‘ముద్ర’ రుణాలలో తెలంగాణ పట్ల వివక్ష: నిర్మలా సీతారామన్ కు వినోద్ లేఖ

‘ ప్రధాన మంత్రి ముద్ర రుణం ‘ పథకం కింద రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వినోద్ కుమార్ రేఖ రాశారు.

ఈ రుణాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదని అంటూ రాష్ట్రంలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వేలాది మందికి ముద్ర రుణాలు అందడం లేదని, నిరుద్యోగులకు కనీస మాత్రంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన తెలిపారు.

ముద్ర రుణాలు ఇవ్వడానికి వివిధ బ్యాంకులు చొరవ చూపడం లేదని, కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం నాటికి కేవలం 10.62 శాతం రుణాలు మాత్రమే ఇచ్చారని, దేశ యావరేజ్ 17.86 శాతం ఉందని ఆయన తెలిపారు.

దేశ వ్యాప్తంగా యావరేజ్ గా 24 కోట్ల 48 లక్షల 25 వేల మందికి రుణాలు మంజూరు చేయగా, తెలంగాణ రాష్ట్రానికి కేవలం 40,90,600 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేశారని వినోద్ కుమార్ వివరించారు.

తెలంగాణ జనాభా ప్రాతిపదికన కనీసం 68 లక్షల మందికి ముద్ర రుణాలు మంజూరు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 40 లక్షల 90 వేల మందికి మాత్రమే రుణాలను ఇచ్చారని ఆయన తెలిపారు. మిగిలిన ఇంకా 28 లక్షల మందికి తక్షణమే ముద్ర రుణాలను వెంటనే మంజూరు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

ముద్ర రుణాలపై రాష్ట్రంలోని బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్ధేశించి అమలు చేయాలని, అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముద్ర రుణాల మంజూరులో విస్తృతంగా ప్రచారం కల్పించి బ్యాంక్ ల ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని, కనీసం 10 లక్షల రూపాయల రుణాలను ఇవ్వాలన్న ప్రాథమిక నిబంధనను అమలు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *