కరోనా సాకుతో విద్యాసంస్థలను మూసేయడంలో మతలబు?

(వడ్డేపల్లి మల్లేశము)

గత సంవత్సరం జనవరిలో కరోనా సంకేతాలు భారతదేశంలో వెలువడిన తర్వాత మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం ద్వారా విద్యా సంస్థలను మూసి వేయడం జరిగింది ఆ రకంగా విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోయిన ప్పటికీ ఆన్లైన్ విద్యావిధానం ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా కొనసాగినా ఫలితం అంతంత మాత్రంగానే కనపడింది. కారణం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశము మొత్తం లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించ గలిగిన కుటుంబాల ఇరవై శాతం మించక పోవడమే. దీనిని బట్టి ఎంతమందికి ఆన్లైన్ ద్వారా విద్యా విధాన ప్రయోజనం అందినదో మనం అర్థం చేసుకోవచ్చు.
గ్రామీణ పేద కుటుంబాలలో స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని కుటుంబాలు అనేకం. చివరకు 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వాలు ధైర్యం చేసి పాఠశాలలను ప్రారంభించినప్పటికీ, మళ్లీ కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్నదని చెప్పి రెండు నెలలు సరిగా గడవక ముందే పాఠశాలలను కళాశాలలను మళ్లీ మూసి వేయడం జరిగింది.

మూసివేయడం లోని మతలబు ఏమిటి

తెలంగాణలో రెండు మాసాలైనా కాకముందే అక్కడక్కడా కనపడుతున్న కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు గా విద్యాశాఖ మంత్రి ప్రకటించడం అనేక వర్గాలకు తీవ్ర ఇబ్బంది పెట్టింది.
తిరిగి ప్రారంభమైన ఈ రెండు మాసాలలో కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళ ఫీజులు బలవంతంగా వసూలు చేసుకోవడం జరిగింది. కానీ మామూలు పాఠశాలతో సహా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు సరిగా ఇవ్వకపోగా కొద్దిమందిని మాత్రమే వాడుకుని వాళ్ల ఉపాధికి గండికొట్టారు.

ఆన్లైన్ ద్వారా గానీ ప్రత్యక్ష పాఠశాల ద్వారా గాని విద్యార్థులు చిన్నపిల్లలు నేర్చుకున్నది అతి స్వల్పం మాత్రమే. కానీ ఫీజుల విషయంలో రాజీపడకుండా ఈ సంస్థలు బలవంతంగా వసూలు చేయడాన్ని ప్రభుత్వం నిలువరించ లేకపోయింది.

అయినా సరే ప్రత్యక్ష బోధన ద్వారా కొంత జ్ఞానం అలవడుతుందేమోననే ఆశతో తల్లిదండ్రులు విద్యార్థుల పాఠశాలలకు పంపిస్తే వెంటనే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పిల్లలు ఎటుకాకుండా పోయారు, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోయారు. విద్యాసంస్థలు మూసివేయడం లోని అర్థం ఏమిటి అని ఆలోచించే ముందు ప్రారంభించడం లోని మతలబు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల తదితర శాసనమండలి సభ్యుల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అధికార పార్టీతో సహా రాజకీయ పక్షాలు వారి ప్రచారానికి అనువుగా ఉండడం కోసం విద్యా సంస్థలు తెరిచారనిపిస్తుంది. ఇది పిల్లల మీద ప్రేమతో తీజుకున్న నిర్ణయం కాదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాప్తికి విద్యాసంస్థలు నిజంగా కారణమైనవా?
గత ఒకటి రెండు మాసాలుగా కొంత దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా కనిపించినప్పటికీ దీనికి విద్యా సంస్థలకు విద్యార్థులు రావడమే కారణమని చెప్పడానికి ఆధారాలు అంతగా లేవు. అందువల్ల కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు పాఠశాలలే బాధ్యత వహించాలి అని ఎలా చెప్పగలం. సరైన జాగ్రత్తలతో పాటు, అవసరమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం, వైద్య చికిత్స అందుబాటులో ఉంచడడం, ప్రజారోగ్యం వంటి విషయాలలో ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే మొదటిసారి కరోనా వ్యాపించినప్పుడు అనేక రకాల విమర్శలను ఎదుర్కొన్నారు. తిరిగి అదే రకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు జాగ్రత్తల ద్వారా విద్యార్థులకు తగు పోషకాహారాన్ని అందించడం కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయిం చడం ద్వారా అవసరమైతే ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పడం ద్వారా రుగ్మతలను ఎదుర్కోవాలి కానీ, వ్యక్తి వికాసానికి, జాతి నిర్మాణానికి దోహదపడే విద్యాసంస్థలను మూసివేయడం ద్వారా నేటి తరం విద్యార్థులకు ఎంత నష్టం చేస్తున్నారో ప్రభుత్వాలు ఆలోచించాలి.

గత సంవత్సరం కూడా లాక్డౌన్ విధించిన తర్వాత తొలిసారిగా పున: ప్రారంభించింది పాఠశాలలనుకాదు, మద్యం దుకాణాలను, హోటళ్లను. తాము ప్రజలకు అందించిన రాయితీలను ముక్కుపిండి తిరిగి వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించి మద్యం దుకాణాలను, హోటళ్లను ప్రారంభించి కరోనా వ్యాప్తికి ప్రభుత్వాలే కారణమైన విషయాన్ని మరిచి పోయినారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులను తిరిగి ప్రారంభించిన తర్వాత జనం రద్దీని నియంత్రించడానికి ఉపాధ్యాయులను వాడుకున్న కీర్తి పక్క తెలుగు రాష్ట్రం దక్కించుకుంటే, తెలంగాణ రాష్ట్రము తానేమీ తక్కువ కాదన్నట్లు మద్యం షాపుల ముందు పోలీసు పహారా ను ఏర్పాటు చేసి పోలీసు రక్షణతో రద్దీని నియంత్రించింది. తమకు కరోనాతో సంబంధం లేదని కావలసింది ఆదాయం మాత్రమేనని ప్రభుత్వం రుజువు చేసుకుంది. ఈ చరిత్రను అంత తొందరగా మరిచిపోగలమా?

పాఠశాలలకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చినంత మాత్రాన అక్కడ కరోనా వ్యాప్తి జరుగుతుందని ప్రభుత్వం- వైద్య శాఖ భావిస్తే మార్కెట్లు, మద్యం షాపులు, బార్లు, రెస్టరాంట్లు, మాంసాహారం దుకాణాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, ఫంక్షన్ హాళ్లు, వందలు వేల అతిధులతో ఇళ్లల్లో కూడా జరుగుతున్న విందు వినోదాల సంగతి ఏమిటి?
ఒక తరం విద్యార్థులు నష్టపోతే ఆ నష్టం భర్తీ చేయలేనటువంటిది. విద్యార్థులు నష్టపోకుండా చూడడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నతల్లిదండ్రుల పక్షాన నిలబడి వారి ఫీజులను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేయాలి, లేదా ఫీజులను నియంత్రించాలి. లేదా నామమాత్రపు ఫీజు కు ప్రైవేటు సంస్థలను ఒప్పించాలి. అంతేకానీ విద్యాసంస్థలను వివిధ కారణాల నేపథ్యంలో రద్దు చేయడం లేదా మూసివేయడం తగదు.

(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, మొబైల్ నెం. 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *