రాయలసీమ అంటూ చిత్తూర్ జిల్లాను విస్మరిస్తున్నారు

(వి. శంకరయ్య*)
రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సమావేశం తిరుపతిలో మంగళ వారం నిర్వహించారు. ఇదివరలో కూడా రాయలసీమ జిల్లాల నుండి రైతు నాయకులు మా జిల్లాలో సమావేశాలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ దఫా మాత్రం రాజధాని రగడ రేగిన పూర్వరంగంలో సమావేశం నిర్వహించారు. అందుకు చెంది తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల అంశం జోలికి నేను వెళ్లడం లేదు.అది తేనె తుట్టెను గడిపి నట్లు వుంది. ఆ అంశం మరొక మారు.
ఈ సందర్భంలో సాగు నీటి పథకాలకు చెంది కూడా తీర్మానాలు చేశారు.అందుకే వాటి వరకు పరిమితం అవుతున్నాను. ప్రస్తుతం వాటి వరకే పరిమితం అవుతాను. చిత్తూరు జిల్లాలో జరిగిన సమావేశంలో జిల్లాకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ఇతర జిల్లాల నుండి వచ్చిన రైతునేతలు ఇంతకు ముందు కూడా ఎప్పుడూ ప్రస్తావించ లేదు కాబట్టి వారిని గురించి నేను పట్టించుకోను. పోనీ చిత్తూరు జిల్లా నుండి సమావేశంలో పాల్గొన్న వారికి జిల్లాకు జరుగుతున్న అన్యాయం తెలిసి వుంటే ప్రస్తావించి తీర్మానం చేయించి వుండాలి. ఒకవేళ తెలిసినా ఎందుకులే అని వున్నారా?
ప్రతి సందర్భంలో సీమలో చిత్తూరును కలుపుతారు. అంత వరకు సంతోషమే. అయితే చిత్తూరు జిల్లా సాగునీటి సమస్యలు ఎందుకు పట్టించుకోరు.? సాగునీటి సాధన సమితి డిమాండ్లు చూడండి. చిత్తూరు జిల్లా పథకాల ప్రస్తావన ఒక్కటైనా వుందా?
గాలేరు నగరి రెండవ దశ పథకం దాదాపు మంగళం పాడబోతున్నారు. ఈ పథకంలో చిత్తూరు జిల్లా కు 11 టియంసిలు కడప జిల్లా కు 22 టియంసిల డిపిఆర్ లో చేర్చ బడివుంటే గండికోట16 టియంసిలుగా వుంటే 26 టియంసిలకు పెంచి డిపిఆర్ లో లేని తుంగభద్ర ఎగువ ఆయకట్టు కు ఎత్తిపోతలు పెట్టారు. అదే సమయంలో చిత్తూరు జిల్లా కు చెందిన రెండవ దశ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంది.ఎవరి కాలంలో కూడా నిధులు విడుదల కాలేదు.
30 ఏళ్లు గడుస్తున్నా కడప జిల్లా సర్వారాయ సాగర్ వరకు ప్రధాన కాలువ వచ్చి ఆగిపోయింది. అంతేకాదు. ఇటీవల ముఖ్యమంత్రి పులివెందుల రాయచోటి ప్రాంతాలకు గండి కోట నుండి ఎత్తిపోతలు పథకాలు మొదలు పెట్టారు. మాట వరసకు చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇస్తామన్నారు. వెలిగల్లు దాటి నీళ్లు వెళ్లవు. ఇక చిత్తూరు జిల్లా కుచెందిన గాలేరు నగరి రెండవ దశ కు నీళ్లు ఎక్కడ వుంటాయి.? ఆవిరి పారుదల నష్టం పోగా మిగిలేది 32 టియంసిలు. మరి గండికోట నుండి ఇన్ని ఎత్తిపోతలు పైగా 20 టియంసిలతో మరొక రిజర్వాయర్ నిర్మించితే రెండవ దశ పథకం ఇంకెక్కడిది?ఇది అన్యాయం అని ఎవరైనా చెబుతున్నారా?
మీకు అందరికి తెలుసు. రాయలసీమలో అన్ని జిల్లాల్లోఒక్కో జిల్లాకు కనీసం 25 టియంసిల కు తక్కువ కాకుండా రిజర్వాయర్ లు వుంటే చిత్తూరు జిల్లాలో
5.56 టియంసిల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ లు మాత్రమే వున్నాయి.
తిరుపతిలో జరిగిన సమావేశంలో ఈ అంశాలు చిత్తూరు జిల్లా వాసులు తెలిసి ప్రస్తావించ లేదో తెలియక ప్రస్తావించ లేదో కనీసం సీమ సాధన సమితి నాయకులు కూడా ప్రస్తావనకు తీసుకు రాలేదంటే……….
అంతే కాదు. సోమశిల స్వర్ణ ముఖి లింక్ కెనాల్ నిర్మాణం ఆగిపోయింది. ఈ బడ్జెట్ లో 40 కోట్లు కేటాయించారు. ఇంత వరకు ఒక్క పైసా విడుదల కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లా కడుపు మంట రాయలసీమ జిల్లాల్లో పోల్చుకుంటే సాగునీటి రంగంలో చాలా తక్కువ. తిరుపతి సమీపంలోఈ అంశాలపై ఎందుకు తీర్మానం చేయ లేదు?
నేను గతంలో చాలా మార్లు రాశాను. దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎపి ఎదిగే వరకూ ప్రత్యేక సాయం కావాలని కోరే మీరు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి చెందే వరకు వెనుకబడిన జిల్లా లకు ప్రత్యేకంగానిధులు ఎందుకు ఇవ్వని చంద్రబాబునాయుడు నిలదీశాను. ఇప్పుడు సీమ సాధన సమితి నేతలను ఇదే ప్రశ్న అడుగు తున్నాను. సీమలో మూడు జిల్లాల్తో చిత్తూరు జిల్లా కూడా సాగు నీటి రంగంలో అభివృద్ధి కావాలని ఎందుకు డిమాండ్ చేయరు.
( వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు 9848394013)