పై ఫోటో విజయవాడ పాయికాపురం ఎల్ బిఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాలది. ఇక్కడ తరగతి గదులు లేక విద్యార్ధులఎంత అవస్థ పడుతున్నారో ఈ ఫోటో చెబుతుంది.
ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నత పాఠశాల,మునిసిపల్ ప్రాథమిక పాఠశాల పక్కపక్కనే ఉంటాయి.
నాలుగేళ్ల క్రితం ఉన్నత పాఠశాలకు భవనాలు మంజూరయ్యాయి. భవనాలుకట్టేందుకు ప్రభుత్వానికి స్థలమే దొరకలేదు. దాని వల్ల భవనాలను ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో కట్టాలనుకున్నారు. నిర్మాణం చేపట్టారు. అయితే సగం నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు
దీంతో మెండి గోడల మధ్యలోనే పాఠాలు చెబుతున్నారు. మరోపక్క ఉన్నత పాఠశాలకు చెందిన భవనం పై అంతస్తు కప్పు కూలడానికి సిద్ధంగా ఉంది. ముందు జాగ్రత్తగా కొన్ని క్లాసులకు తాళాలు వేశారు. దీనితో తరగతులు కొరత మొదలయింది. ఒకే క్లాస్ రూంలో రెండు మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. అక్కడ బోధన ఎలా ఉంటుందో వూహించవచ్చు.
ఒక క్లాసులో కేవలం 20 మంది లేదా 30 మంది విద్యార్థులు కూర్చోవలసి ఉన్నా ఇపుడు వందమంది కూర్చుంటున్నారు.
కొంతమంది విద్యార్థులు వరండాలో కూర్చోని పాఠాలు వినపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇపుడు నూతన ప్రభుత్వం అమ్మఒడి పథకం తెచ్చింది గదా. ఈ ఏడాది మరో 200 మంది పిల్లలు అదనంగా ఈ పాఠశాలలో చేరారు. దీనితో ఇక పరిస్థితి ఎలా ఉంటుందో వూహించండి. వాళ్ల ఇబ్బంది తారాస్థాయికి చేరింది.
దీనిపై స్పందించాల్సిన పాలకులు కానీ ,విద్యాశాఖ అధికారులు గాని పట్టించుకోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే పాఠాలు వింటున్నారు.
కంపెనీలకు వందల ఎకరాలు పరిగెత్తుకుంటూ వెళ్లి అప్పనంగా ఇచ్చేస్తారు.
పాఠశాలలకు స్థలం కొరత వచ్చింది. అంత విజయవాడలో వేయిగజాల స్థలం దొరకడం లేదు. చదువు మీద, స్కూళ్ల మీద ఖర్చు పెట్టడమంటే భావితరాల మీద పెట్టుబడి పెట్టడమే కదా.
చదవు మీద ఖర్చు పెట్టేదంతా ఇన్వెస్టు మెంటుగా ప్రపంచమంతా చూస్తారు.
మరలాంటపుడు ఇన్వెస్టర్ల మీద చూపే వల్ల మాలిన ప్రేమ పాఠశాలలకు స్థలాలు కేటాయించడంమీద ఎందుకూ చూపరో అర్థంకాదు.
అమరావతి వీడియో జర్నలిస్టులు చొరవ తీసుకుని ఈ పాఠశాలపరిస్థితి ప్రభత్వం దృష్టికి తీసుకువస్తున్నారు.