‘అమూల్’ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వప్పందం

అమరావతి: రాష్ట్రంలో  పాడిపరిశ్రమ  రైతులకు అదనపు ఆదాయాల రూపంలో మేలు చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తూ ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకారార రంగాన్ని  బలోపేతంచేయడంతోపాటు, రైతులకు మంచి ధర వచ్చేలా చూసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
జులై 15 లోగా ఈమేరకు ‘అమూల్‌’తో అవగానా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రి  వైయస్‌.జగన్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధి, పాడిరైతుల సమస్యలు, పాల ఉత్పత్తుల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాడి రైతులు మేలు జరగాలని, వారు ఉత్పత్తిచేస్తున్న పాలకు మంచి రేటు రావాలని స్పష్టంచేశారు. ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూదనన్నారు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలన్నారు. పాడిపరిశ్రమలో అమూల్‌కున్న అనుభవం రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడాలని, పాడిపశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు… ఇలా అన్ని అంశాల్లోనూ పాడిపరిశ్రమరంగం పటిష్టంకావాలన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అమూల్‌తో కలిసి అడుగులు ముందుకేసేలా… తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడిపరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్‌కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికీ, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
‘అమూల్‌’తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చించి విధివిధానాలు ఖరారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. జులై 15లోగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు వెల్లడించారు.