వరంగల్ పద్మాక్షి గుండాన్ని శుభ్రం చేస్తున్న మాజీ నేవీ ఉద్యోగి ఫణీంద్ర

వరంగల్ నగరంలో కోనేరు ఫణీంద్ర సంచలనం. ఇటీవలే నగరానికి వచ్చిన కోనేరు ఫణీంధ్ర పద్మాక్షి గుండం  చెరువును శుభ్రం చేసేందుకు పూనుకున్నారు. తనకు మరొకరు తోడున్నారా లేదా అనేది ఆయన చూడరు. తనా మంచి అనుకున్నపనిని పూర్తిచేసేందుకు కృషి చేస్తారు.  ఆయన మాజీ నేవీ ఉద్యోగి.  ప్రజలు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని భావిస్తారు. పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, అది మన ప్రగతికి కొలబద్ధ అని ఆయన భావిస్తారు.  అయితే, ఇలా ఉపన్యాసాలిస్తూ కూర్చొరు. కార్యరంగంలో కి దూకి తానుచేయాల్సింది చేసేసి వెళ్లిపోతుంటారు.

ఆయన భార్య అనూష కూడా సోషల్ వర్కర్. ఆమె ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులలో చదువు గురించి ఇంగ్లీష్ గురించి ఉన్న అపోహలను, భయాలను పోగొట్టి వాళ్లలో ఆత్మస్థయిర్యం పెంపొందించేందుకు కృషి చేస్తుంటారు.

ఇక ఫణీంద్ర ‘వన్ మన్ ఆర్మీ’. పర్యావరణ పరిరక్షణకు కోసం ఆయన తన సమయంలో కొంత కేటాయించుకుంటారు.  ఎవరైన తనకు తోడు వస్తే కలసి పోతాడు. లేదంటే ఒంటరిగానే ఆయన తన పని తాను చేసుకుపోతుంటాడు. గతంలో ఆయన బాలసముద్రం పార్క్  డంపింగ్ యార్డ్ గా మారిపోవడం చూసి  దానిని శుభ్రం చేసేందుకు పూనుకున్నారు. అపుడు ఒక అధికారి కూడా ఆయనకు చేయూతనిచ్చారు. అయితే, ఆయన బదిలీ అయిపోయారు.   తన కార్యక్రమాలను రైజ్ అప్  ఫౌండేషన్ (RiseUP Foundation) పేరు  మీద చేస్తుంటారు.

కోనేరు ఫణీంద్ర

పద్మాక్షి గుండం అధ్వాన్న స్థితి ఆయన కంట పడింది. అంతే, తన వంతుగా ప్రక్షాళనకు పూనుకున్నారు.  కాలనీ వాసులు పద్మాక్షి గుట్ట వాకర్స్ అభినందిస్తున్నారు. “పర్యవరణ పరిరక్షణ, పరిసరాలను శుభ్రంగా ఉంచడం కోసం పనిచేస్తాను. మరొకరి కోసం నేను ఎదురుచూడను. నేను ఒంటిరిగానే పని ప్రారంభిస్తాను. అపుడుపుడు నన్ను చూసి కొంతమంది వచ్చి చేరతారు. కొన్ని సార్లు చూసిపోతారు తప్ప పనిలో కలవరు. దీనితో నేను నిరుత్సాహపడను. నా పని నేను చేస్తుంటాను. పరిసరాలను పరిరక్షించుకోవడంలో పౌరుడిగా నాబాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను,’ అని ఆయన ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’  చెప్పారు. ఆయన తో స్థానికులు,యువకులు కూడా వరంగల్ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉద్యమంలాగా ప్రయత్నించాల్సి ఉంది.

ఇదిఇలా ఉంటే, వరంగల్ పౌర స్పందన వేదిక ఈ చెరువు ఇలా మురికి కూపంగా మారిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఈ  విషయం గురించి అధికార్లకు  పలుమార్లు తెలియజేసినా ఉలుకు పలుకు లేదని పౌర స్పందన వేదిక సమన్వయ కర్త నల్లెల రాజయ్య తెలిపారు.

హన్మకొండ నగరం నడి మధ్యలో గల చారిత్రాత్మకమైన పద్మాక్షమ్మ గుండం కాలుష్యకారకాలైన ప్లాస్టిక్ వ్యర్థాలు ,పూజలు ,పిండ ప్రదానాల చెత్త, చెదారంతో నిండి పోయి కంపు వాసన గొడుతూ ఉంటుంది.  నిజానికి ఇది కొలనా లేక  మరో డంపింగ్ యార్డు అనేటట్లు అక్కడి వాతావరణ ఉంటుంది. ఈ పరిస్థితి వల్ల నగరానికి మచ్చలాగా తయారయిందని నల్లెలరాజయ్య అన్నారు.

ఫణీంద్ర స్వయంగా ఒంటరిగా ప్రక్షాళనకు పూనుకోవడాన్ని ప్రస్తావిస్తూ,’గ్రేటర్ మున్సిపల్ అధికారులు కూడా ఇపుడు పద్మాక్షి గుండం ప్రక్షాళన చేపట్టాలి. ఈ చెరువును కాపాడుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి,‘ అని   రాజయ్య విజ్జప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *