ఆర్టీసి హీరో మహీపాల్… కులవృత్తి కైనా రెడీ, సమ్మెను వదలనంటున్న కండక్టర్

రాజీలేదు…డ్యూటీలో చేరను…  కులవృత్తిలోకి వచ్చిన ఆర్టీసి కండక్టర్…
ఆర్టీసీ ప్రయివేటు పరం కాకుండా కాపాడుకునేందుకు 48 వేల మంది కార్మికులు చేస్తున్న సమ్మె చారిత్రాత్మకంగా తయారయింది. జీతాలు రాకపోయినా, ప్రభుత్వం ఎన్నిరకాలుగా బెదిరించినా కార్మికులు బెదరడం లేదు.
పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు గాని, భయపడి పారిపోలేదు. ఒక నెల జీతం రాకపోతే, జీవితం తలకిందులయ్యే వారు ఆర్టీసి సిబ్బంది లో కనీసం 80 శాతం పైబడే ఉంటారు.
ఇలాంటి వాళ్లుంటారని, వాళ్లు ఈజీతాల్లేక పోతే బతకలేరని,బెదిరిస్తే,   సమ్మె వొదిలేసి  పోలోమని డ్యూటికి  వస్తారనే ముఖ్య మంత్రి కెసిఆర్ రెండు సార్లు డెడ్ లైన్ పెట్టారు.
ఉద్యోగాలు డిస్మిస్ అన్నారు. కాదు, సెల్స్ డిస్మసల్ అన్నారు. డెడ్ లైన్ లోపు రాకపోతే, ఆర్టీసి రూట్లన్నీ ప్రయివేటు వాళ్లకిస్తానన్నారు. ఇకచర్చల్లేవు, ఉద్యోగాల్లేవు పో అన్నాడు.
ఒకరిద్దరు సమ్మె వదిలేసి వస్తే దానిని భూతద్దంలోనుంచి చూపించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక అఖండ విజయం చూసి ఆర్టీసి వాళ్లు భయపడతారనుకున్నారు.  అయినా సరే ఎవరూ సమ్మె వదల్లేదు.
చివరకు తమ వూర్లకు పోయి, మళ్లీ కులవృత్తి చేసుకుని బతుకుతాము కాని కెసిఆర్ మాట విని సమ్మెవదిలేదంటున్నారు. ఒక ముఖ్య మంత్రికి ఇంతకంటే పరాభవం ఉంటుందా?
ఇలా ముఖ్యమంత్రిని లెక్క చేయకుండా సమ్మెను కొనసాగిస్తూ బతుకు దెరువు కోసం కూలి పనులకు పోతున్న వారెందరో ఉన్నారు.
వాళ్లలో మహీపాల్ ఒకరు.మహీపాల్ ఈ రోజు ఆర్టీసి హీరో.
ఎందుకంటే, ఆయన అనుకుంటే, చక్కగా డిపోలోకి వెళ్లిపోయి డ్యూటీ లో చేరి ఉండవచ్చు. అపుడు ఆయన ఫోటో పేపర్లలో వస్తుంది. వాట్సాప్ లో  షేర్ అవుతుంది. బైట్ టివిలలో వస్తుంది. జీతమూ వస్తుంది.
అయితే, మహాపాల్ ఆ పని చేయలేదు.
కులవృత్తి క్షరక వృత్తి చేసుకుని ఆత్మగౌరవంతో బతుకుతాను గాని, నలభై రోజలు సమీపిస్తున్నసమ్మెకు వెన్నుపోటు పొడవలేనంటున్నాడు.
మహీపాల్ మళ్లీ సెలూన్ లోకి ప్రవేశించి కత్తెర పట్టాడు. హేర్ కట్ చేస్తుున్నాడు. తను ఆర్టీసి కండక్టర్ కాక ముందు సెలూన్ లోనే పనిచేసేవాడు. కండక్టరయ్యాక కుల వృత్తి వదిలేశాడు. ఇపుడు ఆర్టీసీ సమ్మె వల్ల జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కుటుంబ పోషణ కోసం తనకు తెలిసిన విద్య కత్తెర పట్టడం. దానికి సిగ్గపడాల్సిన పనిలేదు. అందుకే మళ్లీకత్తెర పట్టాడు. ఇదీ తెలంగాణ ఆత్మగౌరవమంటే.
మరో నెల జీతం కూడా రాలేని పరిస్థితుల్లో.. చేసేది లేక కుటుంబ పోషణ కోసం మహీపాల్ గౌరవ ప్రదమయిన మార్గం ఎంచుకున్నాడు,
టివి9 తెలుగు లో వచ్చిన నివేదిక ప్రకారం నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహీపాల్ గతంలో సెలూన్ నిర్వహించేవాడు. అనంతరం 2009లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగం రావడంతోయకులవృత్తిని పక్కకు పెట్టాడు. ఆర్టీసీ సిబ్బందిలో ఒక భాగమయ్యాడు.
కానీ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో యూనియన్లు నిరవధిక సమ్మె చేయడంతో మహీపాల్ సమ్మె బాట పట్టాడు. ప్రభుత్వం జీతం బంద్ చేసింది.
స్ట్రైక్ కారణంగా రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఇంతవరకు సఫర్ అయ్యాడు.
దీంతో ఆయన ఎటువోవాలో కచ్చితమయిన నిర్ణయం తీసుకున్నాడు. డిపో వైపు కాకుండా తన కులవృత్తి సెలూన్ వైపు నడిచాడు.  మహీపాల్ మళ్లీ కత్తెర పట్టాడు. ఆత్మగౌరవం చాటుకున్నాడు
అటు సమ్మెలో పాల్గొంటూనే.. ఇటు కుటుంబపోషణ కోసం కులవృత్తి చేస్తున్నాడు.

(Feature Photo TV9Telugu)