కరోనా తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత, ఎవరీ సత్య ప్రభ?

(చందమూరు నరసింహారెడ్డి)
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె సత్యప్రభ గురువారం రాత్రి బెంగళూరు లో కన్నుమూశారు.
ఆమె వయసు 70 సంవత్సరాలు. కరోనా వైరస్ బారినపడిన సత్యప్రభ గత నెల 10వ తేదీ నుంచి బెంగళూరులోని తన సొంత ఆసుపత్రి అయిన వైదేహీలో చికిత్స పొందుతున్నారు.
ఈ నెల 3న ఆరోగ్యం మరింత దిగజారడంతో
వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం శూన్యం.
గత రాత్రి పరిస్థితి మరింత దిగజారడంతో తుదిశ్వాస విడిచారు.
చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951సెప్టెంబర్21నజన్మించారు.మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు.
టిడిపికి ఎపుడూ అన్నింటా కొండంత అండగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థుడు,  తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు (TTD)బోర్డు ఛెయిర్మన్ , ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు భార్య.
 సత్య ప్రభతో పెళ్లి నాటికి ఆయన చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీలో ఇంజనీర్. వివాహం అనంతరం పారిశ్రామిక వేత్త గా ఎదిగారు.
అనంతరం కాంగ్రెస్ లోచేరారు. కాంగ్రెస్‌లో మంచి పలుకుబడి ఉన్న నాయకుడిగా ఎదిగారు.
ఆ తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ అయన పెద్ద పీట వేశారు. ఆయన 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు.
2013లో అనారోగ్యంతో ఆయన మృతి చెందిన తర్వాత సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2019లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు.ఇటీవలే ఆమెను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు గా ఎంపిక చేశారు. ఒక కొడుకు,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
డికె కుటుంబం చంద్రబాబు నాయుడి జిల్లా చిత్తూరు చెంది ఉండటం, పారిశ్రామిక కుటుంబం కావడంతో  టిడిపి ఆయనను వదులుకోలేదు. డికె మీద ఎన్ని విమర్శలొచ్చినా టిటిడి ఛెయిర్మన్ పదవి రెండో సారి ఇచ్చారు. అంతేకాదు, ఆయన మరణానంతరం భార్య ను ఎమ్మెల్యే చేవారు. అంతేనా, ఇపుడామె ఏకంగా పార్టీ జాతీయఉపాధ్యక్షురాలు హోదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *