ఆందోళన చేస్తున్న రైతుల మీదకు కొత్త తరహాలో వాహానాలను తోలడం అనే ఆయుధాన్ని పాలక వర్గం ప్రయోగిస్తున్నది. లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri), నారాయణ్ ఘడ్ (Naraingarh) ఘటనలు ఈ ఆయుధాన్ని స్పష్టంగా చూపించాయి.
(రాఘవశర్మ)
‘ఆందోళన చే స్తున్న రైతులను వాహనాలతో తొక్కి చంపించేస్తారా!? , సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప నిందితులను అరెస్టు చేయరా!?, ఉత్తర ప్రదేశ్ లో అసలు చట్ట బద్ద పాలన ఉన్నదా !?” అన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
అంతేకాదు, ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం గత ఆదివారం నాడు రైతుల మీదకు వాహనాన్ని తోలి నలుగురి మృతి కారణమయిన సంఘటన జరిగినపుడు జూనియర్ మిశ్రా ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు మొబైల్ సెల్ టవర్ సిగ్నల్స్ చెబుతున్నాయి.
సుప్రీంకోర్టు ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం తర్వాత కేసు కొత్త మలుపు తిరుగుతూ ఉంది.
We are not merits. The allegation is 302 (Section 302 IPC Murder offence). Treat him the same way we treat other persons in other cases,” అని జస్టిస్ రమణ చాలా స్పష్టంగా ఆదేశించారు. అంతే, ఉత్తర ప్రదేశ్ పోలీసు యంత్రాంగం కదలక తప్పలేదు. జస్టిస్ రమణ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.” ఈ కేసులో సిబిఐవిచారణ కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే, మీకు తెలిసిందే, ఇందులో అలాంటి వ్యక్తుల ప్రమేయం ఉంది,” అని కూడా అన్నారు.
మాటల కందని విషాదాన్ని మిగిల్చి న లఖింపూర్ ఖేరి దారుణ సంఘటన ఇలా అనేక ప్రశ్నల ను మన ముందుకు తెచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లా టికోనియా గ్రామంలో గత ఆదివారం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకురావడంతో ఈ సంఘటన జరిగింది.
రైతులపైకి దూసుకొచ్చిన కారును కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కుమారుడు అశీష్ మిశ్రా స్వయంగా నడుపుతున్నట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
అశీష్ మిశ్రాను పట్టుకోడానికి ప్రయత్నించిన ఒక రైతును రివాల్వర్‌తో కాల్చి చంపి పారిపోయాడన్నది కూడా వారి వాదన.
ఈ దారుణ సంఘటనలో కేంద్రమంత్రి కుమారుడు నిందితుడుకావడంతో అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ, ఇటు ఉత్తర ప్రదేశ్‌లోని యోగీ ప్రభుత్వం కానీ స్పందించలేదు.
దీంతో ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటాగా స్వీకరించి గురువారం నుంచి విచారణ చేపట్టింది.
ఎనిమిది మంది మృతి చెందినా, నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని అత్యున్నత ధర్మాసనం యోగీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీంతో కదిలిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణ సంఘటనకు బాధ్యులుగా భావించిన ఇద్దరిని అరెస్టు చేసింది.
స్వయంగా వాహనాన్ని నడుపుతూ ఇందరి ప్రాణాలు తీయడానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాను విచారణకు రావలసిందిగా నోటీసులు మాత్రం జారీ చేసి చేతులు దులుపుకుంది.
శుక్రవారం ఉదయం డీఐజీ ఆధ్వర్యంలోని పోలీసు అధికారుల బృందం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా మంత్రి కుమారుడు విచారణకు రాలేదు.
‘ అన్ని హత్య కేసుల్లో ఇలాగే ప్రవర్తిస్తారా? నిందితులను ఇలాగే బతిమాలతారా?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పోలీసులను ప్రశ్నించారు.
దీంతో మంత్రి తనయుడు విచారణకు వచ్చేలా బతిమాలి శనివారం రప్పించుకున్నారు. విచారణానంతరం విధిలేక ప్రధాన నిందితుడైన అశిష్ మిశ్రాను అరెస్టు చూపించారు.
లఖింపూర్ సంఘటనను పోలిన మరో సంఘటన గురువారం హర్యానాలోని అంబాలా సమీపంలో జరిగింది.
బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నాయబ్ సింగ్ సైని కారు అంబాల జిల్లా నారాయణ్ గడ్ లో వెళుతుండగా, రోడ్డుకు ఇరువైపులా రైతులు నిలబడి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అంతే, బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు రైతులపైకి దూసుకు వచ్చేసింది.
దీంతో భావన్ ప్రీత్ అనే రైతు తీవ్రంగా గాయపడగా, పలువురు రైతులు తప్పించుకున్నారు.
ఈ రెండు సంఘటనలను గమనిస్తుంటే, ఆందోళన చేస్తున్న రైతులను వాహనాలతో తొక్కించేసి చంపేయాలనుకున్నారా!? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ఉత్తరప్రదేశ్ లోని హత్రాలో ఒక దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తరువాత అంతగా దేశాన్ని కుదిపేసిన ఈ లఖింపూర్ ఖేరి సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగా ఆదిత్యనాథ్ స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించిన వీడియోను గమనిస్తుంటే, మంత్రి కాన్వాయ్‌లోని కారు ఏదో ప్రమాద వశాత్తు దూసుకొచ్చినట్టు కనిపించడం లేదు.
ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
వీటిని ఎదుర్కోడానికి కేంద్రమంత్రి కాన్వాయ్ పైన సిక్కు వేర్పాటు వాదులు రాళ్ళతో దాడిచేశారని, దాంతో వాహనం అదుపుతప్పి రైతులపైకి దూసుకు వచ్చిందని బీజేపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు.
రైతులు శాంతి యుతంగాగానే ఆందోళన చేస్తున్న విషయం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
రైతులపైకి వాహనంతో దూసుకొచ్చిన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాపై పోలీసులు ఎస్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్ప అతన్ని అరెస్టు చేయలేదు.
బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను, పంజాబ్ ముఖ్యమంత్రి ఎస్. చరణ్ జిత్ సింగ్ చెన్నీని, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ రణ్ ధావాను షాహరాన్ పూర్ జిల్లాలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని నిర్బంధించారు. ఇలా చేయడం చట్టవ్యతిరేకమని తెలిసినా యోగీ ప్రభుత్వానికి లెక్కలేదు.
రాజకీయంగా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని 144 సెక్షన్ విధించడం సర్వసాధారణం.
ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం, తిరిగి వెళ్ళనీయకుండా చేయడం కూడా దానికి పరిపాటే.
అదే ఇప్పుడు జరిగింది.
ప్రజలను, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులను స్వేచ్చగా తిరగనిస్తే యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. దీంతో అసలు ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ బద్ధపాలన నడుస్తోందా, లేదా అన్నది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత ఆ ప్రాంతానికి ప్రతిపక్ష నాయకులను అనుమతించారు. ఈ మూడు రోజుల్లో బాధిత కుటుంబాలకు సహాయాన్ని ప్రకటించి, వారిని నోరెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంత దారుణం జరిగినా అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించలేదు. ఆయన శాఖను మార్చలేదు. కనీసం వివరణ కూడా కోరినట్టు లేదు. ప్రధాని చూసీ చూడనట్టు ఉండిపోయారు. అజయ్ మిశ్రా గత చరిత్ర మచ్చలేనిదేమీ కాదు.
టికోనియా గ్రామంలోనే సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రభాత్ గుప్తా, అలియాస్ రాజు 2000లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అజయ్ మిశ్రా నిందితుడు. సెషన్స్ కోర్టులో అజయ్ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ,కేసు హైకోర్టులో పునర్విచారణ జరిగింది. ఈ కేసు విచారణ హైకోర్టులో 2018లో పూర్తిఅయినప్పటికీ, తీర్పును రిజర్వులో ఉంచి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ‘ఈ హత్యకేసులో నిందితుడు కేంద్రమంత్రి కనుక, విచారణ పూర్తి అయ్యి మూడేళ్ళయినా తీర్పు అలా ఎలా వెలువడుతుంది!?” అన్నది సామాన్యుల ప్రశ్న.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేరస్థులకు రక్షణ కల్పించడం, బాధితులను, వారి తరపున మాట్లాడే వారిని జైళ్ళలో కుక్కడం రివాజుగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు దేశంలోని వ్యవస్థలన్నిటినీ ఇలా హైజాక్ చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లఖింపూర్ ఖేరి ఘటనతో దేశమంతా ఉడికిపోతున్నా, మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాత్రం దీనిపై నోరిప్పడంలేదు.
ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నోలో ‘ఆజాద్ అమృత్ మహోత్సవ్’లో భాగంగా 75 అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు.
అసలు లఖింపూర్ ఖేరి సంఘటన లాంటిదేమీ జరగనట్టు, ప్రధాని ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తూ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వ విజయాలను కీర్తించారు. ఏడు సంవత్సరాలుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీని ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా చూడాలన్న భారతీయుల ఆశలు దీంతో పూర్తిగా అడిఆశలయ్యాయి.లఖింపూర్ ఖేరి సంఘటన నేపథ్యంలో బీజేపీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎనభైమంది ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి గురువారం కొందరికి ఉద్వాసన పలికారు.
లభింపూర్ ఖేరిలో జరుగుతున్న రైతుల ఆందోళనను సమర్థించినందుకు వరుణ్ గాంధీని, ఆయనతల్లి మేనకా గాంధీని బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. ‘హత్యలతో నిరసన కారుల నోళ్ళు మూయించలేరు’ అని వరుణ్ గాంధీ చేసిన ట్వీట్ ఆపార్టీలో సంచలనం సృష్టించింది. దీంతో వచ్చే ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల నాటికి మేనగా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీతో తెగతెంపులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడాదిగా జరుగుతున్న రైతుల ఆందోళనను సమర్థిస్తున్నందుకు హర్యానాకు చెందిన ఎంపీ బీరేంద్ర సింగ్ను కూడా కార్యవర్గం నుంచి తొలగించారు. పెగాసెస్ గూఢచర్యాన్ని బాహాటంగా వ్యతిరేకించి, నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామిని కూడా జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. ఏమాత్రం భిన్నాభిప్రాయాలకు కానీ, ప్రజాస్వామ్య ఆలోచనకు కానీ బీజేపీలో చోటు లేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ గెలుపు ధీమాపై లఖింపూర్ సంఘటన నీళ్ళు చల్లినట్టయింది.
(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/new-video-lakhimpur-kheri-car-killing-farmers/