కడప విమాన సర్వీసులమీద జగన్ కు చంద్రబాబు లేఖ

కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రతిపక్షనాయకుడు, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

ప్రాథమిక, పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకం. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా రవాణా సౌకర్యమనేది ప్రధానం.

అందరికి విమాన సదుపాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైర్-2, టైర్ – 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయం మీకు విధితమే.

గతంలో కడప నుంచి హైదరాబాద్ లేదా విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే ప్రజలు తిరుపతి, చెన్నై, బెంగుళూరుకు వెళ్లవలసి వచ్చేది.

దీని వల్ల సమయం వృధా అవడమే కాకుండా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కూడా ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2018 లో తెలుగుదేశం ప్రభుత్వం కడప నుంచి వివిధ ప్రదేశాలకు విమాన సేవలను ప్రవేశపెట్టింది.

దీంతో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల ప్రజలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాలకు ప్రయాణించేందుకు విమాన సర్వీసులను సద్వినియోగం చేసుకున్నారు. దీని వల్ల ప్రజలకు డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అయింది.

అయితే ప్రస్తుతం కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో పెట్టుబడిదారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

కడప నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, కడప, ఇతర ముఖ్య పట్టణాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలి. కడప, ఇతర ప్రాంతాల ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

ఉడాన్ పథకం అంటే ఏమిటి?

2016 అప్పటి కేంద్ర ప్రభుత్వం  ప్రాతీయ పట్టాణల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించేందుకు “నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016 ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకటించడానికి ముందు దేశంలో జిల్లాకేంద్రాల మధ్య విమాన సర్వీసులు నడిపితే ఎలా ఉంటుందనే (Economic benefits of civil aviation: ripples of prosperity) సర్వే జరిగింది.విమాన సర్వీసుల మీద రు 100 ఖర్చు పెడితే, రు.325  ప్రయోజనం ఉంటుందని ఈ సర్వేలో తేలింది. విమాన సర్వీసుల్ల ప్రత్యక్షంగా 100 ఉద్యోగాలు కల్పిస్తే,  పరోక్షంగా 610 మందికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రపంచ జిడిపిలో  విమాన సర్వీసులు వాట 4.5 శాతమని ఈ సర్వే చెప్పింది.

అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలనే ఉద్దేశంతో  అప్పటి ప్రభుత్వం కడప, రాజమండ్రి, తదితర విమానాశ్రయాల మధ్య సర్వీసులును ప్రారంభించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *