రేపు తెలంగాణ గల్ఫ్ బాధితుల మిత్రుడు పుసులూరి విగ్రహావిష్కరణ

గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు, అసంఘటిత కార్మికుల  సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసిన పుసులూరి నారాయణ స్వామి విగ్రహాన్ని రేపు ఆవిష్కరిస్తున్నారు.
విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం చింతకుంట మండలం తిమ్మాపూర్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు వర్చ్యువల్ గా నవంబర్ 21, శనివారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరిస్తున్నారు.
గత జులై 18న ఆకస్మికంగా ఆయన మృతిచెందారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎవరైనా గల్ఫ్ దేశాలలో అక్రమ నిర్బంధంలో ఉన్నారని తెలిసినా, ఇతరత్రా జీవనోపాధి సమస్యలను అక్కడ ఎదుర్కొంటున్నారని తెలిసినా వెంటనే ఆయా దేశాలలోని భారత రాయబారి కార్యాలయాలను సంప్రదించడం, భారత ప్రభుత్వంలోని సంబంధిత అధికారులను మేల్కొల్పే ప్రయత్నం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే కృషి చేయడం చూస్తూ ఉండేవారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిని పుసులూరి నారాయణ స్వామి
 ఆయన ఒక పేద కుటుంభంలో ఆగష్టు 15, 1959న జన్మించారు. యువకుడిగానే పలు ప్రజా ఉద్యమాల్లో, విప్లవ సంఘాలలో క్రియాశీలకంగా పనిచేశారు.
కొండపల్లి సీతారామయ్య స్పూర్తితో అనేక ప్రజా సంఘాలలో పనిచేశారు. పీయూసీఎల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి పలు హక్కుల సంఘాలలో కూడా పనిచేశారు.
హక్కుల ఉల్లంఘనలపై పలు నిజనిర్ధారణ కమిటీలలో పాల్గొనడమే కాకూండా హైకోర్టు, సుప్రీం కోర్ట్ లలో పలు కేసులు వేశారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి పలు అంతర్జాతీయ సంస్థలలో కూడా హక్కుల పరిరక్షణకోసం కృషి చేశారు. పలు సార్లు గల్ఫ్ దేశాలలో పర్యటనలు జరిపి అక్కడ ఆపదలో ఉన్న కార్మికుల పక్షాన నిలబడి, మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక తీసుకు వచ్చారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చట్టాలు తీసుకు రావడానికి కృషి చేశారు.
పాలమూరు కాంట్రాక్టులేబర్  యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడాయన. దానిని తర్వాత పాలమూరు మైగ్రంట్ లేబర్ యూనియన్ గా మార్చారు. దీనిద్వారా వలస కార్మికుల జీవనోపాధులు కాపాడటం కోసం విశేషంగా కృషి చేశారు. కరోనా సమయంలో సహితం వలస కార్మికుల సంక్షేమం కోసం విస్తృతంగా కృషి చేశారు.
బాలికల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా 1997లో ఆయన ఏపీ హైకోర్టు లో దాఖలు చేసిన ప్రజావాజ్యంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి అభాగ్య బాలికలను ఆదుకోవడంకోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి, చట్టాలు తీసుకు రావడానికి దారితీశాయి.
నారాయణస్వామి వేసిన కేసులోని ఎన్కౌంటర్ లు జరిపిన వారిపై ఐపీసీ 302 క్రింద హత్యానేరం మోపి విచారణ జరపాలని ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
1996లో గోదావరిఖని లో పోలీసుల ఎన్కౌంటర్ లో రమాకాంత్ రెడ్డి చనిపోయిన సంఘటనపై ఆయన ఈ కేసును దాఖలు చేశారు. అప్పటి నుండి జాతీయ మానవహక్కుల కమీషన్ సహితం ఎన్కౌంటర్ హత్యలకు పోలీసులను బాధ్యులను చేస్తూ వస్తున్నది.
కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు  ఆయనను `శ్రమశక్తి’ పురస్కారంతో సత్కరించారు. నారాయణస్వామి శ్రీమతి జయ వింధ్యల సహితం పౌరహక్కుల ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పీయూసీఎల్- తెలంగాణకు ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్మికవిభాగం తెలుగునాడు కార్మికసంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2002 నుండి 2004 వరకు జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *