Home Breaking ఉపిరాడక ఉక్కిరి బిక్కిరయిన విశాఖ; ఎల్జీ నుంచి గ్యాస్ లీక్, విశాఖకు జగన్

ఉపిరాడక ఉక్కిరి బిక్కిరయిన విశాఖ; ఎల్జీ నుంచి గ్యాస్ లీక్, విశాఖకు జగన్

589
0
విశాఖపట్నం గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురం ఈ తెల్ల వారు జామున ఉపిరాడక ఉక్కిరిబిక్కిరయింది. కొంతమంది ప్రజలు సృహ కోల్పోయారు. కొందరికి చర్మం మీద దద్దులు వచ్చారు. నిద్రమత్తు విదిలించుకుని చాలా మంది ప్రాణభయంతో పరిగెత్తారు. అంబులెన్సలొచ్చి చాలా మంది ఆసుప్రతులకు తరలించాయి. కారణం: అక్కడి ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఇది సుమారు 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలలో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
లీకయిన ట్యాంకులో రెండువేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉండింది. మరొక ట్యాంక్ లో మూడు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. అయితే, లీకయిపుడు గ్యాస్ నిప్పంటుకోలేదు.ఎందుకంటే, లీకయిన స్టైరీన్ గ్యాస్ దహశీల వాయువు. నిప్పంటుకుని ఉంటే పేలుడు భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని కొంత మంది అధికారులు చెప్పారు.
అస్వస్థతకు లోనయిన వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ప్రత్యేక విమానంలో కొద్ది సేపట్లో విశాఖ వెళ్లున్నట్లు సమాచారం అందింది.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దీనితో ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

విశాఖ గ్యాస్ లీక్, పరిస్థితి అదుపులోనే ఉంది: మంత్రి గౌతమ్ రెడ్డి

అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్‌.ఆర్‌. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

విశాఖ గ్యాస్ లీక్, పవన్ కల్యాణ్ స్పందన

200 మంది అస్వస్థతకు గురయ్యారు: కలెక్టర్‌
‘‘ఎల్‌.జీ పాలిమర్స్‌ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. యంత్రాలను ప్రారంభిస్తున్నపుడు నిప్పురవ్వులు వెలువడి ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున ప్రజలంతా నిద్రస్తున్న పుడు దాదాపు  3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్‌ వాయువు లీకైందని అధికారులు చెబుతున్నారు.
ఈ సమాచారం 4.30గంటలకు మాకు స అందింది. లీకైన గ్యాస్‌ వల్ల ప్రాణ నష్టం ఉండదు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్‌ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆక్సిజన్‌ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నామని ఈ ఉదయం కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
‘‘ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం’’ అని జిల్లా కలెక్టర్‌  తెలిపారు.
పశువుల మృతి
ప్రాణభయంతో పరిగెత్తుతూ గంగరాజు అనే వ్యక్తి ప్రమాద వశాత్తు బావిలో పడి మరణించినట్లు ఈనాడు వెబ్ సైట్ రాసింది. ఈ కథనం ప్రకారం పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలమీద గ్యాస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇక్కడ ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు కూడా నేలకొరిగాయి. వందలాది పశువులు మృతిచెందాయని సానికులు చెప్పినట్లు ఈ వెబ్ సైట్ రాసింది.
చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
★ పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆవేదన చెందారు.”ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరం.  మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయి. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలి. చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శనం. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలి. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరం. బాధితులను తక్షణమే ఆదుకోవాలి. అత్యున్నత వైద్య సాయం అందించాలి★ సహాయ చర్యలను వేగిరపర్చాలి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.” అని ఆయన విజ్ఞప్తి చేశారు.