కాంగ్రెస్ కు చికిత్స చేస్తా, తన కాడ మాంచి మందుందంటున్న జగ్గారెడ్డి

(ప్రశాంత్ రెడ్డి)
తెలంగాణ కాంగ్రెస్ ను పటిష్టం చేసే మందు తన దగ్గిర ఉందని, కాంగ్రెస్ అధిష్టాం ఒక అవకాశం ఇస్తే ఈ మందు వాడి పార్టీని  బాగుచేసే ప్రయత్నం చేస్తానని  సంగారెడ్డి ఎమ్మెల్యే, దేన్నయినా నిర్మొహమాటంగా మాట్లాడే జగ్గారెడ్డి అన్నారు.
ఈ రోజు గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ తానూ పిసిసి అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నానని ప్రకటించారు.
‘ అవును, పిసిసి లీడర్షిప్ తప్పక మార్చాలనుకుంటే నాపేరు పరిశీలించండి అని హైకమాండ్ ను అడిగాను.అవకాశం ఉంటే నాకు కూడా
పీసీసీ అధ్యక్ష పదవి  ఇవ్వాలని ఎఐసిసి తెలంగాణ ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి కుంతియాను కోరాను.  నేను ఎవ్వరికీ పోటీ కాదు. ఇది నా అభిప్రాయం. నా కోరిక మాత్రమే,’ అని జగ్గారెడ్డి చెప్పారు.
జగ్గారెడ్డి అసలుపేరు తూర్పు జయప్రకాశ్ రెడ్డి. అయితే, ట్రేడ్ మార్క్ గెడ్డం గెటప్ లో జగ్గారెడ్డిగానే జనంలో పాపులర్.
ఇపుడు తెలంగాణలో బాగా చర్చల్లో నలుగుతున్న పిసిసి అధ్యక్ష పదవి రేస్ గురించి వివరాలిస్తూ,  ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పీసీసీ గా కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.
‘మున్సిపల్ ఎలక్షన్ లు , హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక ఉన్నది. ఇలాంటపుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పిసిసి అధ్యక్సుడిగా కొనసాగించాలి. అది చాలా అవసరం. ఒక వేళ పీసీసీ నాయకత్వాన్ని  మార్చాలనుకుంటే అధిష్టానం ఇష్టం. ఇపుడు సమర్థులయిన నాయకులంతా  పీసీసీ కి పోటీపడుతున్నారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రేవంత్ రెడ్డి,దామోదర రాజనర్సింహ, సంపత్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీలు రేసులో అన్నారు. వీరంతా సమర్థులే అనే విషయంలో అనుమానం లేదు.
మాది ప్రాంతీయ పార్టీ కాదు. మాకు హీరో లు ఎక్కువ గా ఉన్నారు. ప్రాంతీయ పార్టీ లో ఒక్కడి కంటే ఎక్కువ హీరో లుకనిపించరు,’ అని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని,  ఈ సారి మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని జగ్గారెడ్డి అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల మీద వ్యాఖ్యానిస్తూ,  ప్రజలు మార్పు కోరుకున్నారు.  మమ్ముల్ని ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నారు, అందుకే మా వాళ్లు ఓడిపోయారని ఆయన అన్నారు.
గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలంటే పీసీసీ అనుమతి అవసరమని నియమం పెట్టడం మంచి పద్ధతి, ఇది మంచి సంప్రదాయమని ఆయన అన్నారు.
తాను  కాంగ్రెస్  ఆర్గనైజేషన్ ను కాపాడడానికి పని చేయాలని నిర్ణయించుకున్నారని, పార్టీ  అధికారంలోకి వస్తే కనీసం మంత్రి పదవి కూడా అడగనని ఆయన స్పష్టం చేశారు.
‘మేము బలంగా ఉన్నామ్, మా బలం రాష్ట్ర ప్రజలకు తెలుసు. పార్టీ బలోపేతం కావాలంటే కేసీఆర్ ను బీజేపీని తిట్టాల్సిన అవసరం లేదు.
నాకు పీసీసీ ఇవ్వండి నాదగ్గర మెడిసిన్ ఉంది.మొత్తం మార్చుతా అధికారంలోకి తీసుకువస్తా,’ అని ఆయన నొక్కి చెప్పారు.