APPSC రిక్రూట్ మెంట్ క్యాలెండర్ ఎక్కడ? : ఆంధ్ర నిరుద్యోగులు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తుత్తి ఉద్యోగాలు చూపి నిరుద్యోగులను మభ్యపెడుతున్నదని అనంతపురం బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి విమర్శించింది.

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసి మిగతా ఉద్యోగాల విషయాన్ని విస్మరించడం పట్ల బిసి ఆర్పీస్ విస్మయం వ్యక్తం చేసింది.

ఉద్యోగాల రిక్రూట్ మెంటు జాప్యం అవుతున్నందున యువకులు, కుటుంబాలు చాలా నష్టపోతున్నాయని, మానసిక ఆందోళనకు గురవుతున్నాయని సమితి పేర్కొంది. ప్రభుత్వంలోని ఖాళీలను పూరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాననేది  ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానమనే విషయాన్ని విస్మరించరాదని వారు పేర్కొన్నారు.

రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించారు.

అనంతరం బీసీఆర్పీస్ రాష్ట్ర అధ్యక్షులు సాకేనరేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించిందని వ్యాఖ్యానించారు.

‘ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ అకడమిక్ క్యాలండర్ విడుదల చేసి దాని ద్వారా గ్రూప్ 1,గ్రూప్ 2,గ్రూప్ 3,గ్రూప్ 4,ఎస్సై, కానిస్టేబుల్ మరియు ఇతర శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఉరూర చెప్పారు.  ఎన్నికల క్యాంపెయిన్ లో చెప్పారు. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించారు.  ఇంతవరకు క్యాలండర్ విడుదల చేయకుండా నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మభ్యపెడుతున్నారన్నారు,’ అని  ఆయన విమర్శించారు.

ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశ గా ఎదరుచూస్తూ  కోచింగ్ లకు  లక్షల రుపాయలను  ఖర్చు చేస్తూన్నారు. వీరెవరూ సొంతవూర్లకు వెళ్లకుండా పట్టణాలలోనే  ఉండాల్సి వస్తున్నది. దీని వల్ల కుటుంబాల మీద ఆర్థిక భారపెరుగుతూ ఉంది. మరొక వైపు వయోపరిమితి దాటి పోతుందని చాలా   మంది ఆందోళన చెందుతున్నారు. పెళ్లి చేసుకోకుండా నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారు. కుటుంబాలను సంక్షోభంలో పడేయకుండా నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళ చేస్తాం,’ అని  బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ,ఉపాధ్యక్షుడు చలపతి , సహాయ కార్యదర్శి లక్ష్మి పతి నాయక్ , అశోక్ , కార్తిక్ నాయుడు ఆవుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *