంటిమీద నగలు తీసి ఓ పాత్రలో వుంచి వంటగదిలో ఓ మూల నేలబారున వున్న గోతిలో కప్పెట్టి పైన రోలువుంచి మామూలుగా అలికే వారని జ్ఞాపకం .
బహూశా అప్పట్లో దొంగల భయాలు వుండెవేమో. ఏదిఏమైనా దొంగల వూహకు అందని రహస్య ప్రదేశం అది. రాత్రిళ్ళు నిర్భయంగా నిద్రపోయి తెల్లవారిన తరువాత నగలు బైటికి తీసేవారట!
ఆ రోజులు అలాంటివి.అలాంటి రోజులు మళ్ళీరావు.
ఇంక మా పిల్ల గాంగ్ హడావుడి అంతా ఇంతా కాదు. ఇల్లంతా పరుగులు పెట్టేవాళ్ళం. నానా గందరగోళం సృష్టించేవాళ్ళం. మా అల్లరి భరించలేక మా పెద్దవాళ్ళు” వురేయ్ వెధవల్లారా, బైటకు పోయి ఆడుకోండి అని అరిచేవాళ్ళు. ఇంట్లో మళ్ళీ కనిపించారంటే చింత బరికిచ్చుకుని బాదేస్తాను మా తాత గావు కేకలు వేసేవాడు. దాంతో అంతా కుక్కిన పేనుల్లా పడివుండేవాళ్ళం. మా చిన్న తాతయ్య అంటే అందరికీ హడల్.

(పరకాల సూర్యమోహన్  సీనియర్ జర్నలిస్టు. పూర్వం ఇండియన్ ఎక్స్ ప్రెస్, ది హిందూ పత్రికలలో పనిచేశారు. సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా కవిటం. స్థిరపడింది చెన్నైలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *