చిత్తూరు జిల్లాను విస్మరించారనడం సరికాదు : డా. అప్పిరెడ్డి

(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి) తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సమావేశంలో చిత్తూరు జిల్లా నీళ్ళకై చేసిన  కీలక తీర్మానాలు మీద చర్చ
సీనియర్ పాత్రికేయులు  శంకరయ్య  7 జనవరి 2020 న తిరుపతి లో కొనసాగిన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సమావేశంలో చిత్తూరు జిల్లా నీటి విషయంపై తీర్మానాలలో పేర్కొనలేదని ప్రచారం చేయడం సమంజసం కాదు.

రాయలసీమ అంటూ చిత్తూరు జిల్లాను విస్మరిస్తున్నారు: శంకరయ్య

తీర్మానాలు పరిశీలించకుండానే ఒక నిర్ణయానికి వచ్చారని అనిపిస్తుంది.
1. విభజన చట్టం 11 వ షెడ్యూల్డ్ లో పేర్కొన్న ప్రాజక్టులు అంటే హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ లను పూర్తి చేసి నీటిని కేటాయించాలని చాలా స్పష్టంగా తీర్మానం చేసారు. అంటే గాలేరు నగరి, హంద్రీనీవా చిత్తూరుకు సంబంధం లేదని మీ అభిప్రాయమా? .
2. కడప, చిత్తూరు మెట్ట ప్రాంతాలలో 30 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పించాలని తీర్మానం చేసారు. కష్టకాలంలో మెట్టకు రక్షక తడులు ఇవ్వాలని తీర్మానం చేసారు. ఇది చిత్తూరు కు సంబంధించినది కాదా?

 రాయలసీమ  ప్రజాసంఘాల వేదిక తీర్మానాలు ఇవే

3. హంద్రీనీవా ను 33 వేల క్యూసెక్కులకు, పోతిరెడ్డిపాడు ను 75 వేల క్యూసెక్కులకు పెంపొందించాలని తీర్మానం చేసారు. అంటే ఇవి చిత్తూరుకు సంబంధించినవి కావా?
4.సాంప్రదాయ నీటివనరులు, చెరువులు, సామజిక అడవులు తదితర పనులు చేపట్టాలని తీర్మానం చేసారు. ఇవి చిత్తూరు కు సంబంధమేకదా?
5. ఒక చిత్తూరే కాదు… ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం తెలంగాణ లోని నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి కరువు ప్రాంతాలకు కూడా న్యాయం చేయమని వేదిక తీర్మానం చేసింది.
స్పష్టంగా ఇన్ని అంశాలు నీటి విషయంగా కనిపిస్తున్నా ఎందుకు అలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. సూచనలు చేయచ్చు, అభిప్రాయ బేధాలు ఉండచ్చు అందరం కలసి సీమకోసం పని చేద్దాం. కలవకపోయిన ఎవరి వంతు వాళ్లు కృషి చేద్దాం. ఒక మహత్తర ఆశయం కోసం ఎవరు పని చేసినా మనం చేదోడు వాదోడుగా నిలుద్దాం.
డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి.
మరొక స్పందన
శంకరయ్య లేవనెత్తిన అభ్యంతరానికి మరొక రాయసీమ యాక్టి విస్టు కామినేని వేణుగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన స్పందన ఇది. ‘నిజమే శంకరయ్య గారూ మా జిల్లాల నుంచి వచ్చిన వాళ్లకు పూర్తి అవగాహన లేక..మీ జిల్లా నుండి వచ్చిన ప్రతినిధులు సరిగ్గా ప్రస్తావించక పోవడంతో జరిగి వుండవచ్చు.. అయినా అన్నీ తెలిసిన మీరు సమావేశానికి హాజరయ్యారా.పోక పోతే ఎందుకు పోలేక పొయ్యారు.. తెలుపగలరు ..అయినా ఈ సభలూ సమావేశాలు. సమష్యాలను పరిష్కరిస్తాయో లేదో మీకు బాగా తెలుసు మీ చిత్తూరు జిల్లాలోని ఎంపీ లు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు .సీఎం కు రెప్రజెంట్ చేసి కావాలని గట్టి పట్టు పడితే కావంటారా… ఆ దిశగా ప్రయత్నించే వ్యక్తి లేదా సమూహం అవసరం.’